ఫారెక్స్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.42 లక్షలకు టోపీ

ABN , First Publish Date - 2021-01-26T07:30:36+05:30 IST

ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.41.98 లక్షలు కొల్లగొట్టారు. ప్రధాన నిందితు

ఫారెక్స్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.42 లక్షలకు టోపీ

 మూలాలు చైనాలో.. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారులు

 నేరగాళ్లకు సహకరిస్తున్న ఇండోర్‌ వైద్యుడి అరెస్ట్‌


హైదరాబాద్‌ సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.41.98 లక్షలు కొల్లగొట్టారు. ప్రధాన నిందితులు ఇద్దరు చైనీయులు కాగా.. వారికి సహకరించిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వైద్యుడిని రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వైద్యుడు ఆదిత్య నారాయణ్‌ గాడ్బొలే అలియాస్‌ ఆది (37).. 2007లో ఎంబీబీఎస్‌ చదివేందుకు చైనా వెళ్లాడు. ఇతడికి 2015లో మావోజిబిన్‌ పరిచయమయ్యాడు. మావోజిబిన్‌ వియత్నాంలో నకిలీ ఫారెక్స్‌ ట్రేడ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఆదిత్యకు చెప్పి ‘బినాన్స్‌’ పేరుతో ఇన్వె్‌స్టమెంట్‌ ఏజెన్సీని ప్రారంభించాడు. కొవిడ్‌ నిబంధనల కారణంగా భారత్‌కు రాలేకపోతున్నానని చెబుతూ కంపెనీ తరఫున అన్ని వ్యవహారాలు చూసుకునేందుకు ఆదిత్యను మార్కెటింగ్‌ మేనేజర్‌గా నియమించాడు. ఈ సంస్థలో చైనాకు చెందిన పీర్స్‌ ఏకేఏ మోనికా అడ్వైజరీ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఈమె ట్రేడింగ్‌లో పెట్టుబడులంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తూ.. ఆసక్తి ఉన్న వారితో ఫోన్‌లో మాట్లాడి వారిని తమ సంస్థలో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తోంది. ఇదే తరహాలో నగరానికి చెందిన వ్యక్తితో మాట్లాడిన మోనికా అతడి నుంచి పెట్టుబడి పేరుతో రూ.41,98,508 వసూలు చేసింది. పెట్టుబడి పెట్టిన అనంతరం ఫోన్లు స్విచ్‌ఆ్‌ఫరావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన సైబర్‌క్రైం పోలీసులు ఇండోర్‌లో ఉంటున్న డాక్టర్‌ ఆదిత్యనారాయణ్‌ను అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి ఐఫోన్‌తోపాటు అతడి ఖాతాలోని రూ.11.50 లక్షల నగదును ఫ్రీజ్‌ చేశారు. నిందితుడిని నగరానికి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఈ మోసంలో ప్రధాన నిందితులైన ఇద్దరు చైనీయులు పరారీలో ఉన్నారు. 



Updated Date - 2021-01-26T07:30:36+05:30 IST