వెన్ను ‘వరి’గి..

ABN , First Publish Date - 2020-12-04T06:41:49+05:30 IST

‘నివర్‌’ అన్నదాత వెన్ను విరిచేసింది.

వెన్ను ‘వరి’గి..
బందరు మండలం పెదపట్నంలో పంట పొలంలో దమ్ము చేస్తున్న రైతు

అన్నదాతకు అన్నీ కష్టాలే

పంట పొలాల్లో దుఃఖ చారికలు

ధాన్యం కంకులకు మొలక

కౌలు రైతులకు మొండిచేయి

కోత కోయకుండానే దమ్ము చేస్తున్న రైతు

ఆంధ్రజ్యోతి ‘పొలంబాట’లో వెలుగు చూసిన కన్నీటి గాథలు

మినుము మళ్లీ విత్తాల్సిందే


‘నివర్‌’ అన్నదాత వెన్ను విరిచేసింది. ఆరుగాలం శ్రమ ఫలితంపై పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లింది. నిన్నటి వరకు కంకుల భారంతో తలలూపుతూ రైతుల్లో ఆశలు నింపిన వరి పైరు  నేడు తుఫాను దెబ్బకు తలవాల్చింది. నేలవాలిన పంట నీటిలో తేలియాడుతుంటే, అప్పు చేసి పెట్టిన వేలాది రూపాయల పెట్టుబడి కళ్లలో మెదులుతుంటే.. చేసిన అప్పును తీర్చేదెలాగో తెలియక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మరోపక్క పంట బీమా, నష్ట పరిహారం అందుతుందో లేదోననే సందేహం కౌలు రైతులను వేధిస్తోంది. భూమి యజమానికి చెల్లించాల్సిన కౌలు కలవరపెడుతోంది. ఇన్ని కష్టాల మధ్య వరి కంకుల్లో నుంచి మొలకలొస్తుంటే దిక్కుతోచని కొందరు రైతులు దుఃఖాన్ని దిగమింగి.. దమ్ము చక్రాలతో తొక్కించేస్తున్నారు. గురువారం తూర్పు కృష్ణాలోని 23 మండలాల్లో ‘పొలంబాట’ పట్టిన ఆంధ్రజ్యోతి బృందానికి ఏ దిక్కుకు వెళ్లినా.. కనిపించిన దృశ్యాలివే. అంతటా రైతుల దుఃఖ చారికలే.. 

- ఆంద్రజ్యోతి, మచిలీపట్నం / చల్లపల్లి / అవనిగడ్డటౌన్‌


వరి కుళ్లిపోతోంది.. మినుము చచ్చిపోయింది

కుందేటి కోటేశ్వరరావు (కోటయ్య), చల్లపల్లి మండలం పాగోలులో ఎకరం 20 బస్తాల చొప్పున 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. 1061 రకం వంగడాన్ని సాగు చేశారు. తుఫాను హెచ్చరికలతో ఎకరానికి రూ.9వేలు ఇచ్చి కోత కోయించారు. ఎకరానికి రూ.31వేలు ఖర్చు చేశారు. కోతకు ముందు రెండు వేలు చొప్పున వెచ్చించి, మినుము విత్తనం చల్లారు. కోతకోసిన రెండు, మూడు రోజులకు భారీ వర్షాలు కురవడంతో వరి నీటిలోనే ఉండిపోయింది. వరికంకులకు మొలకలొచ్చాయి. మినుము మొక్కలు పూర్తిగా చచ్చిపోయాయి. ఎకరానికి రూ.1500 చొప్పున ఇచ్చి ఓదెలను ఆరబెట్టిస్తున్నారు. కట్టివేతకు కూలీలు ఎకరానికి రూ.5వేలు అడుగుతున్నారని తెలిపారు. కౌలు రైతు గుర్తింపు కార్డు ఉన్నా, పంట బీమా, నష్ట పరిహారం కోసం వ్యవసాయశాఖ అధికారులు భూమి యజమాని పేరునే చేర్చారని కోటయ్య తెలిపారు. వాస్తవంగా నష్టపోయింది కౌలు రైతేనని, పరిహారం,  బీమా, కౌలు రైతుకే వచ్చేలా చేయాలని ఆయన  ప్రభుత్వాన్ని కోరారు. 


