సైబర్‌ టెర్రర్‌

ABN , First Publish Date - 2021-08-02T06:47:50+05:30 IST

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు.

సైబర్‌ టెర్రర్‌

రెచ్చిపోతున్న దొంగలు

7 నెలల్లో 32.24 కోట్లు దోచేసిన కేటుగాళ్లు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. వివిధ రకాల స్కీములతో బురిడీ కొట్టిస్తూ అమాయకులను దోచుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసి రూ. లక్షలు లూటీ చేస్తు న్నారు. ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే కేవలం 7 నెలల్లో (ఈ ఏడాది) రూ. 32,24,49,321లు దోచేశారు. మొత్తం 36 పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 1701 కేసులు నమోదైనట్లు సైబర్‌ క్రైం పోలీసులు తెలిపారు. ఎన్నో మోసాలు జరుగుతున్నా, రూ. లక్షల్లో సొత్తు పోగొట్టుకుంటున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. పరిచయం లేని వ్యక్తుల మాటల మాయలో పడిపోతున్న ప్రజలు అడ్డంగా మోసపోతున్నారు. జాబ్‌ ఫ్రాడ్స్‌, కేవైసీ అప్‌డేట్‌, ఓఎల్‌ఎక్స్‌, క్యూఆర్‌ కోడ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌, కస్టమర్‌ కేర్‌, బిజినెస్‌, సోషల్‌ మీడియా అవకాశాలు, అడ్వర్టైజ్‌మెంట్‌, ట్రేడింగ్‌, గిఫ్ట్స్‌.. ఇలా అనేక పేర్లతో, విభిన్న రకాలుగా అమాయకులను మోసం చేస్తున్నారు. అత్యాశకు పోతున్న వారే ఎక్కువగా మోసపోతున్నారని పోలీసులు చెబుతున్నారు. 


కేసుల్లో టాప్‌లేపిన గచ్చిబౌలి..

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అత్యధికంగా సైబర్‌ క్రైం కేసులు నమోదైన పోలీస్‌స్టేషన్లలో గచ్చిబౌలి టాప్‌లో నిలిచింది. సైబర్‌ నేరాలు అధికంగా పెరిగిపోతుండటం, కమిషనరేట్‌ పరిధిలో ఒక్కటే సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉండటంతో బాఽధితులు ఫిర్యాదు చేయడానికి అనేక ఇబ్బందులు ఉండేవి. చాలా దూర ప్రాంతాల నుంచి బాఽధితులు కమిషనరేట్‌కు వచ్చేవారు. వారికి దూర భారాన్ని తగ్గించడానికి సీపీ సజ్జనార్‌ ఈ ఏడాది మార్చి నుంచి ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యేక సైబర్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. ఎక్కడి ఫిర్యాదులు అక్కడే తీసుకునే విఽధంగా వ్యవస్థను రూపొందించారు. అక్కడ నమోదైన ప్రతి సైబర్‌ క్రైం ఫిర్యాదుపై కమిషనరేట్‌లోని ప్రధాన సైబర్‌ క్రైం వింగ్‌ పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతీ ఫిర్యాదుపైనా కేసు నమోదు చేసేలా నిర్ణయించారు. మార్చి 22 నుంచి ప్రత్యేక సైబర్‌ సెల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచీ ఏ పోలీస్‌ స్టేషన్‌లో ఎన్ని కేసులు నమోదవు తున్నాయి, బాధితులు ఎంత మొత్తంలో నగదు పోగొట్టుకున్నారు, ఏయే సైబర్‌ నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి అనేది అధ్యయనం చేసి, ప్రత్యేక డేటా రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి నుంచి జూలై వరకు నమోదైన కేసులు, సైబర్‌ క్రైం పోలీసుల అధ్యయనం ప్రకారం.. గచ్చిబౌలి పరిధిలో అత్యధిక సైబర్‌ కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలల్లో 132 కేసులతో గచ్చిబౌలి టాప్‌లో నిలిచింది. బాఽఽధితులు రూ. 95.4 లక్షల సొత్తును పోగొట్టు కున్నారు. బాధితుల్లో అత్యధికంగా ఉన్నత చదువులు చదివిన వారు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసుల అధ్యయనంలో తేలింది. అత్యాధునిక టెక్నాలజీపై పట్టు ఉండి, సైబర్‌ నేరాలపై అవగాహన ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఎక్కువగా మోసపోతుండడంపై పోలీసులు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు. 

రెండో స్థానంలో మియాపూర్‌ (112 కేసులు), మూడో స్థానంలో రాజేంద్రనగర్‌ (103 కేసులు), నాలుగో స్థానంలో మాదాపూర్‌ (101 కేసులు) నిలిచాయి. ఇవి కాక.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి-21 వరకు (ప్రత్యేక సైబర్‌ సెల్‌ అయ్యేంత వరకు) సైబర్‌ క్రైం ప్రధాన వింగ్‌లో 332 కేసులు నమోదయ్యాయి. వారి నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ. 21,28,35,316లు దోచేశారు.  మార్చి 22 నుంచి జూలై 27 వరకు అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 1369 కేసులు నమోదు కాగా బాధితులు పోగొట్టుకున్న మొత్తం డబ్బు రూ. 10,96,14,005. మొత్తంగా ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 1701 కేసులు నమోదు కాగా రూ.32,24,49,321లను సైబర్‌ నేరగాళ్లు దోచేశారు. కడ్తాల్‌, చౌదరిగూడ పోలీస్‌ స్టేషన్లలో ఒక్క సైబర్‌ క్రైమ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. 

Updated Date - 2021-08-02T06:47:50+05:30 IST