బ(బి)ందు సేద్యం

ABN , First Publish Date - 2021-01-21T06:20:58+05:30 IST

కూలీల కొరత నేపథ్యంలో ప్రస్తుతం రైతులకు డ్రిప్‌ ద్వారా సాగు చేయడమే సౌలభ్యంగా ఉంది.

బ(బి)ందు సేద్యం
బిందు సేద్యం ద్వారా సాగవుతున్న పంట (ఫైల్‌)

నిలిచిన సబ్సిడీ డ్రిప్‌లు, స్ర్పింకర్ల పంపిణీ

మూడేళ్లుగా ముందుకు సాగని పథకం

కావాలనుకునే వారు ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సిందే 

రైతులకు సబ్సిడీపై అందజేసే డ్రిప్‌ (బిందు సేద్యం) పథకం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడేళ్లుగా నిలిచిపోయింది. పీవీసీ ధరలు పెరగడంతో డ్రిప్‌ కంపెనీలు చేతులెత్తేశాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం సబ్సిడీపై, చిన్న, సన్నకారు రైతులకు 90శాతం సబ్సిడీ ఇవ్వగా అయిదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు 80శాతం సబ్సిడీపై డ్రిప్‌, స్ర్పింకర్లు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం వీటికి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం లేదు. పండ్ల తోటలను సాగుచేసే రైతులకు మాత్రమే సబ్సిడీ పరికరాలను అందిస్తుండటంతో మిగిలిన వారు ప్రైవేటులో కొనలేక బిందు సేద్యంపై ఆసక్తి చూపడంలేదు. 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ)

కూలీల కొరత నేపథ్యంలో ప్రస్తుతం రైతులకు డ్రిప్‌ ద్వారా సాగు చేయడమే సౌలభ్యంగా ఉంది. బత్తాయి, నిమ్మ, చెరుకు, కూరగాయల సాగుకు డ్రిప్‌ ఏర్పాటు చేసుకోవడమే మేలు. వ్యవసాయ బావులు, బోర్ల నుంచి పంటలకు నీటితడి కట్టాలంటే రైతుకు ఆర్థిక ఇబ్బందులు తప్పడంలేదు. నీటి సరఫరా చేయాలంటే ఒక వ్యక్తికి నెలకు రూ.10వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినా కూలీల కొరత మూలంగా సకాలంలో పంటలకు నీటిని అందించలేకపోతున్నారు. సాగుచేసిన పంటలకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు రావడంలేదు. తోటలకు తోటలను తొలగించేస్తున్నారు. ఈ పరిస్థితిలో కూలీలతో పంటలకు నీటిని అందించడం సాధ్యంకాని పని. పీవీసీ ధరలు పెరిగి ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ మొత్తం ఏమాత్రం సరిపోకపోవడంతో కంపెనీలు డ్రిప్‌ ఏర్పాటుకు ముందుకు రావడంలేదు. జిల్లా అధికారులు తమ పరపతిని ఉపయోగించి పథకం ఉందీ అనిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 2020 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4వేల ఎకరాల్లో డ్రిప్‌ ఏర్పాటు చేయాలనేది లక్ష్యం కాగా పరిస్థితులు అనూకూలించక, కంపెనీలు సహకరించక 800 ఎకరాలకు మించి ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. 4వేల మంది రైతులు ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. గతంలో పండ్ల తోటలతోపాటు కూరగాయలు, పత్తి, ఇతర మెట్టపంటలకు కూడా డ్రిప్‌ మంజూరయ్యేది. కానీ ప్రభుత్వం ప్రస్తుతం పండ్ల తోటలకు మాత్రమే అది కూడా కొద్ది ఎకరాలకే పరిమితం చేస్తోంది. 


అధిక ధరలకు కొనుగోలు

మార్కెట్‌లో ప్రైవేటుగా లభించే డ్రిప్‌ పరికరాలు కొనుగోలు చేసుకొని పంటలకు నీరు అందిస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.10వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. మార్కెట్‌లో లభించే డ్రిప్‌ నాణ్యత అంతంత మాత్రంగానే ఉంటోంది. అయినా విధిలేని పరిస్థితుల్లో రైతులు ప్రైవేటుగా మార్కెట్‌లో లభించే డ్రిప్‌ పరికరాలు కొనుగోలు చేసుకుంటున్నారు. రైతుల బలహీనతను ఆసరాగా చేసుకొని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. 


ఏడాది నుంచి డ్రిప్‌ ఇవ్వడం లేదు :కారింగు వెంకన్న, పొనుగోడు, కనగల్‌ మండలం 

ఏడాది క్రితం డ్రిప్‌నకు దరఖాస్తు చేసుకున్నా. నాకు ఇప్పటి వరకు డ్రిప్‌ అందజేయలేదు. దీంతో తోట పెట్టుకోలేకపోతున్నా. కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. సత్వరమే  మంజూరు చేయాలి. 

Updated Date - 2021-01-21T06:20:58+05:30 IST