Abn logo
Nov 28 2020 @ 02:05AM

నగరంపై ని‘వార్‌’

హౌస్‌ఫర్‌ ఆల్‌ అపార్ట్‌మెంట్ల సమీపంలోకి చేరుకున్న పెన్నా వరద

శివార్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం

కొనసాగుతున్న సహాయక చర్యలు


నెల్లూరు (సిటీ), నవంబరు 27 : నివర్‌ తుఫాన్‌ ప్రభావం నెల్లూరు నగరంపై తీవ్రంగానే ఉంది. తుఫాన్‌ తీరందాటి రెండు రోజులైనా వర్షం మాత్రం కురుస్తూనే ఉంది. శుక్రవారం కూడా రోజంతా విడతలవారీగా వర్షం కురవడంతో ప్రజలకు అవస్థలు తప్పలేదు. ప్రధాన రహదారులు, ఖాళీ స్థలాలు నీటితో నిండిపోయాయి. ఆగని వానకుతోడు పెన్నా వరద ఉధృతికి నగర శివారు ప్రాంతాలు నీట మునిగాయి. నెల్లూరు చెరువు నుంచి వరద ప్రవాహాన్ని పెన్నాలోకి తీసుకెళ్లే పుల్లేడు వాగుకు సంబంధించి పొట్టేపాళెం వద్ద రెగ్యులేటర్‌ చెక్కలు విరిగిపోయాయి. దీంతో ప్రవాహమంతా నగరంలోకి ప్రవేశిస్తోంది. పల్లెపాళెం మీదుగా మనుమసిద్ధి నగర్‌, పుత్తేఎస్టేట్‌ ప్రాంతాలకు చేరింది. వరద క్రమేణ ముందుకు వస్తుండటంతో శివగిరికాలనీ, పరమేశ్వరీ నగర్‌, మన్సూర్‌నగర్‌లకు ముప్పు ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నీట మునిగిన ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. పెన్నా తీరానికి దగ్గరగా ఉన్న సుభాన్‌, దొరతోపు కాలనీల నుంచి 325 కుటుంబాలను, కోడూరుపాడులోని కల్తీ కాలనీ నుంచి 375 కుటుంబాలను  పునరావాస శిబిరాలకు తరలించారు. మరింతమందిని తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 

లోతట్టు జలమయం

గడిచిన మూడు రోజుల్లో నెల్లూరు నగరంలో సుమారుగా 170 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇంతటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుజబుజ నెల్లూరు పరిధిలోని కాలనీలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడం తో నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల చెట్లు నేలకూలడం, రహదారులు దెబ్బతినడం, రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అదే విధంగా పెద్ద సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు పడిపోవడం, తీగలు తెగిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాలతోపాటు శివార్లు, విలీన ప్రాంతాలు, పల్లెల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాలైతే గురువారం నుంచే అంధకారంలో ఉన్నాయి. కాగా, కార్పొరేషన్‌, విద్యుత్‌ శాఖల యంత్రాంగం సహాయ, పునరుద్ధరణ చర్యలను కొనసాగిస్తున్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో కాల్‌ సెంటర్‌ను కొనసాగిస్తున్నారు. కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ నేతృత్వంలోని బృందాలు డివిజన్ల వారీగా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు అహ్మద్‌నగర్‌లో పర్యటించి నీటి మునిగిన ఇళ్లను పరిశీలించారు. అధికారుల సూచన మేరకు పునరావాస కేంద్రాలను వెళ్లాలని బాధితులకు సూచించారు. 

శివార్లలో వరద తీవ్రతను పరిశీలిస్తున్న కమిషనర్‌ దినేష్‌కుమార్‌


జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు


Advertisement
Advertisement
Advertisement