వాట్సాప్‌లో సైబర్‌ దొంగలు.. లక్షలు కొట్టేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-05-14T13:52:43+05:30 IST

రోజుకో కొత్తరకం మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు మరో కొత్తరకం మోసానికి..

వాట్సాప్‌లో సైబర్‌ దొంగలు.. లక్షలు కొట్టేస్తున్నారు!

  • అమెరికా నంబర్‌లు హ్యాక్‌చేసి..
  • మెడికల్‌ ఎమర్జెన్సీ అంటూ బురిడీ
  • 21 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

హైదరాబాద్‌ సిటీ : రోజుకో కొత్తరకం మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు మరో కొత్తరకం మోసానికి తెరతీశారు. అమెరికాకు చెందిన వాట్సాప్‌ నంబర్‌లు హ్యాక్‌ చేసి, మెడికల్‌ ఎమర్జెన్సీ పేరుతో ఇండియాలోని వారి కుటుంబ సభ్యుల నుంచి రెండు వేర్వరు ఘటనల్లో రూ. 21లక్షలు కొట్టేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలికి చెందిన శ్రీరామ్‌కు అమెరికాలో ఉంటున్న ఆమె కజిన్‌ సుజాత నుంచి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. తనకు మెడికల్‌ ఎమర్జెన్సీ కోసం అర్జంట్‌గా రూ.10లక్షలు కావాలని వాట్సాప్‌ మెసేజ్‌ చేసింది. ఆమె ఇబ్బందిని గుర్తించిన శ్రీరామ్‌ వెంటనే వాట్సాప్‌లో పెట్టిన ఎస్‌బీఐ అకౌంట్‌కు రూ.1.98లక్షలు, హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాకు ఆన్‌లైన్‌ ద్వారా రూ. 9లక్షలు పంపించారు. ఆ తర్వాత ఫోన్‌ చేసి డబ్బులు అందాయా అంటూ తన కజిన్‌కు ఫోన్‌ చేశాడు. దాంతో అమెరికాలో ఉన్న కజిన్‌ చెప్పిన విషయం విని షాకయ్యాడు. తనకు ఎలాంటి ప్రాబ్లమ్‌ లేదని, తాను డబ్బులేమి అడగలేదని చెప్పింది. తన నంబర్‌ ఎవరో హ్యాక్‌ చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. దాంతో బాధితుడు సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కూకట్‌పల్లిలో మరో ఘటన..

కూకట్‌పల్లికి చెందిన నరేంద్రకు ఈనెల 10న అమెరికాలో ఉంటున్న తన స్కూల్‌ ఫ్రెండ్‌ నుంచి వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. తనకు మెడికల్‌ ఎమర్జెన్సీ కోసం అర్జంట్‌గా రూ. 12లక్షలు కావాలని చెప్పాడు. దాంతో తన స్నేహితునిపై నమ్మకంతో నరేంద్ర వెనుకా ముందు ఆలోచించకుండా వెంటనే రూ.10.98లక్షలు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఆ తర్వాత ఫోన్‌ చేసి డబ్బులు అందాయా..? అని అడగంతో అసలు మోసం వెలుగులోకి వచ్చింది. తానెలాంటి సహాయం కోరలేదని, అసలు మెసేజ్‌ చేయలేదని చెప్ప డంతో నిర్ఘాంతపోయాడు. దాంతో బాఽధితుడు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


అమెరికాలో ఉన్న స్నేహితులు, బంధువులు ఎవరైనా మెడికల్‌ ఎమర్జెన్సీ పేరుతో డబ్బులు అడిగితే.. వారితో స్వయంగా మాట్లాడి నిర్ధారించుకున్న తర్వాతనే డబ్బులు పంపాలని  సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. లేదంటే సైబర్‌ నేరగాళ్లకు చిక్కి మీ డబ్బులు పోగొట్టుకుంటారని వారు హెచ్చరించారు. 

Updated Date - 2021-05-14T13:52:43+05:30 IST