Abn logo
Sep 24 2021 @ 11:07AM

బిట్‌కాయిన్‌ పేరుతో రూ.12 లక్షలకు టోకరా

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌: బిట్‌ కాయిన్‌ పేరుతో పెద్ద ఎత్తున వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియేట్‌ చేసి మోసాలకు పాల్పడుతు న్న సైబర్‌ కేటుగాళ్లు తాజాగా  మరొకరిని ట్రాప్‌ చేసి రూ. 12 లక్షలకు పైగా కాజేశారు. సిటీ సైబర్‌ క్రైం ఏసీపీ కె.వి ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం... హబ్సిగూడకు చెందిన వెంకట్‌కు నెల రోజుల క్రితం ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. బిట్‌ కాయిన్‌ పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడుతున్నాయని, మీకు ఇంట్రెస్ట్‌ ఉంటే నేరుగా మొబైల్‌ యాప్‌ ద్వారా ట్రేడింగ్‌ చేయవచ్చని అవతలి వ్యక్తి చెప్పాడు. లాభాలు యాప్‌లోనే కనిపిస్తాయని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన వెంకట్‌ ట్రేడింగ్‌కు సిద్ధమయ్యాడు. దీంతో అతడి మొబైల్‌కి సైబర్‌ నేరగాళ్లు ఒక లింకు పంపించారు. దానిని క్లిక్‌ చేయడంతో కాయిన్‌ ఎఫ్‌ యు పేరుతో ఉన్న యాప్‌ కనిపించింది.  దాన్ని డౌన్లోడ్‌ చేసిన వెంకట్‌ ముందుగా రూ. 10వేలు పెట్టుబడి పెట్టాడు. ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో మరో 10 వేలు డిపాజిట్‌ చేశాడు. ఇలా పలుమార్లు మొత్తం లక్ష డిపాజిట్‌ చేసినప్పటికీ ట్రేడింగ్‌ వివరాలు కనిపించలేదు.


దీంతో ట్రేడింగ్‌ నిలిపివేశాడు. వారం రోజుల తర్వాత ఓ యువతి వెంకట్‌కు కాల్‌ చేసి ‘మీరు ట్రేడింగ్‌ కొనసాగించండి. మీ డబ్బు ఎక్కడికీ పోలేదు. మరికొంత  పెట్టుబడి పెట్టి యాప్‌ యాక్టివేట్‌ చేసుకోవాలి’ అని నమ్మించింది. దీంతో అతను మరో నాలుగున్నర లక్షలు డిపాజిట్‌  చేశాడు.  రెండు రోజుల వ్యవధిలోనే అవి రెట్టింపు అయినట్టుగా యాప్‌లో కనిపించింది. మరోసారి యువతి కాల్‌ చేసి రూ.10 లక్షలకు పైగా పెట్టుబడి పెడితే  భారీగా లాభాలు వస్తాయని, లాభాల్లో 50 శాతం వాటా ఇవ్వాలని కండీషన్‌ పెట్టింది. అందుకు వెంకట్‌ అంగీకరించి ఆమె చెప్పినట్లే మరో ఆరున్నర లక్షలు డిపాజిట్‌ చేశాడు.  రెండు రోజుల తర్వాత మొత్తం రూ. 60 లక్షలు లాభం వచ్చినట్టుగా యాప్‌లో చూపించింది. అనంతరం వెంకట్‌కు మళ్లీ ఫోన్‌ చేసిన యువతి తన 50 శాతం వాటా రూ. 30 లక్షలు ఇవ్వాలని, అవి పంపాకే వెంకట్‌ రావాల్సిన రూ. 60 లక్షలు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. అందుకు వెంకట్‌ ససేమిరా అనడంతో  కాల్‌ కట్‌ చేసిన యువతి తర్వాత నంబర్‌ బ్లాక్‌ చేసింది. మోసపోయానని గ్రహించిన వెంకట్‌ సిటీ  సైబర్‌ క్రైం స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశాడు.