దాదాసాహెబ్‌ రజనీకాంత్‌

ABN , First Publish Date - 2021-04-02T07:19:43+05:30 IST

దక్షిణాది అగ్రకథానాయకుడు, నాలుగు దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రజనీకాంత్‌ను ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. 2019 సంవత్సరానికిగాను రజనీ ఈపురస్కారానికి

దాదాసాహెబ్‌ రజనీకాంత్‌

తలైవాకు అత్యున్నత సినీ పురస్కారం

స్టైల్‌, మేనరిజాలకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు

తమిళనాడు ఎన్నికల వేళ బీజేపీ వ్యూహాత్మక ప్రకటన

ఇది సరైన సమయం కాదని కాంగ్రెస్‌ విమర్శ

మోదీ, కేసీఆర్‌, జగన్‌ సహా అభినందనల వెల్లువ

ఆదరించిన ప్రతి ఒక్కరికీ ఈ అవార్డు అంకితం: రజనీ


న్యూఢిల్లీ/చెన్నై, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది అగ్రకథానాయకుడు, నాలుగు దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రజనీకాంత్‌ను ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. 2019 సంవత్సరానికిగాను రజనీ ఈపురస్కారానికి ఎంపికైనట్టు సమాచార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ గురువారం ప్రకటించారు. ఈనెల 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న తరుణంలో  రజనీని ఫాల్కే అవార్డుకు ఎంపికచేయడం విశేషం. ఆశా భోంస్లే, మోహన్‌లాల్‌, బిశ్వజిత్‌ ఛటర్జీ, శంకర్‌ మహదేవన్‌,  సుభాష్‌ ఘాయ్‌తో కూడిన జ్యూరీ ఏకగ్రీవంగా రజనీ పేరును సిఫార్సు చేసినట్టు జావడేకర్‌ చెప్పారు.  మే 3న జరగనున్న కార్యక్రమంలో ఆయనకు ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. నటుడిగానే కాక నిర్మాత, స్టూడియో అధినేతగా సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారని, అందుకే ఈ గుర్తింపని పేర్కొన్నారు. కాగా, తమిళ సినీరంగంలో ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌ల తరువాత అంతస్థాయికి ఎదిగిన రజనీకాంత్‌.. రాజకీయ పార్టీ పెడతానని  నాలుగేళ్ల కిందట ప్రకటించారు. చివరకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనారోగ్య కారణాలతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు ఆయన వెల్లడించారు.


ఇది ఆయనను నమ్ముకున్న వేలాది మందికి నిరాశ కలిగించింది. కాగా, ఫాల్కే అవార్డుకు ఎంపికైన రజనీకి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అన్ని తరాల వారినీ ఆకట్టుకునే నటుడు...ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు.. గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. తలైవాకు ఫాల్కే అవార్డు నిజంగా గర్వకారణం. ఆయనకు అభినందనలు అని మోదీ ట్వీట్‌ చేశారు.  తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ అభినందించారు. ‘‘ తనదైన ప్రత్యేక శైలితో నటుడిగా  కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్‌కు ఈ అవార్డు రావడం గొప్పవిషయం’’ అని కేసీఆర్‌ అభినందించారు.


ఈ పురస్కారం  ఆ బస్సు డ్రైవర్‌కు అంకితం...

దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును తన ఎదుగుదలకు సహకరించి, తనను ఆదరించిన ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నట్లు రజనీకాంత్‌ ప్రకటించారు. ‘ఫాల్కే అవార్డుకు తనను ఎంపిక చేసిన కేంద్రానికి, ప్రధాని మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా’ అని రజనీకాంత్‌  పేర్కొన్నారు. ‘‘నాలో ఓ నటుడు దాగున్నాడనే విషయాన్ని గుర్తించి ప్రోత్సహించిన బస్సు డ్రైవర్‌ రాజా బహుదూర్‌కు, పేదరికంలోనూ నన్ను ఓ నటుడిగా నిలబెట్టేందుకు ఎన్నో త్యాగాలు చేసిన సోదరుడు సత్యనారాయణ రావ్‌ గ్వైకాడ్‌కు, నన్ను వెండితెరకు పరిచయంచేసి... ఈ రజనీకాంత్‌ను తయారు చేసిన గురువు కె.బాలచందర్‌కు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమానులకు ఈ అవార్డు అంకింతం చేస్తున్నాను’’ అని రజనీ పేర్కొన్నారు. 


అవార్డు ఇవ్వడానికి ఇదా సమయం: కాంగ్రెస్‌

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును రజనీకాంత్‌కు ఇవ్వడానికి ప్రకటించిన సమయాన్ని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ‘‘ రజనీ ఎంతో గౌరవాభిమానాలు పొందిన వ్యక్తి. గొప్ప నటుడు. అర్హుడు.. కానీ బీజేపీ ఈ ఎన్నికల వేళ ప్రకటించడం తప్పు.. ఇది సరైన సమయం కాదని కాంగ్రెస్‌ అభిప్రాయపడింది. 

Updated Date - 2021-04-02T07:19:43+05:30 IST