ఆధార్‌ లింక్‌ పేరుతో మోసం

ABN , First Publish Date - 2021-06-08T04:39:10+05:30 IST

ఆధార్‌లింక్‌ పేరుతో స్వాహా అయిన రూ 4.5లక్షల సొమ్మును కొత్తగూడెం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల సహకారంతో అశ్వాపురం పోలీసులు రికవరీ చేశారు.

ఆధార్‌ లింక్‌ పేరుతో మోసం

రూ. 6.20 లక్షలు మాయం చేసిన సైబర్‌ నేరగాళ్లు

చాకచక్యంగా రివకరీ చేసిన పోలీసులు

అశ్వాపురం జూన్‌ 7: ఆధార్‌లింక్‌ పేరుతో స్వాహా అయిన రూ 4.5లక్షల సొమ్మును కొత్తగూడెం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల సహకారంతో అశ్వాపురం పోలీసులు రికవరీ చేశారు. ఈమేరకు సంఘటనకు సంబంధించిన వివరాలను మణుగూరు ఏఎస్పీ శబరీష్‌ సోమవారం ప్రకటన ద్వారా వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. అశ్వాపురం మండలం గౌతమీగర్‌ కాలనీకి చెందిన భారజల ఉద్యోగి దామోదర్‌రావు మొబైల్‌కు గత నెల 20న ఒకకాల్‌ వచ్చింది. తమను సంప్రదించి ఆధార్‌ లింక్‌ చేసుకోవాలన్నది దాని సారాంశం. అనంతరం సైబర్‌నేరగాళ్లు రూ.10 పంపిస్తే లింక్‌ అయ్యిందో లేదో చూస్తామని తెలపటంతో దామోదర్‌రావు నెట్‌ బ్యాకింగ్‌ ద్వారా రూ.10 పంపగా వెంటనే అతని అకౌంట్‌ నుంచి రూ.6.20 లక్షలు మాయమయ్యాయి. వెంటనే బాధితుడు అశ్వాపురం పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సీఐ సాట్ల రాజు స్పందించి కొత్తగూడెం సైబర్‌క్రైమ్‌ పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సైబర్‌ నేరగాళ్లు దామోదర్‌ రావు ఖాతా నుంచి కొల్లగొట్టిన డబ్బుతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేశారు. సైబర్‌ క్రైం పోలీసులు ఆ వస్తువులు డెలివరీ కాకుండా నిలుపుదల చేసి.. వారి వద్ద నుంచి రూ 4.5 లక్షలను రికవరీ చేశారు. కాగా సైౖబర్‌ నేరగాళ్లబారిలో పడి సొమ్ము పోగొట్టుకోవద్దని, ఏదైనా అనుమానం కలిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏఎస్పీ తెలిపారు.


Updated Date - 2021-06-08T04:39:10+05:30 IST