వంద బెడ్లే!

ABN , First Publish Date - 2021-04-30T15:58:57+05:30 IST

దుర్గగుడికి చెందిన సి.వి.రెడ్డి ఛారిటీస్‌లో..

వంద బెడ్లే!

సి.వి.రెడ్డి ఛారిటీస్‌లో కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు షరతులతో అనుమతులు 

దేవస్థానం సిబ్బందికి ఏసీ హాలులో 5, నాన్‌ ఏసీ బెడ్లు 30 ఫ్రీ ట్రీట్మెంట్‌ 

డిస్ట్రిక్ట్‌ అడ్మినిస్ట్రేషన్‌ రిఫరెన్స్‌తో మరో 30 బెడ్లు కేటాయించాలి

ఎన్నిరోజులు చికిత్స పొందినా ఫీజు రూ. 21 వేలకు మించరాదు 

‘ఆంధ్రజ్యోతి’ కథనాలపై స్పందించి మార్గదర్శకాలు రూపొందించిన ఈవో 


ఆంధ్రజ్యోతి-విజయవాడ: దుర్గగుడికి చెందిన సి.వి.రెడ్డి ఛారిటీస్‌లో కొవిడ్‌కేర్‌ సెంటర్‌ నిర్వహణకు శ్రీ సంభవ్‌నాథ్‌ రాజేంద్రసూరిజైన్‌ స్వేతాంబర్‌ ట్రస్టుకు అనుమతులు ఇచ్చేశారు. ఆంధ్రజ్యోతి కథనాలకు స్పందించిన అధికారులు షరతులతో కూడిన అనుమతులు జారీ చేశారు. సువిశాలమైన విస్తీర్ణంలో ఉన్న సి.వి.రెడ్డి ఛారిటీ్‌సను వచ్చే జూన్‌ 30వరకు 2 నెలల పాటు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఉచితంగా ఇప్పించాలని, ప్రతిఫలంగా కరోనా బారినపడిన దేవస్థానం సిబ్బందికి 5 బెడ్స్‌ కేటాయించి ఉచిత ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తామంటూ ట్రస్టు నిర్వాహకులు ఈనెల 19న ఈవోకు లేఖ రాయడం, అనుమతులకు ఈవో భ్రమరాంబ దేవదాయశాఖ కమిషనర్‌కు మరో లేఖ రాయడం, కమిషనర్‌ సానుకూలంగా స్పందిస్తూ 26నే ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ఒక్కొక్క కరోనా బాధితుడి నుంచి రోజుకు రూ. 3వేలు చొప్పున 2నెలల్లో దాదాపు రూ.9కోట్ల వరకు వసూలు చేసుకునేందుకు ట్రస్టు నిర్వాహకుల ప్రణాళికను వివరిస్తూ.. ‘దుర్గమ్మ సాక్షిగా.. భారీ దోపిడీకి స్కెచ్‌’ శీర్షికన ఈనెల 27న ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఓ ప్రైవేటు ట్రస్టుకు భేషరతుగా అనుమతులు జారీ చేసిన అధికారుల తీరుపై దుర్గగుడి ఉద్యోగులు, సిబ్బంది నుంచి వ్యక్తమైన వ్యతిరేకతపై 28న ‘ఆంధ్రజ్యోతి’ మరో కథనాన్ని ప్రచురించడంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. రాజకీయ ఒత్తిళ్లతో ముందు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడానికి సాహసించలేకపోయినా షరతులతో అనుమతులిచ్చారు. గురువారం ఈవో డి.భ్రమరాంబ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. 


‘‘సి.వి.రెడ్డి ఛారిటీ్‌సలో 100 బెడ్లు మాత్రమే ఏర్పాటు చేసి కొవిడ్‌ కేర్‌ సెంటరు నిర్వహించేందుకు ఆ ట్రస్టుకు షరతులతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం దేవదాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్లు అన్ని ప్రముఖ దేవాలయాల ఈవోలు, జే సీలు, డిప్యూటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి.. వార్షికాదా యం రూ.5కోట్లు పైబడిన అన్ని దేవాలయాల్లో అర్చకులు, సిబ్బంది, కుటుంబ సభ్యుల కోసం ఇతర సంస్థలతో కలసిఇ కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని, 3రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సి.వి.రెడ్డి ఛారిటీ్‌సలో రెండు నెలల పాటు కొవిడ్‌ కేర్‌ సెంటరు నిర్వహించేందుకు శ్రీ సంభవ్‌నాథ్‌ రాజేంద్రసూరిజైన్‌ స్వేతాంబర్‌ ట్రస్టుకు వచ్చే జూన్‌ 30వరకు అనుమతులు ఇవ్వడమైనది’’ అని దుర్గగుడి ఈవో వివరించారు. 


దేవస్థానం సిబ్బందికి ఆరోగ్య భద్రత 

సి.వి.రెడ్డి ఛారిటీస్‌లో ఏర్పాటు చేస్తున్న కొవిడ్‌ కేర్‌ సెంటరులో దేవస్థానం సిబ్బందికి 30 శాతం బెడ్లు, మరో  ఏసీ బెడ్లు కేటాయించి, చికిత్సతోపాటు భోజన వసతి కూడా ఉచితంగానే కల్పించేందుకు శ్రీ సంభవ్‌నాథ్‌ రాజేంద్రసూరిజైన్‌ స్వేతాంబర్‌ ట్రస్టు నిర్వాహకులు అంగీకారం తెలిపారని దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు.


షరతులు ఇవీ ..

- జిల్లా కలెక్టరు విధించిన షరతుల ప్రకారం కొవిడ్‌ కేర్‌ సెంటరులో 100 బెడ్లకు మించరాదు 

వాటిలో దేవస్థానం సిబ్బందికి ఏసీ హాలులో 5, మిగిలిన వాటిలో 30 శాతం బెడ్లు కేటాయించి ఉచిత వైద్యసేవలందించాలి. 

- మరో 30 శాతం డిస్ట్రిక్ట్‌ అడ్మినిస్ట్రేషన్‌ రిఫరెన్స్‌తో వచ్చిన కరోనా బాధితులకు కులమతాలకతీతంగా బెడ్లు ఏర్పాటు చేసి చికిత్స అందించాలి. 

- కరోనా బాధితులు ఎన్ని రోజులు చికిత్స పొందినా వారి నుంచి రూ. 21 వేల కన్నా ఎక్కువ ఫీజు వసూలు చేయకూడదు. 

- కొవిడ్‌ కేర్‌ సెంటరు నిర్వహించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు, సంఘటనలు జరిగినా వాటితో దేవస్థానానికి ఎలాంటి సంబంధం ఉండదు. వాటికి ట్రస్టు నిర్వాహకులే బాధ్యత వహించాలి. 

- ఈ సమయంలో సి.వి.రెడ్డి  ఛారిటీస్‌కు సంబంధించిన మొత్తం కరెంటు బిల్లులను ట్రస్టు  నిర్వాహకులే చెల్లించాలి. 

- 2వ తేదీ తరువాత తర్వాత సి.వి.రెడ్డి ఛారిటీ్‌సను ఎలాంటి డ్యామేజ్‌ లేకుండా యథాతథంగా దేవస్థానానికి అప్పగించాలి. 

Updated Date - 2021-04-30T15:58:57+05:30 IST