సైబర్‌ నేరస్థుల వల

ABN , First Publish Date - 2020-06-06T09:21:35+05:30 IST

‘పొరపాటున మీకు క్యూఆర్‌ కోడ్‌ రూపంలో డబ్బులు పంపాం.. తిరిగి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి మా డబ్బులు పంపండంటూ’ ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేస్తున్నారా..?

సైబర్‌ నేరస్థుల వల

క్యూఆర్‌ కోడ్‌ చెప్పండని ఫోన్లు

అప్రమత్తంగా ఉండమంటున్న ఎస్పీ 


కర్నూలు, జూన్‌ 5:  ‘పొరపాటున మీకు క్యూఆర్‌ కోడ్‌ రూపంలో డబ్బులు పంపాం.. తిరిగి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి మా డబ్బులు పంపండంటూ’ ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేస్తున్నారా..? అయితే మీరు సైబర్‌ నేరస్థుల బారిన పడేనట్లే. ఈ తరహా మోసాలు ఇటీవల కర్నూలు నగరంలో ఎక్కువయ్యాయి.. మొదట తాము పొరపాటున డబ్బును మీ ఖాతాలో వేశామని, వాటిని తిరిగి పంపమని ఫోన్‌ చేస్తారు. ఆ డబ్బును క్యూఆర్‌ కోడ్‌ రూపంలో పంపాలని సూచిస్తారు. మీరు నిజంగానే డబ్బులు పడ్డాయని ఆ వ్యక్తి పంపిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, మీ అకౌంటు పిన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేస్తారు.. అంతే మీ ఖాతా నుంచి  నగదు మాయమవుతుంది. ఇలా నగరంలోని వన్‌ టౌన్‌కు చెందిన పలువురు వ్యక్తులను సైబర్‌ నేరస్థులు మోసం చేశారు. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

 ఎవరైనా ఫోన్‌ చేసి డబ్బును క్యూఆర్‌ కోడ్‌ రూపంలో పంపామంటే నమ్మకూడదు.  మీ పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే వివరాలు, మీ వ్యక్తిగత వివరాలు, మీకు వచ్చిన ఓటీపీలను ఎవ్వరికీ చెప్పకూడదు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి మీ వివరాలు అడిగినప్పుడు పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలి. 


అప్రమత్తంగా ఉండాలి-ఎస్పీ ఫక్కీరప్ప

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సైబర్‌ నేరస్థులు వివిధ కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. అపరిచిత వ్యక్తుల నుంచి కాల్స్‌ వస్తే స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. సందేహాలు, సమస్యలుంటే పోలీస్‌స్టేషన్‌లో గానీ, సైబర్‌ ల్యాబ్‌ పోలీసులకు గానీ, సైబర్‌ మిత్ర వాట్సాప్‌ నెంబర్‌ 9121211100నుగాని సంప్రదించాలి. 

Updated Date - 2020-06-06T09:21:35+05:30 IST