ఆశలపై నీళ్లు

ABN , First Publish Date - 2020-11-28T06:35:39+05:30 IST

రైతుల ఆశలపై నివర్‌ నీళ్లు కుమ్మరించింది.

ఆశలపై నీళ్లు
గుడ్లవల్లేరులో నీటమునిగిన వరిపనలు

94,116 హెక్టార్లలో పంటలకు తీరని న ష్టం

నీటిలో తేలియాడుతున్న పంటలు 

అవనిగడ్డలో అత్యధికంగా 155.2 మిల్లీ మీటర్ల వర్షపాతం

జిల్లా సగటు వర్షపాతం 73.8 మిల్లీ మీటర్ల

సకాలంలో ఆదుకోవాలని రైతుల వేడుకోలు

నేడూ వర్షం కురిసే అవకాశం  

 

రైతుల ఆశలపై నివర్‌ నీళ్లు కుమ్మరించింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపుగా పెరిగి, కొతకు సిద్ధంగా ఉన్న పైరు నేల వాలింది. ఆరుగాలం శ్రమ నీటిపాలుకావడంతో రైతులు దిక్కుతోచక కంటతడిపెడుతున్నారు. ఈ వర్షాలకు జిల్లాలో 523 గ్రామాల్లో 94.116 హెక్టార్లలో వరి, వేరుశెనగ, మినుము, పత్తి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపారు.    


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. నివర్‌ తుఫాన్‌ రూపంలో వచ్చిన విపత్తుతో జిల్లా రైతులు కుదేలయ్యారు. భారీ వర్షాల తాకిడికి పైరు మొత్తం నేలపై వాలిపోగా, దానిపై నుంచి వర్షపునీరు ప్రవహిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే దశలో నీటి పాలయిందని రైతులు  కంటతడి పెడుతున్నారు. శనివారం కూడా కోస్తాతీరం వెంబడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో పంట చేతికి రాదనే భయం రైతులను వెంటాడుతోంది. 


94,116 హెక్టార్లలో పంటలకు నష్టం 

నివర్‌ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో 46 మండలాల్లోని, 523 గ్రామాల్లో 94.116 హెక్టార్లలో వరి, వేరుశెనగ, మినుము, పత్తి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు శుక్రవారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపారు. వ్యవసాయశాఖ అధికారులు పలు మండలాల్లో నీటమునిగిన పంటపొలాలను శుక్రవారం పరిశీలించారు. వర్షాలు తగ్గనందున పంట నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉంది.   మచిలీపట్నం, చల్లపల్లి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, బంటుమిల్లి, గూడూరు, ఘంటసాల, కంచికచర్ల, గన్నవరం, కైకలూరు, గుడివాడ, పామర్రు, పెదపారుపూడి, విజయవాడ రూరల్‌, తోట్లవల్లూరు తదితర మండలాల్లో వరి, పత్తి ఇతర పంటలు నీట మునిగినట్టు అధికారులు  గుర్తించారు. కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట  రెండు, మూడు రోజులకంటే అధికంగా  నీటిలో ఉంటే కంకులకు మొలకలొస్తాయని రైతులు అంటున్నారు. అదే జరిగితే కోసినా ఫలితం ఉండదంటున్నారు. 


జిల్లా సగటు వర్షపాతం 73.8 మిల్లీ మీటర్లు

జిల్లాలోని ఆయా మండలాల్లో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా సగటు వర్షపాతం 73.8 మిల్లీ మీటర్లుగా నమోదైంది. అవనిగడ్డలో అత్యధికంగా 155.2మిల్లీ మీటర్లు, అత్యల్పంగా జగ్గయ్యపేటలో 23.2మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.  ఘంటసాలలో 153.0, నాగాయలంకలో 113.6, బంటుమిల్లిలో 112.4, చల్లపల్లిలో 110.8, గుడివాడలో 107.8, మండవల్లిలో 104.4, పెదపారుపూడిలో 100.4, మోపిదేవిలో 100, ముదినేపల్లిలో 98.2, గుడ్లవల్లేరులో 95.8, పెడనలో 95.2,  మొవ్వలో 93.0,  బాపులపాడులో 93.4, మచిలీపట్నంలో 87.2, పామర్రులో 87.2, కైకలూరులో 86.6, కృత్తివెన్నులో 86.0, గూడూరులో 85.0, విజయవాడ రూరల్‌, అర్బన్‌ ప్రాంతాల్లో 83.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉయ్యూరులో 83.8, కోడూరులో 81.8, నందివాడలో 81.4, పెనమలూరులో 78.8,  కంకిపాడులో 71.2, ఉంగుటూరులో 69.2, కలిదిండిలో, గన్నవరంలో 67.8, జి-కొండూరులో 65.6, ఆగిరిపల్లిలో 62.4, ఇబ్రహీంపట్నంలో 55.6, ముసునూరులో 55.6, పమిడిముక్కలలో 54.6, నూజివీడులో 54.2, తిరువూరులో 51.4, గంపలగూడెంలో 49.6, విస్సన్నపేటలో 48.6, మైలవరంలో 48.2, చాట్రాయిలో 45.0, నందిగామలో 38.2, పెనుగంచిప్రోలులో 38.2, కంచికచర్లలో 36.6, తోట్లవల్లూరులో 35.6, వీరులపాడులో 33.2, చందర్లపాడులో 30.6,  వత్సవాయిలో 30.6 మిల్లీమీటర్ల వర్షపాతం  నమోదైంది. 


రైతులను ఆదుకుంటారా?

భారీ వర్షాల కారణంగా పంటలను కోల్పోయి, తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునే ందుకు ప్రభుత్వం ఎంతవరకు ముందుకు వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. పంట బీమా, నష్టపరిహారం వచ్చేలా చేస్తే కొంతవరకు కోలుకునే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.  వర్షాలు తగ్గిన అనంతరం దెబ్బతిన్న పంట వివరాలను నమోదు చేయాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-11-28T06:35:39+05:30 IST