లోన్ సొమ్ము.. దొంగల పాలు

ABN , First Publish Date - 2020-05-12T11:20:28+05:30 IST

మనోజ్‌ (పేరు మార్చాం).. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఇంటి వద్ద ఆర్థిక ఇబ్బందుల కారణంగా పర్సనల్‌ లోన్‌కు అప్లై చేశాడు.

లోన్ సొమ్ము.. దొంగల పాలు

మొత్తం దోచేసిన సైబర్‌ నేరగాళ్లు 

కేవైసీ అప్‌డేట్‌ పేరుతో మస్కా 

రూ. 9లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు


హైదరాబాద్‌ సిటీ, మే 11 (ఆంధ్రజ్యోతి): మనోజ్‌ (పేరు మార్చాం).. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఇంటి వద్ద ఆర్థిక ఇబ్బందుల కారణంగా పర్సనల్‌ లోన్‌కు అప్లై చేశాడు. బ్యాంకు రూ. 5 లక్షలు మంజూరు చేసింది. ఆ డబ్బును బ్యాంకు అధికారులు అతని ఖాతాలో జమచేశారు. అప్పటికే ఆ ఖాతాలో రూ. 4 లక్షల డబ్బు ఉంది. ఆ 9 లక్షలతో ఇంట్లోని సమస్యలను తీరుద్దామనుకుంటున్న సమయంలో సైబర్‌ నేరగాళ్లు మనోజ్‌ ఖాతాను కొల్లగొట్టి సొమ్మంతా దోచేశారు. 


ఎలాగంటే...

లోన్‌ డబ్బులు మంజూరై ఖాతాలో జమ అయిన తర్వాత ఒక అపరిచిత వ్యక్తి మనోజ్‌కు ఫోన్‌ చేశాడు. ‘‘నేను బ్యాంకు అధికారిని మాట్లాడుతున్నాను. మీ బ్యాంకు ఖాతా కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) డిటెయిల్స్‌ అప్‌డేట్‌ చేయాలి. లేదంటే ఖాతా బ్లాక్‌ అవుతుంది. టీవ్‌ వీవర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి నంబర్‌ చెప్తే నీకు ప్రాబ్లమ్‌ లేకుండా మేమే అప్‌డేట్‌ చేస్తాం. జస్ట్‌ మేం అడిగిన వివరాలు చెప్తే చాలు’’ అంటూ నమ్మించాడు. చేయకపోతే లోన్‌ డబ్బులు బ్లాక్‌ అయిపోతాయోమోనన్న ఆందోళనలో మనోజ్‌ అతను చెప్పినట్లు చేశాడు. సైబర్‌ నేరగాళ్లు మనోజ్‌ ఫోన్‌లో కేవైసీ అప్‌డేట్‌ చేస్తున్నట్లు నటిస్తూ.. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యూసర్‌ ఐడీ, పాస్‌వర్డు తెలుసుకొని అతని ఖాతాలో ఉన్న రూ. 9 లక్షలను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.


కొద్ది సేపటి తర్వాత కేవైసీ అప్‌డేట్‌ అయిపోయి ఉంటుందని భావించిన మనోజ్‌ తన ఖాతా చెక్‌ చేసుకోగా డబ్బులు పోయినట్లు గుర్తించాడు. బ్యాంకు అధికారులను సంప్రదించగా తామేమీ చేయలేమని.. ఇదంతా సైబర్‌ నేరగాళ్ల పని అని సెలవిచ్చారు. సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన మోసాన్ని చెప్పుకొని మనోజ్‌ గొల్లుమన్నాడు. ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు ఇదంతా జార్ఖండ్‌కు చెందిన సైబర్‌ నేరగాళ్ల ముఠా చేసినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఆర్మీ జవాన్‌ ఖాతాలో రూ. 4.31 లక్షలు మాయం

తిరుమలగిరి లాల్‌బజార్‌ ప్రాంతంలో ఉంటున్న ఆర్మీ ఆఫీసులో పని చేస్తున్న జవాన్‌కు కొన్ని రోజుల క్రితం బజాజ్‌ ఎలియాజ్‌ ఫైనాన్స్‌ సంస్థ నుంచి ఫోన్‌ చేస్తున్నామని, లోన్‌ కావాలా  అని అపరిచితులు ఫోన్‌చేశారు. సంస్థ గురించి తెలిసిన అతడు నిజమే అని నమ్మి అడిగిన డాక్యుమెంట్లు పంపాడు. లోన్‌ ప్రాసెసింగ్‌, డాక్యుమెంటేషన్‌, అడ్వాన్స్‌ అమౌంట్‌ తదితర పేర్లతో పలుమార్లు అతడి నుంచి రూ. 4.31 లక్షలు వసూలు చేశారు. అప్పటి నుంచి వారి ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తోంది. అతడు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


గిఫ్ట్‌ పేరుతో..

మీకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్‌ షాప్‌క్లూస్‌లో తీసిన డ్రాలో బహుమతి వచ్చిందని, గిఫ్ట్‌ డెలివరీ చేయాలంటే కొంత ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలంటూ బహదూర్‌పురాకు చెందిన వ్యక్తికి ఫోన్‌ వచ్చింది. అది నిజమని నమ్మి అతడు వారు సూచించిన ఎకౌంట్‌కు నగదు పంపాడు. డబ్బులు పంపినా గిప్ట్‌ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి.. సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు.

Updated Date - 2020-05-12T11:20:28+05:30 IST