Abn logo
Jul 18 2021 @ 12:35PM

Chiranjeevi అల్లుడు.. YS Sharmila, పూనంకౌర్‌‌కు తప్పని ‘సై’డర్.. మౌనంగా ఉన్నారెందుకో..!?

  • డబ్బుల కోసం టార్గెట్‌ చేస్తున్న క్రిమినల్స్‌
  • సైబర్‌క్రైంలో పెరుగుతున్న సెలబ్రిటీల ఫిర్యాదులు
  • మౌనంగా పలువురు బాధితులు

హైదరాబాద్‌ సిటీ : సైబర్‌ నేరగాళ్లు ప్రముఖులను టార్గెట్‌ చేస్తున్నారు. తాజాగా టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటూ ఆయన వ్యక్తిగత వివరాలు తీసుకున్నారు. సకాలంలో గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రమాదం తప్పింది. ఇలా ఉన్నతాధికారులు, రాజకీయవేత్తలు, సెలబ్రిటీలనూ వదలని కొందరు వీలైతే మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే అమాయకులను మోసం చేస్తూ రూ. వేలల్లో, లక్షల్లో కాజేస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. పెద్ద వారినీ దోచుకునేందుకు ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది.  సెలబ్రిటీలకు వచ్చే మరో పెద్ద సమస్య వేధింపులు.. రకరకాల దుష్ర్పచారాలు. గతంలోనూ ఇలాంటి వారి బారిన పడిన ఎంతో మంది ప్రముఖులు సైబర్‌ క్రైం పీఎస్‌ గడప తొక్కాల్సి వచ్చింది.


- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సోషల్‌మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ ఐటీ సెల్‌ కన్వీనర్‌ వెంకటరమణ ఈ ఏడాది మార్చి 10న  సైబర్‌క్రైంలో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్‌కు రూ. 600 కోట్ల ఆస్తులున్నాయని ప్రచారం జరగడంతో ఆయన ఫిర్యాదు చేశారు. 


- ‘భీష్మ’ సినిమా దర్శకుడిని సైబర్‌ నేరస్థులు బురిడీ కొట్టించారు. ఈ ఏడాది మార్చి 2న అతను తీసిన సినిమా గురించి ప్రస్తావిస్తూ, సినిమాకు అవార్డులు వచ్చాయంటూ బురిడీ కొట్టించారు. అతని నుంచి రూ. 63 వేలు కాజేశారు. దర్శకుడి ఫోన్‌నెంబర్‌తో సహా, అతని సినిమా గురించి  పూర్తి వివరాలు సేకరించిన నిందితుడు ఈజీగా మోసం చేశాడు.

గతంలోనూ..

- మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు.. శ్రీజ భర్త కళ్యాణ్‌దేవ్‌ కూడా సోషల్‌ వేధింపులకు గురయ్యారు. నేరగాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కళ్యాణ్‌ను టార్గెట్‌ చేసి అసభ్యంగా దూషించసాగారు. దాదాపు 10 అకౌంట్ల నుంచి వరసగా వేధింపులు రావడంతో  బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. 


- నాయకురాలు లక్ష్మీపార్వతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోటి అనే వ్యక్తి ఎట్టకేలకు నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఆమె హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌తోపాటు డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అప్పటి నుంచి కోటి కోసం గాలిస్తుండగా, అతను కోర్టులో లొంగిపోయాడు. 


- టాలీవుడ్‌ నటి పూనంకౌర్‌ వ్యక్తిగత సంభాషణలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి హల్‌చల్‌ చేసింది కూడా కోటియే కావడం గమనార్హం. తన ఫోన్‌ నుంచి వ్యక్తిగత డేటా, కాల్‌ రికార్డింగ్‌లు సేకరించి ఆయా  సంభాషణలు, ఫోన్‌ రికార్డింగ్‌లను సోషల్‌మీడియా ద్వారా వైరల్‌ చేశారంటూ ఆమె గతంలో సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కోటి కోర్టులో లొంగిపోవడంతో ఈ రెండు కేసుల చిక్కుముళ్లు వీడాయి. 


- సీఎం కేసీఆర్‌పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై గతంలో వివిధ పోలీ్‌సస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అరెస్టులు కూడా జరిగాయి. కేసీఆర్‌పై సోషల్‌మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ స్కూలు ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌కు గురయ్యాడు. 


- వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్‌‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకి కూడా గతంలో సోషల్‌ వేధింపులు తప్పలేదు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు.

చర్యలు తప్పవు

వెబ్‌సైట్లు, అకౌంట్‌ హ్యాకింగ్‌లకు సంబంధించి కూడా పలువురు రాజకీయ ప్రముఖులు.. సెలబ్రిటీలు గతంలో సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు పలువురు సెలబ్రిటీలను టార్గెట్‌గా చేసి సోషల్‌ మీడియా వేదికగా కొంతమంది వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నప్పటికీ కొంతమంది వీటిని పట్టించుకోవడం లేదనే వాదన కూడా ఉంది. సోషల్‌ వేదికగా ఎవరినైనా వేధిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.