Advertisement
Advertisement
Abn logo
Advertisement

సేద్యం సందిగ్ధం

- రైతుల్లో ఆందోళన.. అయోమయం

- యాసంగిలో వరి కొనబోమని తేల్చి చెప్పిన ప్రభుత్వం

- ఇంకా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టని అన్నదాతలు

- ఇప్పటికే ముగిసిన పలు పంటల సాగు సమయం

- ఏం చేయాలో పాలుపోని రైతులు


కామారెడ్డి, డిసెంబరు 1: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ సారి యాసంగికి ఎలాంటి కొనుగోళ్లు చేపట్టేది లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా కేంద్రంతో నడుస్తున్న ఈ మాటల యుద్ధం సోమవారానికి ఒక ముగింపునకు వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో వరి పండించే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు తప్ప మరోమార్గం లేని పరిస్థితి ఎదురైంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే అక్టోబరు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించారు. పప్పుదినుసులు, ఆకు కూరలు, కూరగాయలు, ఉద్యాన పంటలు, ఇతర వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని వివరించారు. అయితే ఈ కార్యక్రమాలు మెజార్జీ రైతులకు చేరువ కాలేదు. ఇంకొందరికి అర్థం కాక పంట మార్పిడికి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నామని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఎంత మందికి అర్థమైంది?

జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాల వల్ల కొందరు విద్యావంతులైన రైతులు మాత్రమే ప్రభుత్వం చెప్పిన విషయాలు, మార్కెట్‌ స్థితిగతులను అర్థం చేసుకుని సముఖత వ్యక్తం చేశారు. కానీ ఏళ్లుగా వరి సాగు మీద ఆధారపడ్డ వారు మాత్రం ఇప్పటికిప్పుడు మారాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది తమకు ఇతర పంటల సాగులో మెలకువలు తెలియవు. రెండోది తమ భూముల స్వభావం వరికి తప్ప ఇతర పంటలకు పెద్దగా అనుకూలించవన్న కారణం. మరోవైపు కొందరు రైతులు మాత్రం మిలర్లతో ముందే మాట్లాడుకుని ఇప్పటికే నారు వేసుకోవడం గమనార్హం.

ముగిసిన పంటల గడువు

ఆరుతడిపై అన్నదాతలు దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కొన్ని ప్రత్యామ్నాయ పంటల జాబితా విడుదల చేసింది. కాగా ఆ జాబితాలో ఇప్పటికే పలు పంటలకు గడువు ముగియడం విశేషం. ఏ పంట ఏ మాసంలో వేస్తే ఆశాజనకమో శాస్త్రీయంగా నిరూపితమయ్యాకే శాస్త్రవేత్తలు విత్తన గడువును నిర్ధేశిస్తుంటారు. వారి సూచనల క్రమంలో ఆరుతడి పంటలు సాగు చేయాలంటే మిగిలిన పంటలు నువ్వులు, పెసర, మినుములు పొద్దు తిరుగుడు, జొన్న మాత్రమే వేయాల్సి ఉంటుంది. వేరుశనగ సెప్టెంబరు 1 నుంచి నవంబరు 30లోగా విత్తుకోవాలి. శనగ అక్టోబరు 1 నుంచి నవంబరు 15, ఆవాలు అక్టోబరు 1 నుంచి నవంబరు 15, కుసుమ అక్టోబరు 15 నుంచి నవంబరు 15, ఆముదం సెప్టెంబరు 15 నుంచి నవంబరు 15 వరకు వేసుకోవాలన్నది శాస్త్రవేత్తల మాట. సకాలంలో విత్తనం వేస్తేనే దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. నిర్ధేశిత గడువు ముగిసాక వేస్తే పెట్టుబడి రావడం గగనమే. 

పంటలే లేవు.. జియో ట్యాగింగ్‌ ఎట్లా?

ప్రభుత్వం యాసంగి సాగు పంట పొలాలకు జియో ట్యాగింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. పంటల సాగు, దిగుబడి గణంకాలు స్పష్టంగా తెలియనుండగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, చేతికొచ్చే దిగుబడుల సమాచారం లెక్కలు పక్కాగా ఉంటుందనేది ప్రభుత్వం ఉద్దేశ్యం. మండల వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులు నమూనాగా రెండు గ్రామాల్లో 40 సర్వే సంఖ్యల్లో, జిల్లా వ్యవసాయాధికారి 20 సర్వే సంఖ్యల్లో పొలాలను ఖచ్చితంగా పరిశీలించాలని ఆదేశించారు. పొలాల్లోనే ట్యాబ్‌లతో ఫొటోలు తీసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా అక్కడి నుంచి పంట, విస్తీర్ణం, సాగు ప్రారంభించిన తేది వంటి వివరాలు క్రాప్‌ బుకింగ్‌ పోర్టల్‌లో నమోదు చేసేందుకు సాంకేతికతను వినియోగించుకోనున్నారు. అయితే జనవరి 15లోగా వివరాలు నమోదు చేయాలని ఆదేశించగా సదరు గడువులో సాధ్యమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement