ఆర్మీ ఉద్యోగులే టార్గెట్.. రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు..

ABN , First Publish Date - 2020-05-15T17:50:48+05:30 IST

సైబర్‌ కేటుగాళ్లు ఆర్మీ ఉద్యోగులను టార్గెట్‌ చేశారా? సైబర్‌క్రైమ్స్‌ పోలీసులకు వస్తున్న ఫిర్యాదులను చూస్తే అవుననే అనిపిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో కూడా యథేచ్ఛగా నేర కార్యకలాపాలను కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తూ అందినంత దండుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు

ఆర్మీ ఉద్యోగులే టార్గెట్.. రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు..

ఆర్మీ ఉద్యోగులే టార్గెట్‌గా మోసాలు

పలువురి ఖాతాల నుంచి డబ్బు కాజేసిన సైబర్‌ కేటుగాళ్లు

ఒకేరోజు ముగ్గురు బాధితులు సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు


హిమాయత్‌నగర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): సైబర్‌ కేటుగాళ్లు ఆర్మీ ఉద్యోగులను టార్గెట్‌ చేశారా? సైబర్‌క్రైమ్స్‌ పోలీసులకు వస్తున్న ఫిర్యాదులను చూస్తే అవుననే అనిపిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో కూడా యథేచ్ఛగా నేర కార్యకలాపాలను కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తూ అందినంత దండుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు నెలరోజులుగా ఆర్మీ ఉద్యోగులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులను బట్టి అర్థమవుతోంది. తాము మోసపోయామంటూ బాధితులు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం ఒక్కరోజే ముగ్గురు ఆర్మీ ఉద్యోగులు కేటుగాళ్ల చేతిలో మోసపోయామంటూ హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదుచేశారు. దురై గురువయ్య అనే జవాన్‌ జమ్మూకు వెళ్లాల్సి ఉండగా తన వద్ద ఉన్న ఇన్వర్టర్‌ను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన వేశాడు. అతడిని ఫోన్‌లో సంప్రదించిన ఓ ఆగంతుకుడు తాను ఇన్వర్టర్‌ కొంటానని చెప్పి ముందుగా రూ. 500 ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. మిగతా డబ్బును క్యూఆర్‌ కోడ్‌ ద్వారా పంపిస్తున్నానని, మీ ఫోన్‌కు క్యూఆర్‌ కోడ్‌ రాగానే క్లిక్‌ చేయాలని చెప్పాడు. రెండు దఫాలుగా రూ. 44 వేలను గురువయ్య ఖాతా నుంచి కాజేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


వాహనం విక్రయం పేరుతో...

నితిన్‌జైన్‌ అనే మరో ఆర్మీ జవాన్‌ కూడా ఇదే తరహాలో మోసపోయాడు. జమ్మూకు వెళ్లాల్సిన క్రమంలో తనకు టూవీలర్‌ ఉంటే బాగుంటుందని భావించి సెకండ్‌ హ్యాండ్‌లో హోండా యాక్టివా కొనుగోలు చేయాలనుకున్నాడు. ఓఎల్‌ఎక్స్‌లో వెతకగా రూ. 23 వేలకు యాక్టివా వాహనం విక్రయిస్తున్నట్లు ఉన్న ప్రకటన చూసి ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాడు. కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత నితిన్‌ను ముగ్గులోకి దింపిన ఆగంతుకుడు జమ్మూలో వాహనం డెలివరీ చేయడానికి పార్శిల్‌, డెలివరీ, సెక్యూరిటీ డిపాజిట్‌, ఇంటర్‌స్టేట్‌ ట్రాన్స్‌ఫర్‌ చార్జీలు వగైరా మొత్తం కలిపి మరో లక్ష అవుతుందని, వాహనం ఖరీదు కలుపుకొని రూ. 1.23 లక్షలు చెల్లిస్తే డెలివరీ చేస్తామని, డెలివరీ అయిన తర్వాత చార్జీలు పోను సెక్యూరిటీ డిపాజిట్‌ మొత్తం తిరిగి చెల్లిస్తామని నమ్మించాడు. ఆగంతుకుడి మాటలు నమ్మిన నితిన్‌ అతడి బ్యాంక్‌ ఖాతాకు డబ్బు బదిలీ చేశాడు. డబ్బు అందగానే ఆగంతుకుడి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. మోసపోయానని గ్రహించిన నితిన్‌ సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. 


ఫోన్‌ రీచార్జి అంటూ...

మొబైల్‌ రీచార్జి చేయబోయిన ఆర్మీ ఎస్‌ఐ స్థాయి అధికారి రూ. 44 వేలు పోగొట్టుకున్నాడు. ఆర్మీ అధికారి నిర్మల్‌సింగ్‌ జియో మొబైల్‌ రీచార్జిని ఆన్‌లైన్‌ ద్వారా చేయడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో  జియో కస్టమర్‌కేర్‌ సెంటర్‌కు కాల్‌ చేయాలనుకున్నాడు. గూగుల్‌లో కాల్‌సెంటర్‌ నంబర్‌ కోసం సెర్చ్‌ చేయగా ఓ నంబర్‌ కనిపించడంతో దానికి ఫోన్‌ చేశాడు. అది ఫేక్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కావడంతో ఫోన్‌ ఎత్తిన సైబర్‌ కేటుగాళ్లు నిర్మల్‌సింగ్‌ను ముగ్గులోకి దింపారు. క్యూఆర్‌ కోడ్‌ పంపిస్తున్నామని, దానిద్వారా రీచార్జి అవుతుందని నమ్మించి మూడు దఫాలుగా నిర్మల్‌సింగ్‌ బ్యాంక్‌ ఖాతాలో ఉన్న రూ. 44 వేలు కాజేశారు. ఫోన్‌ రీచార్జి కాకపోగా బ్యాంక్‌ ఖాతాలో ఉన్న డబ్బంతా పోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


మాస్కులు కొంటానంటూ..

మాస్కులు కుట్టి ఆన్‌లైన్‌లో విక్రయించాలనుకున్న ఓ మహిళ సైబర్‌ కేటుగాళ్ల బారిన పడి ఉన్నదంతా పోగొట్టుకుంది. కవాడిగూడకు చెందిన ఓ మహిళ లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులు లేకపోవడంతో  మాస్కుల తయారీ ప్రారంభించింది. మాస్కులు కుట్టి వాటిని ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించాలని భావించి ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన చూసిన ఓ సైబర్‌ కేటుగాడు మహిళను ఫోన్‌లో సంప్రదించాడు. పెద్ద మొత్తంలో మాస్కులు కొనుగోలు చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ. 500 ముందుగా ఆన్‌లైన్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేసి మిగతా డబ్బును క్యూఆర్‌ కోడ్‌ ద్వారా పంపిస్తానని నమ్మించాడు. కేటుగాడి మాటలు నమ్మిన ఆమె క్యూఆర్‌ కోడ్‌ ప్రెస్‌ చేయగానే ఆమె ఖాతా నుంచి రూ. 32 వేలు మాయమయ్యాయి. కేటుగాడికి కాల్‌ చేస్తే ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది.

Updated Date - 2020-05-15T17:50:48+05:30 IST