ఉగ్ర నివర్‌

ABN , First Publish Date - 2020-11-26T08:41:40+05:30 IST

‘నివర్‌’ బుధవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా, మధ్యాహ్నానికి మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారింది. మహాబలిపురం(తమిళనాడు)-కరైకల్‌(పుదుచ్చేరి) మధ్య తీరం దాటే ప్రక్రియ బుధవారం రాత్రి సుమారు 11 గంటలకు ప్రారంభమైనట్టు వాతావరణ అధికారులు తెలిపారు. గురువారం తెల్లవారుజాములోపే తీరం దాటే ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు

ఉగ్ర నివర్‌

అతి తీవ్ర తుఫానుగా మార్పు

తమిళనాడు గజగజ

నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోత.. కడప, ప్రకాశం, కర్నూలుల్లోనూ భారీ వర్షాలు

ఈదురుగాలులకు కూలిన వృక్షాలు

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

పలుచోట్ల నీట మునిగిన పొలాలు

చిక్కుకుపోయిన 29 మంది జాలర్లు

నేడు..రేపు అతి భారీ వర్షాలు

ఓడరేవుల్లో 2, 3 ప్రమాద హెచ్చరికలు


‘నివర్‌’ మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారింది. తమిళనాడును అల్లకల్లోలం చేయడంతో పాటు రాష్ట్రంలోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తీరం వెంబడి పెను గాలులు వీస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల చెట్లు కూలడంతోపాటు, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

‘నివర్‌’ బుధవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా, మధ్యాహ్నానికి మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారింది. మహాబలిపురం(తమిళనాడు)-కరైకల్‌(పుదుచ్చేరి) మధ్య తీరం దాటే ప్రక్రియ బుధవారం రాత్రి సుమారు 11 గంటలకు ప్రారంభమైనట్టు వాతావరణ అధికారులు తెలిపారు. గురువారం తెల్లవారుజాములోపే తీరం దాటే ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు.


తీరం దాటే సమయంలో ఆ ప్రాంతంలో గంటకు 120-130 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపారు. కోస్తాంధ్ర తీరప్రాంతంలో గంటకు 65-85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల శాఖ తెలిపింది. అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కాగా, నెల్లూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి చలిగాలులు వీస్తున్నాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయేలా ఈదురు గాలులు వీచాయి. రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. ఈదురుగాలులకు భారీ వృక్షాలు కూలిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో 59.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 29 మంది మత్స్యకారులు తడ మండలం తెట్టుపేట దీవిలో ఇరుక్కుపోయారు. అలలు ఉధృతంగా ఉండటం, బలమైన గాలుల వల్ల వారిని రక్షించేందుకు బోట్లలో వెళ్లడం రెస్క్యూ సిబ్బందికి కష్టంగా మారింది. వీరిలో 20 మంది ఏపీకి చెందిన వారు, 9 మంది తమిళనాడువాసులు ఉన్నారు. తీర గ్రామాల్లోని  2 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.


పలు వాగులు పొంగడంతో రోడ్లపై నీరు పారుతోంది. సోమశిల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 19,500 క్యూసెక్కులకు పెరగడంతో గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. వంద మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నెల్లూరుకు చేరుకున్నాయి. కృష్ణపట్నం పోర్టులో చెన్నైకు చెందిన 124 పడవలు లంగరు వేశాయి. ప్రజలంతా అప్రమత్తంగా  ఇళ్లలోనే ఉండాలని నెల్లూరు కలెక్టర్‌ చక్రధర్‌బాబు కోరారు. మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. చిత్తూరు జిల్లా అంతటా ఉదయం నుంచీ జల్లులు కురిశాయి. ఉష్ణోగ్రత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించారు. తిరుమలలో వేకువజాము నుంచి జల్లులు పడుతూనే ఉన్నాయి.  ఘాట్‌రోడ్లలో కొండ చరియలు విరిగిపడే ప్రదేశాల్లో అధికారులు నిఘా పెట్టారు. కొండపై చలితీవ్రత పెరిగింది. పొగమంచు భారీగా కప్పేసింది. అనంతపురం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో చెదురుమదురు జల్లులు పడ్డాయి.  3రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విపత్తుల శాఖ కమిషనర్‌ కన్నబాబు సూచించారు. నెల్లూరులో 134, విడవలూరు 106, పొదలకూరు 100, తడ 87, ముత్తుకూరు 87 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 


