మారనున్న సాగు ప్రణాళిక

ABN , First Publish Date - 2020-05-19T10:11:55+05:30 IST

వాన కాలం సాగు ప్రణాళికలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వ్యవసాయశాఖ తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక

మారనున్న సాగు ప్రణాళిక

తగ్గనున్న వరి విస్తీర్ణం

అందులోనూ సగం సన్న రకాలే..

మొక్కజొన్న పంటకు స్వస్తి 

కందులకు ప్రోత్సాహం 

ముఖ్యమంత్రి వ్యవసాయ సమీక్షతో చోటు చేసుకోనున్న మార్పులు 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌) : వాన కాలం సాగు ప్రణాళికలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వ్యవసాయశాఖ తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక రూపురేఖలు మారనున్నాయి. నియంత్రిత పంటల విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన చేసిన సూచనల మేరకు సాగు ప్రణాళిక పూర్తిగా మారిపోనున్నది. ప్రధానంగా వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోనున్నది.  దానిలోనూ సగం మేరకు సన్న రకాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వాన కాలంలో మొక్కజొన్న సాగుకు స్వస్తి చెప్పనున్నారు. మొక్కజొన్న స్థానంలో కంది పంటను ప్రభుత్వం ప్రోత్సహించనున్నది.  ప్రభుత్వం సూచించిన పంట వేయని వారికి రైతుబంధు పథకం వర్తించదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల ఎకరాల్లో కంది పంటను సాగు చేయాలని, పండిన కందులను ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.  


పత్తి సాగు పెంచే దిశగా చర్యలు

వరి విస్తీర్ణం తగ్గినా ఆమేరకు పత్తి సాగును పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గత సంవత్సరం వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 53 లక్షల ఎకరాల్లో పత్తి, 79 లక్షల ఎకరాల్లో వరి, 20 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4 లక్షల ఎకరాల్లో సోయ, 3.50 లక్షల ఎకరాల్లో కూరగాయలు, 1.25 లక్షల ఎకరాల్లో పసుపు, 7 లక్షల ఎకరాల్లో కందులు, 2.50 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. ఈసారి 40 లక్షల ఎకరాల్లో వరి, 70 లక్షల ఎకరాల్లో పత్తి, 12 లక్షల ఎకరాల్లో కంది పంట సాగు చేయాలని, 8 నుంచి 10 లక్షల ఎకరాల్లో, కూరగాయలు, సోయ, పప్పు ధాన్యాల పంటలు వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 


జిల్లాలో 3,38,795 ఎకరాల్లో సాగు అంచనా

జిల్లాలో ఈ వానకాలంలో 3,38,795 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు వీలుగా జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. అందుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ముఖ్యమంత్రి నియంత్రిత వ్యవసాయ విధానాన్ని అమలు చేసి డిమాండ్‌ ఉన్న పంటలనే పండించాలని, ఎవరికి తోచిన విధంగా వారు పంటలు సాగు చేస్తే ప్రభుత్వం ఖరీదు చేసే అవకాశాలు ఉండక పోవచ్చని పేర్కొనడంతో జిల్లా వ్యవసాయ ప్రణాళికలో మార్పులు చోటుచేసుకోవడం ఖాయంగా భావిస్తున్నారు. జిల్లాలో 2,10,250 ఎకరాల్లో వరి, 32,500 ఎకరాల్లో మొక్కజొన్న, 77025 ఎకరాల్లో పత్తి, 4,000 ఎకరాల్లో కందులు, 1,000 ఎకరాల్లో పెసరా, 4,000 ఎకరాల్లో కూరగాయలు, 1500 ఎకరాల్లో మిర్చి, 25 ఎకరాల్లో మినుములు, 8,495 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేసేందుకు వీలుగా వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి సూచనలతో లక్ష ఎకరాల్లో పంటలు మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి.


పత్తి 77 వేల ఎకరాల్లో ప్రస్తుతం సాగు చేస్తారని వ్యవసాయశాఖ చేసిన అంచనాలను రెట్టింపు చేసే పరిస్థితి కనిపిస్తున్నది. నాలుగు వేల ఎకరాల్లో కంది పంటను సాగు చేస్తారని అంచనా వేశారు. గత సంవత్సరం వర్షాకాలంతో పోల్చుకుంటే ఇది సుమారు 1600 ఎకరాలు ఎక్కువే. మొక్కజొన్నను పండిస్తే రైతు బంధు వర్తింపజేయమని తేల్చిచెప్పడంతో  కందులు సాగు చేసే విధంగా ప్రణాళికలు మారవచ్చని తెలుస్తున్నది. 32,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసే రైతులు ఆ మేరకు కంది సాగు వైపు మొగ్గు చూపుతారా అన్నది ప్రశ్నార్థకమే.  


రైతులు మొగ్గు చూపేనా..?

రాష్ట్రంలో గత సంవత్సరం వర్షాకాలం 79 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశాం. ప్రాజెక్టులన్నీ పూర్తయితే కోటిన్నర ఎకరాలకు సాగు నీరు అందుతుందని, దానిలో పూర్తిగా వరి సాగు చేస్తే నాలుగున్నర కోట్ల టన్నుల వరి దిగుబడి వస్తుందని, ఆ ధాన్యాన్ని బియ్యంగా తయారు చేసే శక్తి రాష్ట్రంలో ఉన్న మిల్లర్లకు లేదని సీఎం పేర్కొనడంతో వరి సాగును తగ్గిస్తారని స్పష్టమై పోయింది. ఈ సంవత్సరం కరోనా కారణంగా వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్నాం.. కానీ పంటలు కొనడం ప్రభుత్వ విధానం కాదని మఖ్యమంత్రి స్పష్టం చేస్తూ సన్న రకాలు సాగు చేయాలని సూచించారు.  జిల్లాలో 2018-19 వర్షాకాలంలో 25శాతం సన్న రకం వరి ధాన్యాన్ని సాగు చేశారు.


ఇప్పటికే జిల్లా వ్యసాయశాఖ 2020లో 35 నుంచి 40 శాతం సన్న రకాలను సాగు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు సాగును ప్రోత్సహించినా వరిసాగును తగ్గించే అవకాశం కనిపిస్తున్నది. సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధర లేక పోవడం, దొడ్డురకం ధాన్యంతో పోలిస్తే కనీసం 20 రోజుల పంట కాలం పెరుగడం, చీడ, పీడలు ఎక్కువై పెట్టుబడులు పెరుగడంతో రైతులు దొడ్డు రకం వరి ధాన్యం సాగువైపే మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడు వరి విస్తీర్ణాన్ని తగ్గించడమే కాకుండా పండించే వరి ధాన్యంలో సగం మేరకు సన్న ధాన్యాలను పండించాలని సూచిస్తుండడంతో రైతులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. 


Updated Date - 2020-05-19T10:11:55+05:30 IST