Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 25 2021 @ 20:09PM

విరుచుకుపడనున్న ‘గులాబ్’ తుపాను.. ఒడిశా, ఏపీకి హెచ్చరిక

న్యూఢిల్లీ: గులాబ్ తుపాను రేపు (ఆదివారం) సాయంత్రం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలను తాకనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని అధికారులు తెలిపారు. రాగల 12 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని పేర్కొన్నారు. అనంతరం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా-విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం వద్ద ఆదివారం సాయంత్రం తీరం దాటుతుందని వివరించారు. 

 

 స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (ఎస్ఆర్‌సీ) పీకే జెనా మాట్లాడుతూ.. ఏడు జిల్లాలు-గంజాం, గజపతి, కోరాపుట్, రాయగడ, నవరంగపూర్, కంధమాల్, మల్కనగిరి జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్టు చెప్పారు. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తుపానును ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. అలాగే, రుషికుళ్య, వంశధార, నాగవళి నదులు పొంగి ప్రవహించే వీలుందని పేర్కొన్నారు. 


తుపాను తీరం దాటే సమయంలో గంటలకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఈ వేగం 90 కిలోమీటర్లు కూడా దాటే అవకాశం ఉందని జెనా వివరించారు. మరోవైపు, తుపాను నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను హెచ్చరికలు ఉన్న ఏడు జిల్లాల్లో 42 ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఓడీఆర్ఏఎఫ్) బృందాలను, 24 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు (ఎన్‌డీఆర్ఎఫ్)లను మోహరించనున్నారు. వీటికి అదనంగా 102 ఒడిశా అగ్నిమాపక బృందాలను కూడా మోహరించనున్నారు. జాలర్లు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లినవారు నేడు తీరానికి చేరుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement