సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడలు.. ఏకంగా బ్యాంకు అధికారులకే..

ABN , First Publish Date - 2021-05-13T13:14:32+05:30 IST

సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలను వేస్తున్నారు.

సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడలు.. ఏకంగా బ్యాంకు అధికారులకే..

  • కరోనా చికిత్స పేరిట ఖాతాల్లోంచి నగదు మళ్లింపు
  • మెయిల్‌, లెటర్‌హెడ్‌లతో ఇతర ఖాతాలకు రూ. 28.50 లక్షలు బదిలీ
  • సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ...
  • పోలీసులను ఆశ్రయించిన బాధితులు 

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలను వేస్తున్నారు. కరోనా సోకి చికిత్స తీసుకుంటున్నానంటూ ఏకంగా బ్యాంకు అధికారులనే బురిడీ కొట్టిస్తున్నారు. ఇతరుల ఖాతాల్లోంచి లక్షల్లో నగదును కాజేస్తున్నారు. నగరంలో ఇటీవల రెండు వేర్వేరు సంఘటనల్లో బ్యాంకు అధికారులను బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు మొత్తం రూ.28.50 లక్షలు కొల్లగొట్టారు. వివరాలిలా ఉన్నాయి. 


క్యూబే కాపర్‌ ట్యూబ్స్‌ పేరుతో వీరభద్ర బండారి ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఇతడికి సంస్థ తరఫున బేగంపేట యాక్సిక్‌ బ్యాంక్‌లో కరెంట్‌ ఖాతా ఉంది. కొన్ని రోజుల క్రితం వీరభద్ర పేరుతో ఓ వ్యక్తి యాక్సిస్‌ బ్యాంకు అధికారులకు ఫోన్‌ చేశాడు. తనకు కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని తెలిపాడు. తన వద్ద చెక్‌బుక్‌ లేని కారణంగా రిజిస్టర్‌ మెయిల్‌ ద్వారా సంస్థ లెటర్‌ హెడ్‌పై పంపిన వివరాల ప్రకారం 3 ఖాతాలకు నగదు చెల్లింపు చేయాలని కోరాడు. 


సంతకం సరిచూసుకున్న బ్యాంకు సిబ్బంది ఖాతాకు రిజిస్టర్‌ అయిన మెయిల్‌ ద్వారా సంస్థ లెటర్‌ హెడ్‌పై సూచించిన ఖాతాలకు రూ.23.59 లక్షల వరకు బదిలీ చేశారు. నగదు బదిలీ అయిందన్న మెసేజ్‌లు చూసిన వీరభద్ర వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించాడు. తనప్రమేయం లేకుండా నగదు బదిలీ జరిగిందంటూ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు అధికారులు గమనించేలోపే ఆయా ఖాతాల్లోని నగదును సైబర్‌ నేరగాళ్లు వేరే ఖాతాల్లోకి మార్చుకున్నారు. దాంతో బాధితుడు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


మరో కేసులో

ప్రతా్‌పరాజ్‌ మోదీ అనేవ్యక్తి మోదీ ఇండియా డాట్‌ కామ్‌ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థకు ఆర్‌పీ రోడ్‌లో ఉన్న కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌లో ఖాతా ఉంది. బ్యాంక్‌ అధికారులకు ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాడు తాను ప్రతా్‌పరాజ్‌ అని తనకు కరోనాసోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని. లెటర్‌ హెడ్‌పై సూచించిన ఖాతాలకు డబ్బులు బదిలీ చేయాలంటూ మెయిల్‌ చేశాడు. సంతకం సరిపోడంతో బ్యాంకు సిబ్బంది అందులో సూచించిన విధంగా రూ.5 లక్షలను వేరే ఖాతాలకు బదిలీ చేశారు. గుర్తించిన బాధితుడు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకున్న సైబర్‌క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


గిఫ్ట్‌ పేరుతో రూ. 2.2 లక్షల టోకరా

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి విదేశాల నుంచి విలువైన బహుమతులు పంపుతున్నానని ఓ వ్యక్తికి సందేశం పంపింది. కస్టమ్స్‌ అధికారుల పేరుతో ఫోన్‌ చేసిన ఆ బహుమతులు చేరాలంటే డ్యూటీ సుంకం చెల్లించాలని వారు చెప్పిన ఖాతాల్లో పలు దఫాలుగా రూ. 2.2 లక్షలు జమ చేయించారు. చివరికి ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.

Updated Date - 2021-05-13T13:14:32+05:30 IST