రైతుల్లో ఆందోళన

అతి తీవ్ర తుఫానుతో వరి, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, చిరుధాన్యాలు, కంది, మినుము, పెసర, జూట్‌, అరటి, టమోట, ఉల్లి, చీనీ పంటలు పాడవుతాయని ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరిల్లోనూ తుఫాన్‌ ప్రభావం చూపుతుందన్న హెచ్చరికలతో ఆ జిల్లాల్లోనూ వరి, పత్తి, మిర్చి, అపరాల పంటలతోపాటు చేపలు, రొయ్యల పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. పంట కోసిన రైతులు నానా హైరానా పడి ఇళ్లకు, గిడ్డంగులకు చేరుస్తున్నారు.  


తమిళనాడు, పుదుచ్చేరిల్లో రెడ్‌ అలర్ట్‌

తమిళనాడులోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  పలుచోట్ల చెట్లు కూలిపోవడం,  పలు రహదారులపై నీరు నిలవడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. రాజధాని చెన్నైలో జనజీవనం స్తంభించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వచ్చే 24 గంటల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిల్లో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. లక్షమందికిపైగా ప్రత్యేక శిబిరాలకు తరలించారు. చెన్నై సహా 16 జిల్లాలకు ప్రభుత్వం గురువారం సెలవు ప్రకటించింది. చెన్నై విమానాశ్రయం నుంచి 24 సర్వీసులను రద్దు చేశారు. చెన్నైకి వచ్చే 14 సర్వీసులూ రద్దయ్యాయి.  కడలూరు, కారైక్కాల్‌ తీర ప్రాంతాల్లో అలలు 4-6 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి.  పుుదుచ్చేరిలో ప్రజలు ఇళ్లలోనే  ఉండేందుకు మంగళవారం రాత్రి నుంచి 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. కరైకల్‌ ప్రాంతంలో సముద్రంలోకి వెళ్లిన 100 బోట్లలో ఇంకా పది తిరిగి రాలేదు. వాటిలో ఉన్న 60 మంది జాలర్లు ఉన్నారు.


29న మరో అల్పపీడనం

కాగా, ఈ నెల 29న  దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల మీదుగా  అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చలి గాలులు ఉధృతమయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. తిరుపతిలో  పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.5సెంటీమీటర్ల తక్కువ నమోదైంది.  


రంగంలోకి సహాయ బృందాలు..

నెల్లూరు, చిత్తూరు ప్రకాశం జిల్లాలకు 179 మందితో కూడిన 5ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 85మందితో 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తులశాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. ఇల్లు సురక్షితంగా లేకపోతే, ఇతర సురక్షిత నివాసాలకు చేరుకోవాలని, దెబ్బతిన్న,పురాతన భవనాల్లోకి వెళ్లొద్దని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను టీవీలు, రేడియోలు, ఫోన్ల ద్వారా గమనిస్తూ ఉండాలన్నారు. కాల్‌ సెంటర్లకు ఫోన్‌ చేసి, పునరావాస కేంద్రాల గురించి తెలుసుకోవాలని కోరారు.  


చిత్తూరు, నెల్లూరుకు పెనుముప్పు..

బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజా బులెటిన్‌లో తెలిపింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలను రెడ్‌ మార్క్‌, ప్రకాశం, కడప జిల్లాలకు థిక్‌ ఎల్లో మార్క్‌, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాలకు లైట్‌ ఎల్లో మార్క్‌ పెట్టింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కర్నూలు, కడప, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.  విజయనగరం, విశాఖ, గోదావరి, కృష్ణా, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ప్రకాశం జిల్లాలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 50-60కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.  మచిలీపట్నం, నిజాంపట్నం కృష్ణపట్నంలలో 3వ నంబరు, మిగతా ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద సూచిక ఎగురవేశారు.

Updated Date - 2020-11-26T08:41:40+05:30 IST