జిల్లాలో సాగు పండుగ ప్రారంభం

ABN , First Publish Date - 2021-06-15T04:56:09+05:30 IST

తొలకరి పలకరించడంతో అన్నదాతలు ఉత్సాహంగా విత్తనాలు నాటే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

జిల్లాలో సాగు పండుగ ప్రారంభం

విస్తారంగా వర్షాలు

సాధారణ వర్షపాతానికి మించి నమోదు

జోరుగా పత్తి విత్తనాలు నాటుతున్న రైతాంగం

జిల్లాలో ఈ సారీ పత్తిదే పైచేయి

ద్వితీయ ప్రాధాన్య పంటగా కంది

(ఆంధ్రజ్యోతి, అసిఫాబాద్‌)

తొలకరి పలకరించడంతో అన్నదాతలు ఉత్సాహంగా విత్తనాలు నాటే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా గడిచిన 72గంటల్లో చెదురు మదురు వర్షాలు కురియడంతో రైతాంగం గతేడాదిలాగే జూన్‌ రెండోవారంలోనే విత్తనాలు నాటుతున్నారు. ఇప్పటికే 15మండలాల్లో 30శాతానికి పైగా విత్తనాలు నాటే ప్రక్రియ పూర్తయింది. ఊహించినట్లుగానే ఈసారి కూడా జిల్లాలో సింహభాగం పత్తి పంటనే సాగు చేస్తున్నారు. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం 3.5లక్షల ఎకరాల్లో సాగు కావచ్చని భావిస్తుండగా దీనికి అదనంగా మరో 15నుంచి 20వేల ఎకరాల్లో పత్తిసాగు పెరిగే అవకాశముంది. ఇందుకు కారణం లేకపోలేదు. గతే డాది పంట ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పత్తి పంటకు పెద్దపీట వేసినప్పటికీ ఇతర పంటల సాగుపైన మారిటోరియం విధించింది. ఈ క్రమంలో చాలామంది రైతులు కంది పంటను తగ్గించి ఇతర తృణ ధాన్యాల పంటలను సాగుచేశారు. అంతే కాకుండా గతేడాది పత్తి దిగుబడులకు మార్కెట్‌లో గణనీయమైన మద్దతు ధర లభించింది. దాంతో ఈసారి పత్తి పంటను సాగు చేసేందుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు. అదీ కాకుండా పత్తిలో అంతరపంటగా కందిసాగు చేసే అవకాశం ఉండటం కూడా రైతాంగం పత్తిసాగు వైపే మొగ్గు చూపడానికి కారణంగా చెబుతున్నారు. జిల్లాలో పత్తి తరువాత ద్వితీయ స్థానంలో కందిపంటే అధిక విస్తీర్ణంలో సాగు కానుంది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం రమారమి 60వేల హెక్టార్లలో కంది పంట సాగు చేసే పరిస్థితి ఉందంటున్నారు. గడిచిన రెండ్రోజులుగా విత్తనాలు నాటేందుకు అవసరమైన స్థాయిలో వర్షాలు కురుస్తుండ టంతో రానున్న నాలుగైదు రోజుల్లో విత్తనాలు నాటే ప్రక్తియ 90శాతానికి పైగా పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రైతుల డిమాండుకు తగ్గట్లుగా ఇప్పటికే వ్యవసాయ శాఖ జిల్లాలోని 226 విత్తన దుకాణాల్లో వివిధ రకాల విత్తనాలను అందుబాటులో ఉంచింది. నేల స్వభావాన్ని బట్టి రైతులు విత్తనాలను ఎంపిక చేసుకు నేందుకు ఇప్పటికే మండలస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. వరి నాట్లకు మరో రెండు నెలల సమయం ఉండగా రైతులు ముందుగానే నారు సిద్ధం చేసుకు నేందుకు వీలుగా వరి విత్తనాలను కూడా సిద్ధంగా ఉంచారు. సాంప్రదాయ వరి రకాలతో పాటు వాణిజ్యపరమైన వరి సాగుకు కూడా అనువైన విత్తనాలు డీలర్ల వారీగా అందుబాటులో ఉం చేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే వానాకాలం పంటల కోసం మొదటి దఫా ఎరువులను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 

జిల్లాలో సాగయ్యే పంటలివే..

ఈ ఏడాది వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో మొత్తం 4,46,777ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఇందులో పత్తి 3,35,178 ఎకరాలు, వరి 54,611ఎకరాలు,  కందులు 46వేల ఎకరాల నుంచి 60వేల ఎకరాలు, సోయా 2500 నుంచి 3000 ఎకరాలు, జొన్న 2,962 ఎకరాలు, పెసర 3015 ఎకరాలు, మినుములు, శనగ, ఆముదం, మొక్కజొన్న, సజ్జ వంటి ఇతర పంటలు మరో 2000 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు.

జిల్లాలో వర్షపాతం వివరాలు.. 

నైరుతి రుతుపవనాలు విస్తరించడంతోపాటు అల్పపీడనం కారణంగా జిల్లా అంతటా చెదురు మదురు వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 72గంటలుగా అక్కడక్కడా కురిసిన వర్షాలు ఆదివారం ఉదయం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు సేకరించిన సమాచారం ప్రకారం జిల్లా అంతటా సాగు పనులకు అవసరమైన స్థాయిలో కురిసినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం నమోదైన వర్షాపాతాన్ని పరిశీలిస్తే జిల్లాలోని 15మండలాల్లో సరాసరి 22.9మి.మీల వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యధికంగా తిర్యాణి మండలంలో 43.7 మి.మీల వర్షపాతం నమోదుకాగా ద్వితీయస్థానంలో ఆసిఫాబాద్‌లో 38.5మి.మీలు  వర్షపాతం నమోదయింది. మండలాలవారీగా వాంకిడిలో 22.8మి.మీ, జైనూరు 26.6మి.మీ, సిర్పూర్‌(యూ) 23.9మి.మీ, లింగాపూర్‌ 24.5మి.మీ, రెబ్బెన 18.8మి.మీ, కెరమెరి 28.9మి.మీ, కాగజ్‌నగర్‌ 27.3మి.మీ, సిర్పూర్‌(టి) 26.5మి.మీ, కౌటాల 16.6మి.మీ, చింతలమానేపల్లి 16మి.మీ, బెజ్జూర్‌ 5.9మి.మీ, పెంచికల్‌పేట్‌ 10.5మి.మీ, దహెగాం 13.1 మిమీ చొప్పున వర్షాపాతం నమోదైంది.

Updated Date - 2021-06-15T04:56:09+05:30 IST