Abn logo
Feb 27 2021 @ 04:36AM

అన్నింటికీ గూగుల్‌ అనొద్దు

సైబర్‌ నిపుణుల హెచ్చరిక


సమాచారం కావాలన్నా, సందేహం వచ్చినా ఇప్పుడు అందరూ మొదట చూసేది గూగుల్‌నే.

 ప్రతిదానికీ దీనిపై ఆధారపడటం ఎక్కువైంది. అయితే అతిగా గూగుల్‌పై ఆధారపడటం కూడా 

మంచిది కాదంటున్నారు సైబర్‌ నిపుణులు. ఇదే అదునుగా స్కామర్లు తప్పుడు చిరునామాలు, 

వెబ్‌సైట్లతో గోదాలోకి దిగి వినియోగదారులను మోసపుచ్చుతున్నారు. కంటెంట్‌కు మించి 

ఎస్‌ఇఒ నైపుణ్యాలు ఈ విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. వినియోగదారుడు ఏది 

చూడాలో నిర్దేశిస్తున్నారని, అందువల్ల ఎనిమిది విషయాల్లో గూగుల్‌ వినియోగదారులు 

అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హితవు చెబుతున్నారు.  


సర్కార్‌ వెబ్‌సైట్ల కోసం యూఆర్‌ఎల్‌ సరిగా చెక్‌చేయండి: 

బ్యాంకింగ్‌ మాదిరిగానే ప్రభుత్వ వెబ్‌సైట్ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. మున్సిపాలిటీ పన్ను, ఆసుపత్రులు స్కామర్లకు టార్గెట్లు. ఈ వెబ్‌సైట్లలో ఏది ఒరిజినల్‌ అన్నది తెలుసుకోవడం కష్టం. ఈ విషయంలో గూగుల్‌లో సెర్చ్‌కు బదులు నేరుగా ఏదైనా ప్రభుత్వ వెబ్‌సైట్లను సందర్శించి అక్కడి నుంచి కావాల్సిన సైట్లవైపు వెళ్లడం మేలు. 

స్టాక్‌ మార్కెట్‌  సలహాలు వినొద్దు: ఆరోగ్యం మాదిరిగానే పర్సనల్‌ ఫైనాన్స్‌ కూడా ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన విషయం. ఏదో ఒక్క ప్లాన్‌తో ధనవంతులు కావడం అంటూ ఉండదు. అందువల్ల  ఆ సూచనలు పాటించకపోవడమే మంచిది.


ముందు డాక్టర్‌: అనారోగ్యంపాలైతే ముందు డాక్టర్‌ని సంప్రదించండి. ఆరోగ్యానికి సంబంధించి సలహాలు, మందుల విషయంలో గూగుల్‌ సలహాలు వాంఛనీయం కాదు. డాక్టర్‌ను కాదనుకుని వ్యాధి విషయమై గూగుల్‌ సలహా తీసుకోవడం మంచి పని కాదు. గూగుల్‌లో సమాచారం ప్రకారం వ్యాధి విషయంలో తమకుతామే ఎవరైనా ఒక నిర్ణయం తీసుకోవడం, తదనుగుణంగా మందులు ఉపయోగించడం చాలా ప్రమాదకరం. ఆరోగ్యం బాగోనప్పుడు నేరుగా డాక్టర్‌ను సంప్రతించడమే మంచిది. 


ఈ కామర్స్‌ వెబ్‌సైట్లు: ఆఫర్లతో ఈ కామర్స్‌ వెబ్‌సైట్లు కుప్పలుతెప్పలుగా గూగుల్‌ సెర్చ్‌లో లభ్యమవుతాయి. ఇదో క్లాసిక్‌ స్కామ్‌. డీల్స్‌ ఆకర్షణీయంగా ఉంటాయి. దాంతో కీడుకలిగించే వెబ్‌సైట్లు సృష్టించి, బ్యాంకింగ్‌ లాగిన్‌ సమాచారం సేకరిస్తారు. తద్వారా బ్యాంక్‌ అకౌంట్ల నుంచి సొమ్ము  దోచేస్తారు. ఫలితంగా మోసపోవడం వినియోగదారుడి వంతు అవుతుంది.

యాప్‌, సాఫ్ట్‌వేర్‌ సెర్చ్‌ వద్దు: యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌, ఫైల్స్‌ సెర్చ్‌ గూగుల్‌లో వద్దు. ఆఫీషియల్‌ యాప్‌ స్టోర్లు అంటే ఆండ్రాయిడ్‌కు ‘గూగుల్‌ ప్లే’, ఐఫోన్ల కోసం ‘యాప్‌ స్టోర్‌’లో నుంచి తీసుకోవడమే మంచిది. కీడు కలిగించే సాఫ్ట్‌వేర్‌, యాప్‌లతో గూగుల్‌ ఇప్పటికే నిండి ఉందన్న విషయాన్ని గుర్తించండి. 


యూఆర్‌ఎల్‌ చెక్‌: బ్యాంకుల ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వెబ్‌సైట్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. యూఆర్‌ఎల్‌ కచ్చితంగా తెలిస్తే తప్ప వినియోగించకూడదు. ఫేక్‌ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సైట్ల సహాయంతో మీ లాగిన్‌ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అవి తెలుసుకుని తతిమా పని కానిచ్చేస్తుంటారు.

కస్టమర్‌ కేర్‌ నంబర్‌: ఇదే అతి పెద్ద ఆన్‌లైన్‌ స్కామ్‌కు దారితీస్తోంది. మోసగాళ్ళు ముఖ్యంగా ఫేక్‌ బిజినెస్‌ లిస్టింగ్స్‌, కస్టమర్‌ నంబర్లను ఉంచుతారు. అవే కరెక్ట్‌ అనుకుని వినియోగదారులు కాల్‌ చేయడంతో మొదలై చివరకు మోసంగా పరిణమిస్తోంది. చాలా వరకు యాప్‌ల్లో కస్టమర్‌ కేర్‌ ఇన్‌ బిల్ట్‌గా ఉంటుంది. అయితే కాల్‌ చేసేందుకు కాంటాక్ట్‌ నంబర్‌ అంటూ  ఏమీ ఉండదు.  

వెయిట్‌లాస్‌, న్యూట్రిషన్‌ టిప్స్‌ను గుడ్డిగా నమ్మవద్దు: ప్రతి వ్యక్తి శరీరం తీరు ఒక్కోలా ఉంటుంది. అందరకీ అన్నీ నప్పవు. ముఖ్యంగా న్యూట్రిషన్‌ సలహాల కోసం గూగుల్‌ సెర్చ్‌ వద్దు. ఆహారంలో మార్పులకు సంబంధించి డైటీషియన్‌, బరువు తగ్గాలంటే డాక్టర్‌ని సంప్రతించడం మంచిది. 

Advertisement
Advertisement
Advertisement