వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్న వారిలో.. టెన్షన్‌.. టెన్షన్‌

ABN , First Publish Date - 2021-05-17T05:30:00+05:30 IST

ఓవైపు కరోనా కేసులు.. మరోవైపు..

వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్న వారిలో.. టెన్షన్‌.. టెన్షన్‌

‘ఇంట’ర్నెట్‌తో జాగ్రత్త

సంస్థ మెయిల్స్‌, వెబ్‌సైట్లు హ్యాకింగ్‌

పూర్తయిన ప్రాజెక్టులు గల్లంతు

యాప్‌లను నమ్ముకుని మునిగిపోతున్న యువత


ప్రవీణ్‌కుమార్‌.. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగి. కంపెనీలో ఒకరి తర్వాత ఒకరికి కరోనా సోకడంతో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ అవకాశం ఇచ్చారు. హైదరాబాద్‌లోని రూమ్‌లో ఉండే ప్రవీణ్‌ విజయవాడలో ఇంటికి వచ్చేశాడు. ఇక్కడి నుంచే పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడు వర్క్‌ చేస్తున్న వెబ్‌సైట్‌లో ఏదో తేడా వచ్చిందని గుర్తించాడు. చివరికి ప్రవీణ్‌ అనుమానం నిజమైంది. అతడు పనిచేస్తున్న వెబ్‌సైట్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. 


కిరణ్‌బాబుకు కొంతకాలంగా ఎలాంటి ఉపాధి లేదు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసినా లాక్‌డౌన్‌ నుంచి కంపెనీల్లో ఎలాంటి నియామకాలు లేవు. ఏడాదిగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. తర్వాత గూగుల్‌ ప్లేస్టోర్‌లో వర్క్‌ ఫ్రం హోమ్‌కు సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. అందులో ప్రాథమిక సమాచారం మొత్తం ఇచ్చాడు. ప్రాసెస్‌ ఫీజు కింద కొంత మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించాడు. నెల రోజులపాటు చేతినిండా పని లభించింది. వేతనం మాత్రం ఖాతాలో జమ కాలేదు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు. తనకు రావాల్సిన వేతనాన్ని ఎవరిని అడగాలో తెలియక తలపట్టుకున్నాడు. 


ఇదీ.. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి. ఇంటి దగ్గర నుంచి పనిచేసే అవకాశం రావడం ఆనందం కలిగించే అంశమే అయినా ఇప్పుడు ఇలాంటి వారిని సైబర్‌ నేరగాళ్లు వణికించేస్తున్నారు. ప్రాజెక్టులను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. 


విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఓవైపు కరోనా కేసులు.. మరోవైపు లాక్‌డౌన్‌ నిబంధనలు.. దీంతో ఇప్పుడు చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌కే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇంతవరకు సంతోషమే అయినా.. ఉద్యోగులు, యువకుల పాలిట హ్యాకర్లు రాక్షసుల్లా మారారు. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ ద్వారా ఉద్యోగ కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారు నిరంతరం ‘ఈ’ ఆందోళనతో గడుపుతున్నారు. సైబర్‌ నేరగాళ్ల దురాగతాలు అడ్డుకోవడానికి కంపెనీలైతే సైబర్‌ భద్రతను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇళ్ల వద్ద పనిచేసే వారికి ఆ వెసులుబాటు లేదు. సర్వర్‌.. సంస్థ ప్రాంగణంలో ఉంటున్నప్పటికీ, ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఇంటర్నెట్‌ సదుపాయం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీన్నే సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేసుకుంటున్నారు. ఇళ్లలో ఉండే ఇంటర్నెట్‌కు ఎలాంటి భద్రత ఉండకపోవటంతో సైబర్‌ నేరగాళ్లు ఐపీ నెంబర్‌ను సులభంగా హ్యాక్‌ చేస్తున్నారు. గత నాలుగున్నర నెలల్లో ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ నేరాలు పెరిగాయని అమెరికాకు చెందిన వెరిజాన్‌ బిజినెస్‌ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మొత్తం 5,258 కేసుల్లో వ్యక్తిగత సమాచారం చోరీ అయినట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. 


