సాగు.. భారం!

ABN , First Publish Date - 2021-06-21T05:12:27+05:30 IST

రైతన్నలకు సాగు భారమవుతోంది.

సాగు.. భారం!
ట్రాక్టర్‌తో కరిగేడు చేస్తున్న రైతు

  • రంగారెడ్డి జిల్లాలో 5,24,333 ఎకరాల్లో సాగు అంచనా
  • చమురు మంటతో పెరిగిన పెట్టుబడులు
  • ఆకాశాన్నంటిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
  • విత్తనానికి ముందే రైతుల దిగులు


రైతన్నలకు సాగు భారమవుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పైపైకి పోతుండటంతో ట్రాక్టర్లు, యంత్రాల కిరాయిలు కూడా పెరుగుతున్నాయి. దీంతో పెట్టుబడులు పెరిగి వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంటోంది. యాంత్రీకరణ కోసం నిధులు కేటాయించినట్టు ప్రభుత్వం చెబుతున్నా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ఆధునిక పనిముట్లు అందుబాటులో లేకపోవడం, ట్రాక్టర్లకు కిరాయిలు భారీగా పెరిగిపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఏ పల్లెలో చూసినా రైతుల ఇళ్ల ఎదుట కాడెద్దులు, పశువులు, వ్యవసాయ సామగ్రి కనిపించేవి. కాలక్రమేణా ఎడ్ల పోషణ భారంగా మారడం.. కూలీలు దొరక్కపోవడం, కూలీ రేట్లు ఎక్కువ కావడంతో సేద్యపు ఎడ్లు, పనిముట్ల స్థానాన్ని ట్రాక్టర్లు, యంత్రాలు ఆక్రమించాయి. ఇప్పుడు కాడెద్దులు కరువయ్యాయి. దుక్కి దున్నడం మొదలు పంట కోత వరకు, మందుల పిచికారి కోసం కూడా యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. అనూహ్యంగా పెరిగిన డీజిల్‌ ధరలు, ఇప్పుడు రైతులకు అదనపు భారం అవుతు న్నాయి. రైతులు పాత పద్ధతుల్లో సాగు చేయలేక కొత్త పద్ధతులు అందుకోలేక రైతులు సతమతమవుతున్నారు. చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. 

జిల్లాలో నియంత్రిత సాగు విధానం అమలు చేయడంతో ఈసారి పత్తి, కంది, వరి జొన్న పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. పెరుగుతున్న చమురు ధరల కారణంగా యంత్రాలతో వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఏటేటా రైతుపై భారం పెరుగుతోంది. యాంత్రీకరణ వైపు దృష్టి సారించాలని కేంద్రం ఓ వైపు ప్రోత్సహిస్తూనే మరో వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచి నడ్డి విరుస్తోంది. దీంతో రైతులు సాగు విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. నేల తల్లిని నమ్ముకుని సాగు తప్ప.. మరో పని తెలియని వారు ఏటా వ్యవసాయంలో నష్టాలే చవిచూస్తున్నారు. దుక్కులు దున్నడం మొదలుకుని పంటలు చేతికి వచ్చేంత వరకు యంత్రాలతోనే పనులు చేయించే రైతులకు పెట్టుబడి భారంగా మారుతుంది. ఇప్పటికే పెట్టుబడులతో సతమతమవుతున్న వారికి చమురు ధరల పెంపుదల మింగుడుపడటం లేదు. 


అదనపు భారం.. 