జీవనాధారానికి దెబ్బ

కమ్మెల నాగరాజు.. చల్లపల్లి మండలం పాతమాజేరు నివాసి. వ్యవసాయమే జీవనాధారం. ఎకరానికి 16 బస్తాల చొప్పున ఐదెకరాలను కౌలుకు తీసుకుని బీపీటీ 5204 రకం వంగడం సాగు చేశాడు. ఏటా అధిక దిగుబడులు సాధించే నాగరాజు ఈ ఏడాది మరింత దిగుబడి సాధిస్తాననే నమ్మకంతోనే ఉన్నాడు. కానీ నివర్‌ తుఫాను రూపంలో వచ్చిన భారీవర్షం నాగరాజు ఆశలపై నీళ్లు కుమ్మరించింది. వర్షాల తాకిడికి పంట నేలవాలింది. కంకులు మొలకెత్తుతున్నాయి.  ఎకరానికి 38 బస్తాలకు తక్కువ రావన్నది నిన్నటి వరకూ అంచనా. ఇప్పుడు 15బస్తాలు కూడా దక్కవని నాగరాజు వాపోతున్నాడు. పెట్టుబడికి తెచ్చిన అప్పులు, చెల్లించాల్సిన కౌలు ఈ రైతును కలవరపెడుతున్నాయి.


రెండెకరాల్లో దమ్ము చేసేశారు

బందరు మండలం పెదపట్నంకు చెందిన పసుపులేటి నాగరాజు రెండెకరాల భూమిలో బీపీటీ 5204 వంగడాన్ని సాగు చేశారు. వర్షాలకు పంట నేలవాలి, మొలక వచ్చింది. ఖర్చులు కూడా రావని గురువారం పొలాన్ని ట్రాక్టరుతో దమ్ముచేయించారు. కంకులకు పూర్తిగా మొలక రావడంతో గత్యంతరం లేక ఈ పని చేయాల్సి వచ్చిందని రైతు నాగరాజు వాపోయారు.   


గడ్డి కోసమైనా కోత కోయిస్తా


ఈ రైతు పేరు కళ్లేపల్లి పోతురాజు. బందరు మండలం ఆర్‌గొల్ల పాలెం నివాసి. గూడూరు మండలం మల్లవోలు రెవెన్యూ గ్రామ పరిధిలో రెండెకరాల భూమి ఉంది. దీనిలో 1121 రకం వంగడం సాగు చేశారు. ఇందులో ఎకరం భూమి కూతురికి పసుపు కుంకుమగా ఇచ్చారు.  రెండెకరాల్లో పంట నేలవాలి మొలకొచ్చింది. స్థానిక వ్యాపారి వద్ద అప్పు చేసి వ్యవసాయం చేశానని, కంకులకు మొలకొచ్చినందున ఎంత దిగుబడి వస్తుందో తెలియదని, అయినా పశువులకు మేత కోసమైన కోత కోయిస్తానన్నారు. అల్లుడికి కౌలు చెల్లించాలని, పంట మొత్తం దెబ్బ తినడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు.


కౌలు రైతులను ప్రభుత్వం నేరుగా ఆదుకోవాలి

చల్లపల్లి ప్రాంతంలోని ఆయకట్టులో సగానికి పైగా కౌలు రైతులే. వారిలో ఒక్కరికీ గుర్తింపు కార్డు లేదు. వారిలో ఒక కౌలు రైతు రామాంజనేయులును పలకరించినపుడు కౌలు రైతుల కష్టాలను ఏకరువు పెట్టారు. తమను ప్రభుత్వమే నేరుగా ఆదుకోవాలన్నారు. ఎకరానికి 24 బస్తాల చొప్పున చెల్లించేలా రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్నానని, మొత్తం రూ. 75 వేలు ఖర్చు పెట్టానని చెప్పారు. వర్షానికి పడిపోయిన పైరు కుళ్లిపోతూ ఉండటంతో గత్యంతరం లేక కోసేస్తున్నానని చెప్పారు. కౌలు చేస్తున్నామని చెప్పినా, అధికారులు తమ పేర్లు నమోదు చేసుకోవటం లేదని, ప్రభుత్వం నేరుగా కౌలురైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు..


పది బస్తాలు కూడా రావు 

ఇక్కడే చల్లపల్లికి చెందిన మరో రైతు చెన్నకేశవ తన పొలంలో 30 బస్తాల దిగుబడి వస్తుందనుకుంటే 10 బస్తాలు కూడా ఇంటికి చేరేలా లేదని వాపోతున్నారు. కోతకు డబ్బు కావాలని,  చేసిన అప్పు భయపెడుతోందని, ప్రభుత్వం కౌలు రైతుల గురించి ఆలోచిస్తున్నట్లే కనిపించటం లేదని వాపోయారు. 


కౌలు రైతులేమైపోవాలి?

అవనిగడ్డ నియోజకవర్గం మర్రిపాలెంకు చెందిన సనకా సురేష్‌ కూడా కౌలు రైతే. కానీ గుర్తింపు కార్డులు లేవు. ప్రభుత్వం గుర్తింపు  కార్డులు లేవనే వంకతో సాయం చేయకుంటే మాలాంటి వారు ఏమైపోవాలని ఆందోళనతో ప్రశ్నించారు. ప్రభుత్వం మానవతా ధృక్పథంతో స్పందించి గ్రామాల వారీగా లెక్కలు తీసి, కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు.



Updated Date - 2020-12-04T06:41:49+05:30 IST