Abn logo
Apr 9 2021 @ 01:34AM

రాత్రంతా కర్ఫ్యూ

అవగాహనకు ఇదే మంత్రం.. రాష్ట్రాలకు ప్రధాని సూచన

లక్షణాలు కనిపించకుండా వ్యాప్తి

నిర్లక్ష్యమే కొంపముంచుతోంది

యుద్ధప్రాతిపదికన కట్టడి చర్యలు చేపట్టండి

రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ

తమిళనాడులో పాక్షిక లాక్‌డౌన్‌

దేశంలో 1,26,789 కొత్త కేసులు; 685 మరణాలు

ఛత్తీస్‌గఢ్‌లో ఒక్క రోజే 10 వేలకు పైగా పాజిటివ్‌లు

సగటున 34 లక్షల మందికి టీకా

ప్రపంచంలోనే అత్యధికం: కేంద్రం


కొవిడ్‌కు మోదీ చికిత్స ఇదీ!

  • సూక్ష్మ కట్టడి జోన్ల ఏర్పాటుపై దృష్టిపెట్టండి
  • రాత్రి కర్ఫ్యూ విధించాలి. కరోనా కర్ఫ్యూగా పిలవాలి
  • ఒకరికి కరోనా సోకితే 30 మందికి పరీక్షలు చేయాలి
  • 70% ఆర్టీపీసీఆర్‌లు జరపాలి. మరణాలూ తగ్గాలి
  • 11 నుంచి 14 దాకా టీకా ఉత్సవం
  • నిధులకు కొదవలేదు. వైద్య ఆరోగ్య సౌకర్యాలూ ఇప్పుడున్నాయి. టీకాలూ అందుబాటులోకి వచ్చాయి
  • ప్రజలు ఉదాసీనంగా ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తేలిగ్గా తీసుకుంటోంది. ఇది ఆగాలి
  • ఇది పాలకులకు సవాల్‌.. సమాజమూ స్పందించాలి. అవగాహన పెంచేట్లు రచయితలు, క్రీడాకారులు, ప్రముఖులు కృషి చేయాలి


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: కొవిడ్‌ మహమ్మారి మళ్లీ ఓ పెద్ద సవాల్‌ విసురుతోందని, దీనిని దీటుగా ఎదుర్కొనడానికి కఠినమైన, పకడ్బందీ చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ మళ్లీ కమ్మేస్తుండడంతో ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. వెంటనే మేల్కొనాలని, ప్రజలను, యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇందుకు ఆయన ఐదు దశల వ్యూహాన్ని ప్రకటించారు. ఆయన చేసిన సూచనల్లో ప్రధానమైనది పరీక్షలు పెంచడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయడం. సూక్ష్మ కట్టడి జోన్లపై ఎక్కువగా దృష్టిపెట్టాలని గట్టిగా కోరారు. ఈ జోన్లను గుర్తించి అక్కడ పరీక్షలు జరిపే సౌకర్యాలు పెంపొందించాలని సూచించారు. టెస్టింగ్‌, ట్రేసింగ్‌ల ద్వారా గతంలో కేసుల సం ఖ్యను 10 లక్షల నుంచి 1.25 లక్షలకు తగ్గించగలిగామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాలన్నీ 70ు ప్రజానీకానికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరిగేట్లు చూడాలని కూడా టార్గెట్‌ విధించారు. ‘‘ఒక వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలితే ఆయనతో టచ్‌లో ఉన్న కనీసం 30 మందికి 72 గంటల్లోగా పరీక్షలు జరపాలి.


పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వద్దు. పరీక్షలు ముమ్మరంగా చేయండి’’ అని ఆయన కోరారు. రాత్రివేళ కర్ఫ్యూ విధించాలని కూడా సూచించారు. ‘ఇది కొత్తేం కాదు. అనేక సంపన్న దేశా ల్లో అమలవుతోంది. మన దేశంలో కూడా ఢిల్లీ, నొయిడా, ముంబై, బెంగళూరు, లఖ్‌నవూ లాంటి చాలా నగరాల్లో అమలు చేస్తున్నారు. దీన్ని ‘కరోనా కర్ఫ్యూ’ అని పిలుద్దాం. రాత్రి కర్ఫ్యూ వల్ల ఓ రకమైన అవగాహన పెరుగుతుంది. రాత్రి 9 నుం చి ఉదయం 6 గంటల దాకా దీన్ని విధించడం మంచింది’’ అని మోదీ పేర్కొన్నారు.  ఈ నెల 11 నుంచి 14వ తేదీ దాకా వ్యాక్సిన్‌ ఉత్సవం జరపాలని విజ్ఞప్తి చేశారు. ‘45 ఏళ్లు దాటిన వారంతా టీకా వేసుకునేట్లు చూడాలి. యువత అవగాహన పెం చుకోవాలి’ అని మోదీ పేర్కొన్నారు. 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా వేయించుకోడానికి అనుమతించాలంటూ విపక్ష పాలిత రాష్ట్రాల డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. ఇప్పటికే 9 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు చెప్పారు.


కొవిడ్‌పై యుద్ధం చేసే విషయంలో నిధుల, వనరుల కొరత లేదని కూడా మోదీ స్పష్టం చేశారు. ‘‘నిరుడు మనకి సరిపడా టెస్టింగ్‌ సామగ్రి, పీపీఈ కిట్లు, శానిటైజర్లు, ఇతర వస్తువులు లేవు. ఆరోగ్య సదుపాయాలూ అంతంత మాత్రం. అందువల్ల అపుడు లాక్‌డౌన్‌ మీద ఆధారపడ్డాం. ఇపుడు ఆ పరిస్థితిలేదు. మన వైద్య, ఆరోగ్య సౌకర్యాలు ఎన్నో రెట్లు మెరుగుపడ్డాయి. ఆరోగ్య సిబ్బందికి కూడా దీన్ని డీల్‌ చేయడమెలాగో అనుభవం వచ్చింది. ఇపుడు దీటుగా ఎదుర్కొనగలం’’ అని ఆయన వివరించారు. అయితే కొవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ కమ్ముకొచ్చినా అన్ని రాష్ట్రాల్లో ఉదాసీనత కొనసాగడాన్ని ఆయన నిరసించారు. ‘‘ప్రజల్లో నిర్లక్ష్యం ఉంది. పాలనా యంత్రాంగాలు కూడా తేలిగ్గా తీసుకుంటున్నాయి. అందరినీ చైతన్యవంతం చేయాలి. టెస్టులు చేయించుకోవడమే కాదు. మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం అవసరం’’ అని ఆయన హెచ్చరించారు. కాగా, కొవిడ్‌పై పోరులో తామేమీ వెనకబడి లేమని, గట్టి చర్యలు తీసుకుంటున్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రధాని మోదీకి స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజకీయాలకు పాల్పడకుండా కేంద్ర మంత్రులను నియంత్రించాలని ఆయన సూటిగా చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement