కోవిడ్‌పై సమీక్షకు శనివారం సీడబ్ల్యూసీ సమావేశం

ABN , First Publish Date - 2021-04-16T23:10:37+05:30 IST

దేశంలో కోవిడ్ పరిస్థితి అంతకంతకూ దిగజారుతుండటంపై సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్..

కోవిడ్‌పై సమీక్షకు శనివారం సీడబ్ల్యూసీ సమావేశం

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ పరిస్థితి అంతకంతకూ దిగజారుతుండటంపై సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శనివారంనాడు సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపే ఈ సమావేశానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షత వహిస్తారు. ''ప్రతిరోజూ లక్షల్లో కోవిడ్ కొత్త కేసులు వెలుగుచూస్తున్నందున పరిస్థితిని సత్వరం అదుపు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని చాలా తీవ్రమైన విషయంగా భావిస్తోంది. పార్టీ సుప్రీం కమిటీ (డబ్ల్సూసీ) ముందుకు ఈ విషయం తీసుకు వెళ్లాలని అనుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఒక తీర్మానాన్ని కూడా సీడబ్ల్యూసీ సమావేశంలో చేసే అవకాశం ఉంది'' అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.


కోవిడ్ కేసుల పెరిగిపోతున్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తరచు లేవనెత్తుతోంది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ నత్తనడకన నడుస్తుండటంపై కేంద్రంపై విమర్శలు సైతం గుప్పిస్తోంది. అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలంటూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నేరుగా ప్రధానికి ఇటీవల రాసిన లేఖల్లో విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కోసం నిధుల కేటాయింపు, పేద ప్రజల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు వేయాలని  కోరుతోంది. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, మంత్రులతో సోనియాగాంధీ ఈమధ్యనే ఒక సమావేశం కూడా జరిపారు. సంక్షోభ సమయంలో కోవిడ్ జాగ్రత్తలపై ఇంటింటి ప్రచారం చేపట్టాలని నేతలను సోనియాగాంధీ కోరారు. సామాన్య ప్రజానీకానికి వ్యాక్సిన్ అందించాలని తమకు ఉన్నా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్నామని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో సోనియా దృష్టికి  తెచ్చారు. ఆ సమావేశం పూర్తి కాగానే సోనియాగాంధీ నేరుగా ప్రధానికి లేఖ కూడా రాశారు. అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించాలని, వ్యాక్సిన్ల కొనుగోలుకు రాష్ట్రాలను అనుమంతించాలని, మరిన్ని వ్యాక్సిన్ల వినియోగానికి కూడా అనుమతించాలని సోనియాగాంధీ ఆ లేఖలో ప్రధానికి మూడు విజ్ఞప్తులు చేశారు.

Updated Date - 2021-04-16T23:10:37+05:30 IST