మోసం జరిగిన నిమిషాల్లోనే.. సైబర్‌ కేడీలకు బేడీలు

ABN , First Publish Date - 2021-06-16T06:46:23+05:30 IST

సైబర్‌ మోసాల్లో ఒక్కసారి బాధితులు డబ్బులు పోగొట్టుకుంటే.. తలకిందులు తపస్సు చేసినా, అవి తిరిగిరావని పోలీసులే చెబుతుంటారు. అందుక్కారణం.. తాను మోసపోయినట్లు బాధితుడు తెలుసుకుని, పోలీసులకు ఫిర్యాదుచేసి, వారు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించేసరికి

మోసం జరిగిన నిమిషాల్లోనే.. సైబర్‌ కేడీలకు బేడీలు

‘సైబర్‌సేఫ్‌’లో ఫిర్యాదుతో సత్వర స్పందన

నిందితుల ఆచూకీ వెంటనే గుర్తింపు

పలు రాష్ట్రాలకు సైబర్‌సెల్‌ అలెర్ట్‌

మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌లో అరెస్టులు

8 మంది పట్టివేత, 300 ఫోన్లు సీజ్‌

నిందితుల్లో ఇద్దరు ఏపీకి చెందినవారు

వెయ్యికిపైగా బ్యాంకు ఖాతాలు.. 100 ఫ్రీజ్‌


న్యూఢిల్లీ, జూన్‌ 15: సైబర్‌ మోసాల్లో ఒక్కసారి బాధితులు డబ్బులు పోగొట్టుకుంటే.. తలకిందులు తపస్సు చేసినా, అవి తిరిగిరావని పోలీసులే చెబుతుంటారు. అందుక్కారణం.. తాను మోసపోయినట్లు బాధితుడు తెలుసుకుని, పోలీసులకు ఫిర్యాదుచేసి, వారు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించేసరికి పుణ్యకాలం దాటిపోతుంది. నేరగాళ్లు సిమ్‌కార్డుల్ని, అడ్డాలను మార్చేసి, మరో నేరానికి సిద్ధమవుతుంటారు. కానీ, కేంద్ర హోంశాఖ 2019లో ప్రారంభించిన సైబర్‌సేఫ్‌ యాప్‌లో ఈ నెల 11న ఓ బాధితుడు ఫిర్యాదు చేసిన నిమిషాల వ్యవధిలో పోలీసులు వేర్వేరు రాష్ట్రాల్లోని నిందితులను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 11న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన 78 ఏళ్ల ఓ వ్యక్తికి సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. ఓటీపీ మోసంతో అతని క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 6.5 లక్షలు విలువ చేసే 33 షామీ స్మార్ట్‌ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేశారు.


మోసాన్ని గుర్తించిన బాధితుడు.. వెంటనే ‘సైబర్‌సేఫ్‌’ యాప్‌లో ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని సైబర్‌సేఫ్టీ వింగ్‌(ఎ్‌ఫసీవోఆర్డీ) రంగంలోకి దిగి, బాధితుడి నుంచి వివరాలు సేకరించింది. అతనికి ఫోన్‌ చేసిన వ్యక్తి ఝార్ఖండ్‌లో ఉన్నట్లు క్షణాల్లో గుర్తించింది. టవర్‌లొకేషన్‌ ఆధారంగా నిందితుడి వివరాలను స్థానిక పోలీసులకు పంపింది. వారు వెంటనే అప్రమత్తమై.. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. క్రెడిట్‌కార్డు ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన 33 ఫోన్లకు సంబంధించిన డెలివరీ అడ్రస్‌ మధ్యప్రదేశ్‌లోని బలాఘాట్‌లో ఉండడంతో.. ఎఫ్‌సీవోఆర్డీ ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు మరో నలుగురికి బేడీలు వేశారు. వీరిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. తదుపరి దర్యాప్తులో.. ఈ ముఠాలో మొత్తం 350 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరంతా 18 రాష్ట్రాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. ఈ ముఠా ఓటీపీ, క్రెడిట్‌కార్డు, ఈకామర్స్‌, ఫేక్‌ఐడీ, ఫేక్‌ మొబైల్‌ నంబర్‌ వంటి మోసాలకు, మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు.


ఇందుకోసం ఈ ముఠా వెయ్యికి పైగా బ్యాంకు ఖాతాలను తెరిచిందని, వెయ్యి మొబైల్‌ ఫోన్లను వినియోగిస్తోందని, వందల కొద్దీ యూపీఐ ఐడీలను నిర్వహిస్తోందని నిగ్గుతేల్చారు. 300 ఫోన్లను సీజ్‌ చేసి, 100 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు. బాధితుడు వెంటనే ఫిర్యాదు చేయడంతో.. నిందితుల అరెస్టు సాధ్యమైందని కేంద్ర హోం శాఖ తెలిపింది. సైబర్‌సేఫ్‌ యాప్‌, పోర్టల్‌ ద్వారా రెండేళ్లలో 65 వేల ఫిర్యాదులు అందగా.. 55 వేల కేసులను పరిష్కరించినట్లు వెల్లడించింది.

Updated Date - 2021-06-16T06:46:23+05:30 IST