జవాద్‌.. గుబులు!

ABN , First Publish Date - 2021-12-03T05:19:39+05:30 IST

అల్పపీడనాలు, వరుస తుఫాన్‌లు జిల్లా ప్రజలను వణికిస్తున్నాయి. గత నెలలో గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పంటను కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడ్డారు. తర్వాత నిన్నమొన్నటి వరకు అల్పపీడన ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. కోత దశకు వచ్చిన పంట మళ్లీ నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తాజాగా జవాద్‌ తుఫాన్‌ గుబులు వెంటాడుతోంది.

జవాద్‌.. గుబులు!
టెక్కలి : పొలం నుంచి వరి పంటను కల్లాలకు మోసుకెళ్తున్న రైతులు

- జిల్లాకు పొంచి ఉన్న తుఫాన్‌ ముప్పు

- నేటి నుంచి విస్తారంగా వర్షాలు

- ఆందోళనలో రైతులు, లోతట్టు ప్రాంతవాసులు

- సహాయక చర్యలకు అధికారులు సన్నద్ధం

- కలెక్టరేట్‌, మండల కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

అల్పపీడనాలు, వరుస తుఫాన్‌లు జిల్లా ప్రజలను వణికిస్తున్నాయి. గత నెలలో గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పంటను కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడ్డారు. తర్వాత నిన్నమొన్నటి వరకు అల్పపీడన ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. కోత దశకు వచ్చిన పంట మళ్లీ నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తాజాగా జవాద్‌ తుఫాన్‌ గుబులు వెంటాడుతోంది. ఈ తుఫాన్‌ జిల్లాపై అధిక ప్రభావం చూపనుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్టు ప్రకటించింది. జిల్లాలో బారువ, డొంకూరు సరిహద్దుల్లో తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. బారువ తీర ప్రాంతంలోని ఎక్కువగా ఈ తుఫాన్‌ ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో రైతులు, తీరప్రాంత వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 1.96 హెక్టార్లలో వరి సాగు చేశారు. ప్రస్తుతం 45వేల ఎకరాల్లో వరికోతలు పూర్తయ్యాయి. నిన్నటివరకు అల్పపీడన ప్రభావంతో వరి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. చాలా ప్రాంతాల్లో ప్రధాన రహదారులు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. తాజాగా జవాద్‌ తుఫాన్‌ నుంచి ఎటువంటి ముప్పు వాటిల్లుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


 అధికారులు అప్రమత్తం 

తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. 3, 4, 5 తేదీల్లో సముద్రంలో చేపలవేటను నిషేధించారు. వలలు, పడవలు సురక్షిత ప్రాంతాల్లో భద్రపర్చుకోవాలని మత్స్యకారులకు సూచించారు. ఈ విషయంపై తీరప్రాంత గ్రామాల్లో మెరైన్‌ పోలీసులు దండోరా వేయించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలో బారువ, డొంకూరు, ఇద్దివానిపాలెం, ఇసుకలపాలెం, రామయ్యపట్నం, గొల్లగండి, బారువ కొత్తూరు, ఎకువూరు, బట్టిగల్లూరు గ్రామస్థులను అప్రమత్తం చేశారు. ముందస్తుగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను జిల్లాకు రప్పించి.. సహాయక చర్యలకు సిద్ధంగా ఉంచారు. కలెక్టరేట్‌తో పాటు మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్‌ కారణంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. 


నేడు పాఠశాలలకు సెలవు

తుఫాన్‌ కారణంగా జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు శుక్రవారం సెలవు దినంగా కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఇళ్ల వద్దనే ఉండాలని సూచించారు. 


కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు

-------------------------------

శ్రీకాకుళం కలెక్టరేట్‌ : 08942-240557

శ్రీకాకుళం ఆర్డీవో కార్యాలయం: 83339 89270

టెక్కలి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం : 08945-245188

పాలకొండ ఆర్డీవో కార్యాలయం : 08941-260144, 9493341965

సోంపేట : 95509 67001

మెరైన్‌ : 1093

------------------------------

Updated Date - 2021-12-03T05:19:39+05:30 IST