ఆ యాప్‌ల జోలికి పోవద్దు

దేశంలో లాక్‌డౌన్‌ అమలు చేసినప్పటి నుంచి ఉపాధి అవకాశాలు దారుణంగా పడిపోయాయి. చాలా సంస్థలు ఉద్యోగుల సంఖ్యలో కోత విధించాయి. తమ ఆర్థిక వ్యవస్థ కుదుట పడే వరకు ఎలాంటి నియామకాలు చేపట్టకూడదని నిర్ణయించుకున్నాయి. కొన్ని వాణిజ్య సంస్థల్లో మాత్రమే అవసరాన్ని బట్టి నియామకాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంజనీరింగ్‌, డిగ్రీ పట్టాలు పట్టుకున్న యువత ఉపాధి లేక విలవిల్లాడిపోతున్నారు. కొంతమంది సిఫార్సులను ఉపయోగించుకుని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం ఖాయమవడం కష్టంగా ఉంది. వేచి చూసీచూసీ కళ్లు కాయలు కాసిన యువకులు ఆన్‌లైన్‌ యాప్‌లను, ప్రకటనలను నమ్ముకుంటున్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌కు వెళ్లి వర్క్‌ ఫ్రం హోమ్‌ యాప్‌లను వెతుకుతున్నారు.


గ్లోరోడ్‌, వర్క్‌ ఫ్రం హోమ్‌ జీరో ఇన్వెస్ట్‌మెంట్‌, ఫుల్‌/పార్ట్‌టైమ్‌ జాబ్స్‌, డేటా ఎంట్రీ, డబ్ల్యూఐ జాబ్స్‌, ఫుట్‌వర్క్‌, అలిప్పో, పేయూ జాబ్స్‌, పేబాక్స్‌, వన్‌కోడ్‌ వంటి యాప్‌లను తమ స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఈ యాప్‌లకు ఉన్న రేటింగ్‌ను బట్టి డౌన్‌లోడ్‌ చేసుకుని మొత్తం సమాచారాన్ని ఇస్తున్నారు. ఆయా యాప్‌ల నిబంధనలకు అంగీకరిస్తున్నారు. కొంతమంది యువకులు యాప్‌లో ఉన్న సమాచారాన్ని బట్టి వారికి టచ్‌లోకి వెళ్తున్నారు. అప్లికేషన్‌, ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ ఫీజుల రూపంలో వేలాది రూపాయలను సమర్పించు కుంటున్నారు. ప్రాజెక్టును పూర్తిచేసి ఇచ్చినా చిల్లిగవ్వంత ప్రతిఫలం దక్కలేదు. అనేకసార్లు వేతనం కోసం ఈ-మెయిళ్లు పంపినా తిరుగు సమాధానం లేదు. ఫోన్‌ నెంబర్లకు కాల్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌. చివరకు చిరాకు వచ్చిన కొంతమంది యువకులు ఆ యాప్‌లను అన్‌ ఇన్‌స్టాల్‌ చేసేస్తున్నారు. 


కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లను జాగ్రత్తగా ఉపయోగించాలి 

వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసే వారికి ఆయా కంపెనీలు ప్రత్యేకంగా ఒక నెట్‌వర్క్‌ను కల్పిస్తాయి. వీపీఎన్‌ (వర్చ్యువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌) ద్వారా కంపెనీకి ఇంటి వద్ద నుంచి పనిచేసే వారు అనుసంధానమవుతారు. ఇందులోకి సైబర్‌ నేరగాళ్లు ప్రవేశించే అవకాశం లేదు. కాకపోతే ఇంటి వద్ద నుంచి పనిచేసే వారు ఉపయోగించే కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లను చాలా జాగ్రత్తగా వాడాలి. మెయిల్‌కు ప్రమాదకరమైన లింక్‌లు వస్తాయి. వాటిని తెరవకపోవడం మంచిది. ఆ మెయిళ్లను తెరిస్తే ఉద్యోగుల యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ హ్యాక్‌ అవుతాయి. అప్పుడు మాత్రం ఇళ్ల వద్ద నుంచి పనిచేసే వారి ప్రాజెక్టులు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. పోర్నోగ్రఫీ, ఇతర ఫ్రీ ఆఫర్లతో సైబర్‌ నేరగాళ్లు కీ లాగర్స్‌ను పంపుతారు. ఆ మెయిళ్లను తెరిస్తే ఈ కీలాగర్స్‌ యూజర్‌, పాస్‌వర్డ్‌లను తస్కరిస్తాయి. అదేవిధంగా గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉండే వర్క్‌ ఫ్రం హోమ్‌ యాప్‌లు అన్నీ బోగస్‌. వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోకపోవడం మంచిది. ఒకవేళ వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇస్తే ఆయా కంపెనీలే సొంతంగా ఒక యాప్‌ను తయారు చేసి ఉద్యోగులకు ఇస్తాయి. 

- నలమోతు శ్రీధర్‌, సాంకేతిక పరిజ్ఞాన నిపుణుడు



Updated Date - 2021-05-17T05:30:00+05:30 IST