లాక్‌డౌన్ మాటున రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు

ABN , First Publish Date - 2020-05-22T01:02:02+05:30 IST

ఓ వైపు కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన వేళ..

లాక్‌డౌన్ మాటున రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు

బెంగళూరు: ఓ వైపు కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన వేళ మరోవైపు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయిన వైనమిది. అన్ని రాష్ట్రాల కంటే కేరళపైనే లాక్‌డౌన్ సమయంలో అత్యధిక సంఖ్యలో సైబర్ దాడులు జరిగినట్టు తాజాగా ఓ అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. ఐటీ సెక్యురిటీ సొల్యూషన్స్ సేవలు అందించే కే7 కంప్యూటింగ్ సంస్థ ఈ వ్యవహారంపై విశ్లేషణ జరిపి నివేదిక వెలువరించింది. ప్రత్యేకించి ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ నటులను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు... వినియోగదారులకు వారిపై గల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొవిడ్-19 పేరుతో బెదిరింపులకు దిగినట్టు తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య ఒక్కసారిగా ఈ సైబర్ దాడులు పెరగడం చూస్తే... కరోనా వైరస్‌పై ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భయాన్ని వాడుకుని వ్యక్తులు, కార్పొరేట్ స్థాయిలో మోసగాళ్లు ఏ మేరకు దోపిడి పర్వానికి దిగారో అర్థం చేసుకోవచ్చునని కే7 కంప్యూటింగ్ సంస్థ పేర్కొంది. 


కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలో చొరబడి వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, క్రిప్టోకరెన్సీ ఖాతాల వివరాలను తస్కరించడం కోసం ఈ సైబర్ దాడులు జరిగినట్టు వెల్లడైంది. కొవిడ్-19 సంబంధిత యాప్‌ల ముసుగులో యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే దొంగ యాప్‌లు మొదలు... ఫిషింగ్ దాడుల వరకు లాక్‌డౌన్ సమయంలో ఎక్కువైనట్టు సదరు కంపెనీ వెల్లడించింది. అత్యధికంగా కేరళలో 2 వేలకు పైగా సైబర్ దాడులు చోటుచేసుకోగా...పంజాబ్ 207, తమిళనాడు 184 చొప్పున సైబర్ దాడులు జరిగాయి. మెట్రో నగరాల్లో కంటే టైర్-2, టైర్-3 పట్టణాల్లోనే ఈ దాడులు ఎక్కువగా జరగడం గమనార్హం. చిన్న చిన్న పట్టణాల్లో 10 వేల మంది యూజర్లకు గానూ 250 మంది సైబర్ దాడుల బారిన పడ్డారు. బెంగళూరు యూజర్లతో పోల్చితే ఘజియాబాద్, లక్నో తదితర నగరాల్లో ఇవి దాదాపు ఆరు నుంచి నాలుగు రెట్టు అధికంగా ఉన్నాయి. 

Updated Date - 2020-05-22T01:02:02+05:30 IST