కరెంటుకే షాకులు!

ABN , First Publish Date - 2021-10-14T08:07:17+05:30 IST

కరెంటుకే షాకులు!

కరెంటుకే షాకులు!

ముందుచూపు లేకుండా థర్మల్‌ ప్లాంట్ల మూసివేత

ఎక్స్ఛేంజీలో తక్కువ ధరకే దొరుకుతోందనే వాదన

ఉత్పత్తి లేకున్నా తప్పని జీతాలు, నిర్వహణ వ్యయం

ఇప్పుడు అనూహ్యంగా బొగ్గు కష్టాలతో విద్యుత్‌ కొరత

యూనిట్‌ 15 నుంచి 20 వరకు కొనాల్సిన పరిస్థితి

ప్లాంట్లను మూయకపోతే సంక్షోభం ఉండేది కాదు

సౌర, పవన విద్యుత్‌పై అతిగా ఆధారపడిన వైనం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

సొంత ‘పవర్‌’ను వదిలేసి... పొరుగు నుంచి కొనుగోళ్లు! అవసరమైన మేరకు కాకుండా... సౌర, పవన విద్యుత్తు కోసం అతిగా పరుగులు! విద్యుదుత్పత్తిలో లోపించిన సమతుల్యత కూడా నేటి కష్టాలకు కారణమా? ఈ ప్రశ్నకు నిపుణులు ‘ఔను’ అనే సమాధానం ఇస్తున్నారు. ఏపీ జెన్కో బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రాలను మూతపెట్టి .. బయట ఎక్స్ఛేంజీల్లో తాత్కాలికంగా చౌకగా లభించే విద్యుత్తును కొనుగోలు చేసిన ఇంధన శాఖ.. ఇప్పుడు దానికి భారీ మూల్యాన్నే చెల్లించుకుంటోంది. అప్పుడు... యూనిట్‌ రూ.2.40కే కొనుగోలు చేస్తూ సొమ్ములు ఆదా చేశామని ఇంధన శాఖ ఉన్నతాధికారులు గొప్పగా చెప్పారు. ఇప్పుడు.. అమాంతం బొగ్గు కొరత రావడంతో పది రెట్లు ఎక్కువ ధరను చెల్లిస్తూ విద్యుత్తు కొంటున్నారు.


సొంత ప్లాంట్లు మూసేసి...

రాష్ట్రంలో ఏపీ జెన్కో థర్మల్‌ విద్యుత్కేంద్రాలు అన్నీ పూర్తిస్థాయిలో 5010 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేవి. బహిరంగ మార్కెట్లో యూనిట్‌ రూ.2.30 నుంచి రూ.2.65కే దొరుకుతోందంటూ ప్లాంట్లలోని యూనిట్లను ఒక్కొక్కటిగా మూసివేశారు. రాష్ట్రంలో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించారు. ఈ నిర్ణయం తీసుకునేముందు తగిన కసరత్తు జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే... బొగ్గు ఆధారిత కేంద్రాలు మూసివేసినా సిబ్బంది జీతభత్యాలు, యంత్రాల యాజమాన్య నిర్వహణ వంటి ఖర్చులు భరించక తప్పవు. యూనిట్‌ విద్యుదుత్పత్తి వ్యయంలో దాదాపు రూపాయి ఇదే ఉంటుంది. అస్థిర వ్యయంగా కొనుగోలుచేసే విద్యుత్‌ యూనిట్‌ రూ.2.30కు స్థిరచార్జి రూపాయి కలిపితే.. యూనిట్‌ రూ.3.30 అవుతోంది. అంటే.. జెన్కో విద్యుదుత్పత్తి ధరకు ఇది దాదాపు సమానం. ఇందులో ఇంధన సంస్థలకు పెద్దగా మిగులు ఏమీ లేనప్పటికీ.. అస్థిర చార్జీలను భూతద్దంలో చూపించి, గత ప్రభుత్వం అధికధరలకు కొనుగోలు చేసిందనే రాజకీయ విమర్శలు చేశారు.


సమన్వయ లోపం...

ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో సంస్థల సీఎండీ, ఎండీ బాధ్యతలను ఒక్కరే నిర్వర్తించిన కాలంలో ఈ రెండు సంస్థలనూ సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లే వారు. ఎన్నేళ్లుగానో ఉన్న ఈ పద్ధతిని వైసీపీ సర్కారు మార్చేసింది. జెన్కో, ట్రాన్స్‌కో సంస్థలకు అధిపతులు వేర్వేరుగా ఉండడం వల్ల సమన్వయం లోపించిందని అంటున్నారు. ఆ రెండు విభాగాల మధ్య ఆధిపత్య పోరు కూడా జరుగుతోందనే అభిప్రాయం ఉంది. జెన్కో విద్యుత్తు ప్లాంట్లను షట్‌డౌన్‌ చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి అభిప్రాయబేధాలే తలెత్తాయని విద్యుత్తు సంస్థల ఉద్యోగులు చెబుతున్నారు. జెన్కో విద్యుత్కేంద్రాలను షట్‌డౌన్‌ చేయడం ద్వారా సంస్థను బలహీన పరిచే చర్యలు చేపట్టారని.. దాని ఫలితం ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. జెన్కో, ట్రాన్స్‌కోలో నిష్ణాతులైన ఇంజనీర్లు ఉన్నారని, వారి సేవలను సద్వినియోగం చేసుకుంటే.. రాష్ట్ర విద్యుత్తు రంగం దేశంలో అత్యుత్తమంగా ఉండేదని అంటున్నారు. కానీ, తాత్కాలిక ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం వల్ల.. సంప్రదాయ విద్యుత్తు కొర త తీవ్రంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 


సగం కంటే తక్కువగానే...

జల విద్యుత్తు తక్కువ కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. థర్మల్‌ విద్యుత్తు మాత్రమే నమ్మకమైనది. కానీ... రెండున్నరేళ్లుగా దీనిని పక్కనపెట్టి సౌర, పవన విద్యుత్తుపై అతిగా ఆధారపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 8 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లు ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 54 మిలియన్‌ యూనిట్లు మాత్రమే సంప్రదాయేతర విద్యుత్తు అందుతోంది. ఈ సంక్షోభ సమయంలో అవి ఆదుకోలేకపోతున్నాయని ఇంధన శాఖ స్వయంగా అంగీకరించింది. 


ఎక్కడెక్కడ ఎంతెంత..

రాష్ట్రంలో రోజూ 188 నుంచి 196 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు డిమాండ్‌ ఉంటోంది.  జెన్కో థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి 49 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. జల విద్యుత్తు 25 మిలియన్‌ యూనిట్లు ఉంది. సెంట్రల్‌ పూల్‌ నుంచి 49 మిలియన్‌ యూనిట్లు వచ్చింది. సోలార్‌ వాటా 49 మిలియన్‌ యూనిట్లు. గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు 6 మిలియన్‌ యూనిట్లు, పవన విద్యుత్తు 5 మిలియన్‌ యూనిట్లు ఉంది. బహిరంగ మార్కెట్‌ నుంచి 30 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-14T08:07:17+05:30 IST