రేపటి నుంచి కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-04T07:56:47+05:30 IST

రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడంతో బుధవారం నుంచి రోజంతా కర్ఫ్యూ విధించాలని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వర్తక, వాణిజ్య

రేపటి నుంచి కర్ఫ్యూ

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులు

ఆ సమయంలోనూ 144 సెక్షన్‌

ఐదుగురికి మించి గుమిగూడొద్దు

ప్రయోగాత్మకంగా 2 వారాలు అమలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం

కొవిడ్‌ నియంత్రణపై సమీక్ష

ఎక్కడా ఆక్సిజన్‌ కొరత రాకూడదు

అన్ని ఆస్పత్రులకు సరిపడా సరఫరా

నిల్వకు తగిన ఏర్పాట్లు చేయాలి

కావాల్సిన ట్యాంకర్లు సేకరించాలి

పక్కాగా కాంటాక్టుల గుర్తింపు

అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

కరోనా కట్టడిపై నేడు కేబినెట్‌ భేటీ


అమరావతి, మే 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడంతో బుధవారం నుంచి రోజంతా కర్ఫ్యూ విధించాలని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వర్తక, వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించాలని.. ఇదే సమయంలో 144 సెక్షన్‌ అమలు చేయాలని స్పష్టం చేశారు. జనజీవనానికి ఇబ్బంది లేకుండా పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. కొవిడ్‌-19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.


ఈ సమావేశంలో బుధవారం నుంచి రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూను విధించాలని ఆయన పేర్కొన్నారు. షాపులను ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరవాలని.. మధ్యాహ్నం తర్వాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతివ్వాలని ఆదేశించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. రెండువారాల పాటు ప్రయోగాత్మకంగా ఈ ఆంక్షలు అమలు చేయాలన్నారు. వైరస్‌ బాధితుల వైద్య సేవల కోసం అవసరమైన ఆక్సిజన్‌ స్టోరేజీకి అన్ని ఏర్పాట్లూ చేయాలని.. కొరత రాకుండా చూసుకోవాలని.. అన్ని ఆస్పత్రుల్లోని రోగులకు సరిపడా దిగుమతి చేసుకుని.. నిల్వకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైనన్ని ట్యాంకర్లను సేకరించాలని ఆదేశించారు. పాజిటివ్‌ వచ్చిన వారితో పాటు వారి ప్రైమరీ కాంటాక్టులను కూడా గుర్తించి.. పరీక్షలు నిర్వహించాలని.. ఇది పక్కాగా జరగాలన్నారు. ప్రభుత్వ ఎంప్యానెల్‌లో ఉన్న ఆస్పత్రుల్లోనూ వైద్యులు, సహాయ సిబ్బంది కొరత ఉండకూడదన్నారు. 

 

16.6 లక్షల పరీక్షలు..

రాష్ట్రంలో నెలకు సగటున 3,10,915 పరీక్షలు చొప్పున ఇప్పటి వరకూ1660873 కొవిడ్‌ పరీక్షలు జరిపామని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం 558 కొవిడ్‌ ఆస్పత్రులు ఉన్నాయని.. వాటిలో 44, 599 బెడ్లు ఉన్నాయని చెప్పారు. ‘ఆ ఆస్పత్రుల్లో 37,760 మంది చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్లపై 3,597 మంది పేషెంట్లు ఉన్నారు. హోం ఐసొలేషన్‌లో 1,01,304 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 81 కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 41,780 బెడ్లు ఉండగా.. వాటిలో 9,937 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకా 31,843 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రానికి కేంద్రం 480 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కోటాను పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నాం. మైలాన్‌ ల్యాబ్‌ నుంచి 5 లక్షల రెడ్‌మి్‌సవిర్‌ ఇంజక్షన్ల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చాం. 5,67,844 ఎన్‌95 మాస్కులు, 7,67,732 పీపీఈ కిట్లు , 35,46,100 సర్జికల్‌ మాస్కులు, 2,04,960 హోం ఇసోలేషన్‌ కిట్లకు ఆర్డర్‌ చేశాం’ అని వివరించారు. 45 ఏళ్ల పైబడినవారిలో ఇప్పటివరకూ 52 లక్షల మందికి ఒక డోసు వ్యాక్సిన్‌ ఇచ్చామన్నారు.


మళ్లీ సీల్డ్‌ కవర్లలోనే కేబినెట్‌ అజెండా

రెండువారాల ప్రయోగాత్మక కర్ఫ్యూ.. ఆ తర్వాత తీసుకోవలసిన చర్యలపై చర్చించడమే ప్రధాన అజెండాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరగనున్నది. వాస్తవానికి గత నెల 22న ఈ భేటీ జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో 29వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు కూడా జరగలేదు మళ్లీ మంగళవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో మంత్రులెవరూ కేబినెట్‌ భేటీపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గత మంత్రివర్గ సమావేశంలో .. కేబినెట్‌ అజెండా అంశాలు సామాజిక మాధ్యమాల్లోనూ.. అధికార పార్టీ అనుకూల మీడియాలోనూ ముందే ప్రసారం కావడంపై సీనియర్‌ మంత్రి ఒకరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ-కేబినెట్‌ విధానం వల్లే అజెండా బయటకు పొక్కుతోందన్న అభిప్రాయం రావడంతో.. మంగళవారం నాటి కేబినెట్‌ భేటీ నుంచి పాత సీల్డ్‌ కవర్‌ విధానంలోనే అజెండా పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.  సమావేఽశానికి ముందు మంత్రులకు అజెండా కవర్లు అందజేస్తారు.

Updated Date - 2021-05-04T07:56:47+05:30 IST