ఎనీటైమ్‌ సీతాఫల్‌!

ABN , First Publish Date - 2020-12-13T19:10:44+05:30 IST

హైదరాబాద్‌ దేనికి ఫేమస్సు? ఇదేం ప్రశ్న! ఎవర్ని అడిగినా ఠక్కున బిర్యానీ అనేస్తారు..

ఎనీటైమ్‌ సీతాఫల్‌!

హైదరాబాద్‌ దేనికి ఫేమస్సు? ఇదేం ప్రశ్న! ఎవర్ని అడిగినా ఠక్కున బిర్యానీ అనేస్తారు.. అనుకుంటారు మీరు. నిజమే. కానీ ఇప్పుడు అలాంటి బిర్యానీలు దేశవ్యాప్తంగా చాలా చోట్ల దొరుకుతున్నాయి. భాగ్యనగరం మరొక అరుదైన సీతాఫలం ఐస్‌క్రీమ్‌కు కూడా ప్రసిద్ధి. శీతాకాలంలో వచ్చే సీతాఫలాల సీజన్‌ కోసం చాలామంది కాచుకుని ఉంటారు. ఎందుకంటే... ఇప్పుడు దొరికే సీతాఫల ఐస్‌క్రీమ్‌ రుచి మరెప్పుడూ ఉండదు కాబట్టి!. ఆ ఐస్‌క్రీమ్‌లో వాడే ఫలాల గుజ్జు ఎక్కడి నుంచీ వస్తుందో తెలుసా? తెలంగాణలోని నారాయణపేట జిల్లా అడవుల నుంచీ. ఆ ప్రాంత గ్రామీణ మహిళలు ఎంతో కష్టపడి అడవుల్లో తిరిగి ఆ ఫలాలను సేకరించి... గుజ్జుతీసి హైదరాబాద్‌లోని ప్రముఖ ఐస్‌క్రీమ్‌ కంపెనీలకు పంపిస్తున్నారు మరి..!



పాలమూరు సీతాఫలాలకు దేశవ్యాప్తంగా పేరుంది. ఢిల్లీతో సహా పలు నగరాలకు ఎగుమతి అవుతున్నాయిప్పుడు. ఒకప్పుడు మూడు కిలోల కాయలు కాసేవి. వాటిని విమానాల్లో పంపేవారు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మొదలుకొని అనేక మంది భారత ప్రధానులు, ప్రముఖులు ఇక్కడి సీతాఫలాల రుచిని ఆస్వాదించిన వారే!. 



శీతాకాలం... మంచుకురిసే వేళ... మహిళలు నెత్తిన గంపలు పెట్టుకుని నడుస్తున్న అద్భుత దృశ్యం... చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ నెలాఖరు వరకు తెలంగాణలోని నారాయణపేట జిల్లా, దామరగిద్ద, తిరుమలాపూర్‌ అడవుల్లో కనిపించే దృశ్యాలు ఇవి. వీరంతా ఏటా సీతాఫలాల సేకరణకు వెళతారు. ఇదే వీరికి జీవనోపాధి. దాదాపు పదికిలోమీటర్లు నడిచి, గుట్టలు ఎక్కి, ఫలాలు సేకరిస్తారు. ఒక్కోసారి బస్తా పండ్లు సేకరిస్తే, వచ్చేది ముప్పయి రూపాయలే! ఇలా కాదని మహిళలందరూ కలిసి ‘నారాయణపేట ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ’గా ఏర్పడ్డారు. ‘జిల్లాలోని 64 చిన్న సంఘాలు కలిపి 969 మంది సభ్యులు ఉన్నాం. ఇప్పుడు మేం సేకరించిన పండ్లకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర చెల్లిస్తోంది. గతంలో నూరు రూపాయలకు మించి వచ్చేది కాదు, ఇప్పుడు నాలుగు వందల వరకు సంపాదిస్తున్నాం’ అంటున్నారు ఆ సంఘ నాయకురాలు రేణుక. రాష్ట్ర పేదరిక నిర్మూలనా సంస్థ  వీరికి అండగా నిలుస్తోంది. మహిళల నుంచి గిట్టుబాటు ధరకు సీతాఫలాలను కొనడం, వాటిని ఫుడ్‌ ఫ్రాసెసింగ్‌ ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం సెర్ఫ్‌ సంస్థ చేస్తోంది.


