యువత వ్యవసాయ రంగంలోకి రావాలి

ABN , First Publish Date - 2021-06-25T06:57:18+05:30 IST

యువతరం వ్యవసాయ రంగంలోకి రావాలని, అప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, రైతులు డాక్టర్లు, సైంటిస్టులు వంటివారని, వారిని వ్యాపారులుగా మార్చవద్దని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

యువత వ్యవసాయ రంగంలోకి రావాలి
ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో కాడెడ్లతో ఏరువాక నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ

అప్పుడే దేశం మరింత అభివృద్ధి
 రైతులు డాక్టర్‌, సైంటిస్ట్‌ లాంటి వారు
వారిని వ్యాపారులుగా మార్చొద్దు
ధర్మవరం ఏరువాకలో పాల్గొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ప్రత్తిపాడు, జూన్‌ 24: యువతరం వ్యవసాయ రంగంలోకి రావాలని, అప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, రైతులు డాక్టర్లు, సైంటిస్టులు వంటివారని, వారిని వ్యాపారులుగా మార్చవద్దని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో గురువారం ఆయన పర్యటించారు. రాచపల్లి అడ్డురోడ్డు సమీపంలో కౌలుకు తీసుకున్న 12 ఎకరాల్లో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని జేడీ కాడెడ్లతో పొలం దుక్కులు దున్ని ఏరువాక సాగును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేడీ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోకి యువతరం వస్తే విప్లవాత్మకమైన మార్పులు వచ్చి వ్యవసాయం మరింత లాభసాటిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తుల కోసం గోదాములు, శీతల గిడ్డంగులు, మార్కెటింగ్‌ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసమే తమ జేడీ ఫౌండేషన్‌ తెలుగు రాష్ట్రాల్లో ఫార్మర్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకునేలా డ్రోన్‌లు, అధునాతన వ్యవసాయ పరికరాలతో టెక్నాలజీని వినియోగించుకుని సాగు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ఏరువాక పౌర్ణమి విశిష్టతను ఆయన వివరించారు. ఏరువాక పౌర్ణమి రోజున చంద్రుడు పెద్దగా ఉంటాడని, జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో ఒక పెద్దగా వ్యవసాయ పనులు చేపట్టడం దక్షిణ భారతదేశంలో సంప్రదాయమని తెలిపారు.
అన్నదాతలను సన్మానించిన జేడీ
మండలంలోని ధర్మవరం, రాచపల్లి గ్రామాలకు చెందిన అన్నదాతలను ఏరువాక పౌర్ణమి సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ ఘనంగా సన్మానించారు. దుశ్శాలువా కప్పి దుస్తులు, స్వీట్లు అందజేసి అన్నంపెట్టే రైతన్నలకు ప్రతిరోజూ కృతజ్ఞతలు తెలపా ల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ధర్మవరం రైతులు సానా నూకరాజు నాయుడు, చెక్కపల్లి సత్తిబాబు రైతులు పడుతున్న అవస్థలను ధాన్యం తదితర వ్యవసాయ ఉత్పత్తులు విక్రయిం చుకోవడంలో పడుతున్న బాధలను వివరించారు. కార్యక్రమంలో జేడీకి భూమిని కౌలుకు ఇచ్చిన రైతు ఇందుకూరి మురళీకృష్ణ రాజు, జేడీ ఫౌండేషన్‌ ప్రతినిధులు పి.పురుషోత్తంరావు, సత్యనారాయణ, తాళ్లపూడి పుప్పాల సత్యనారాయణ, స్థానిక రైతులు సిద్దా పెద్దకాపు, కొత్తూరు తమ్మయ్య, అద్దేపల్లి రాజా, బంతులూరు బోసు, ఏసుబాబు పాల్గొన్నారు. జేడీ లక్ష్మీనారాయణను ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్‌ వరుపుల తమ్మయ్య బాబు, పెంటకోట మోహన్‌ కలిశారు.


Updated Date - 2021-06-25T06:57:18+05:30 IST