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. దుక్కి దున్నించడానికి ట్రాక్టర్‌ అద్దె గంటకు పనిని బట్టి చార్జీలు తీసుకుంటున్నారు. కల్టీవేటర్‌కు, డిస్క్‌లతో దున్నితే, రోటోవేటర్‌ వేసేందుకు ప్లవ్‌ చేసేందుకు కడిగేడు చేసేందుకు గుంటు వేసేందుకు చార్జీలు పెరిగిపోయాయి. ఎకరం బీడు భూమి దున్ని పత్తి, మొక్కజొన్న సాగు చేసేందుకు రూ.8000-10,000 వరకు ఖర్చు వస్తుంది. గత సంవత్సరంలో 30 శాతం డీజిల్‌ ధరలు పెరగడంతో టాక్టర్ల చార్జీలు పెరిగాయి. సాగు ఖర్చులు పెరిగిపోవడంతో క్రమంగా సేద్యానికి దూరం కావాల్సి వస్తుంది. గడిచిన ఖరీఫ్‌, యాసిగితో పోలిస్తే ప్రస్తుతం పంటల సాగుకు పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ట్యాక్స్‌లు తగ్గేనా?

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో 60 శాతం వాటా ప్రభుత్వాలకు ట్యాక్స్‌ల ద్వారా వెళ్తున్నాయి. ఇప్పట్లో ట్యాక్స్‌లను తగ్గించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే కరోనా వలన ల్యాక్స్‌ కలెక్షన్‌ తగ్గింది. దీంతో పెట్రో ప్రొడక్ట్‌లపై వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వాలు వదులుకునే అవకాశం ఇప్పట్లో లేదు పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చే అవకాశాలూ కనిపించడం లేదు.


డీజిల్‌ ధరలతోనే చార్జీల పెంపు

డీజిల్‌ ధరలు పెరగడంతోనే ట్రాక్టర్ల చార్జీలు పెంచాల్సి వచ్చింది. చమురు ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.  గత సంవత్సర కాలంగా చమురు ధరలు రూ. 25 నుంచి రూ. 30వరకు పెరిగాయి. తప్పని పరిస్థితుల్లో చార్జీలను పెంచాల్సి వచ్చింది. 

- పి. శ్రీశైలం, ట్రాక్టర్‌ యజమాని, కొండన్నగూడ


పెట్టుబడులు మీద పడుతున్నాయి

డీజిల్‌ ధరలతోపాటు కూలీల ధర పెరగడంతో వ్యవసాయంలో నష్టం వస్తుంది. గత సంవత్సరం 20 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న సాగు చేశాను. నా సొంత పొలంతో పాటు కౌలుకు తీసుకున్న పొలం సాగు చేయడం వల్ల రూ.2.40 లక్షల నష్టం వచ్చింది. దీంతో ఈసారి కౌలు పొలాన్ని వదులుకుని సొంత పొలం సాగు చేసుకుంటున్నాను. 

- ఎర్రోళ్ల యాదయ్య, రైతు, బైరంపల్లి 

-------------------------------------------

రంగారెడ్డి జిల్లాలో గతేడాది సాగైన పంటలు,  

ఈ ఏడాది వానాకాలం సాగు అంచనా ఎకరాల్లో..


పంట సాగైన పంట సాగు అంచనా

(2020) (2021)

పత్తి 2,73,227 3,10,000

కందులు 69,808 1,12,000

వరి 71,613 45,573

జొన్న 28,425 28,500

మొక్కజొన్న 00 22,000

పెసర 518 550

మినుములు 140 140

వేరుశనగ 00 60

ఆముదం 341 341

చెరకు 36 37

ఇతర పంటలు 27,685 5,132

మొత్తం 4,71,793 5,24,333

-------------------------------

చమురు ధరల పెరుగుదలతో భారం(రూపాయల్లో..)

పని 2020 2021

కల్టివేటర్‌ 600 800

డిస్క్‌లు 800 900

రోటావేటర్‌ 1200 1,400

ప్లవ్‌ 700 900

కరిగెడు వీల్స్‌ 1,100 1300

గుంటుక 600 700

-----------------------------

చమురు ధరలు

పెట్రోల్‌ :రూ. 100.46

డీజీల్‌ : రూ. 95.28




Updated Date - 2021-06-21T05:12:27+05:30 IST