సహజసిద్ధంగా అడవుల్లో కాసే సీతాఫలాలతో చేసిన ఐస్‌క్రీమ్‌కు రుచి ఎక్కువ. భాగ్యనగర వాసులు ఆ రుచికి ఫిదా అవుతున్నారు. నారాయణపేట సెర్ఫ్‌ మహిళలు పాలమూరు అడవుల్లో సేకరించిన ఫలాల నుంచీ తీసిన గుజ్జుతోనే మేము ఐస్‌క్రీమ్‌ను తయారుచేస్తున్నాం. దీనికి మంచి డిమాండ్‌ ఉంది. ఆరోగ్యం కూడా. 

- రాజ్‌పాల్‌, స్కూప్‌ ఐస్‌క్రీమ్‌, హైదరాబాద్‌



అడవుల్లో సేకరించిన సీతాఫలాలకు గిట్టుబాటు ధర ఉండేది కాదు. ప్రభుత్వం వీరందరితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను నెలకొల్పాం. సేకరించిన ఫలాలకు ప్రతిఫలం చెల్లిస్తున్నాం. పండ్లను విలువ  ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అమ్మడం ద్వారా వచ్చిన లాభాలను కూడా వారికే ఇస్తున్నాం. గ్రామీణ మహిళల స్వయం సమృద్ధికి మరిన్ని మహిళా సంఘాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం.

- హరిచందన, కలెక్టర్‌, నారాయణపేట జిల్లా


ఐస్‌క్రీమ్‌కు డిమాండ్‌..

పేద మహిళలు అడవుల్లో సేకరించిన సీతాఫలాలను వారి గ్రామాల్లోనే కొంటారు. కాయల సైజ్‌ను బట్టి మూడు గ్రేడ్‌లుగా విభజిస్తారు. అక్కడి నుంచీ ముద్దూరు, దామరగిద్దలోని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కి తరలించి, రెండు రోజులు మాగబెట్టి పండ్లుగా మారుస్తారు. శిక్షణ పొందిన మహిళలు పండ్ల నుంచి గుజ్జును అవలీలగా తీస్తారు. తొక్క, గింజలను వేరు చేస్తారు. ఆరు కిలోల పండ్ల నుంచీ కిలో గుజ్జు వస్తుంది. కిలో రూ.225 అమ్ముతారు. సెప్టెంబర్‌ నుంచీ నవంబర్‌ వరకు మూడువందల మంది మహిళలు 17,506 కిలోల పండ్లను, 2,320 కిలోల గుజ్జును సేకరించడం విశేషం. ఆహారశుద్ధి కేంద్రాల్లో తీసిన గుజ్జును కిలో చొప్పున ప్యాక్‌ చేస్తారు. మైనస్‌ 22 డిగ్రీల వద్ద శీతలీకరించడంతో అది ఘన పదార్థంగా మారుతుంది. అవసరమైనప్పుడు నీటిలో వేస్తే మెత్తగా అవుతుంది. ఏడాది వరకు చెడిపోదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్‌క్రీమ్‌, జ్యూస్‌లు చేసుకుని ఆస్వాదించవచ్చు. ఈ గుజ్జును హైదరాబాద్‌లోని పలు ఐస్‌క్రీమ్‌ కంపెనీలు సైతం కొంటున్నాయి. ఇప్పుడు సీతాఫల్‌ ఐస్‌క్రీమ్‌ బాగా ప్రాచుర్యం పొందింది. 

- శ్యాంమోహన్‌, 94405 95858

ఫోటోలు : ఎస్‌. అనిల్‌కుమార్‌ 

Updated Date - 2020-12-13T19:10:44+05:30 IST