ఉద్యోగం ఇస్తామని ఖాతాలోంచి డబ్బులు దోచేశారు

ABN , First Publish Date - 2021-05-05T15:53:25+05:30 IST

సైబర్‌ నేరగాళ్ల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగాలు, బహుమతులు, లక్షల రూపాయల లాటరీలు వచ్చాయని నేరగాళ్లు...

ఉద్యోగం ఇస్తామని ఖాతాలోంచి డబ్బులు దోచేశారు

హైదరాబాద్/బాలానగర్‌ : సైబర్‌ నేరగాళ్ల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగాలు, బహుమతులు, లక్షల రూపాయల లాటరీలు వచ్చాయని నేరగాళ్లు మొబైల్‌ ఫోన్లకు వాట్సా్‌పలకు పంపించే లింక్‌లను ఓపెన్‌ చేయవద్దని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు సైబర్‌ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇలాంటి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలానగర్‌లో నివాసముండే వై.సంతోషికుమారికి ఏప్రిల్‌ 27న నౌకరీ డాట్‌కామ్‌ నుంచి మాట్లాడుతున్నామని ఓ మహిళ ఫోన్‌ చేసింది. రూ.25 కట్టి రిజిస్టర్‌ చేసుకుంటే మంచి ఉద్యోగం ఇప్పిస్తామని, తాము పంపించే లింకును ఓపెన్‌ చేసి డబ్బు పంపించి వివరాలు చెప్పమంది. నమ్మి, లింక్‌ను ఓపెన్‌ చేసి వివరాలు అందించి డబ్బులు వేసే ప్రయత్నం ఆమె చేయగా పేమెంట్‌ అవ్వలేదు. ఈ విషయాన్ని అక్కడితో వదిలేసిన ఆమె ఏప్రిల్‌ 30న జీతం అకౌంట్‌లో పడగానే చెక్‌ చేసుకుంది. కానీ అప్పటికే ఆమె అకౌంట్‌ నుంచి రూ. 16,665లు డ్రా చేసినట్లు గుర్తించింది. మరికొద్ది నిమిషాల్లో మరో వెయ్యి కట్‌ కావడంతో అనుమానం వచ్చి బ్యాంకు అధికారులను సంప్రదించింది. వివరాలు పరిశీలించిన అధికారులు సైబర్‌ మోసం జరిగిందని వెల్లడించడంతో సోమవారం రాత్రి బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-05T15:53:25+05:30 IST