‘జగన్ రూ.9లక్షలు ఇచ్చారు.. చంద్రబాబు ఓ బిడ్డను దత్తత తీసుకున్నారు..’

ABN , First Publish Date - 2020-05-08T22:33:42+05:30 IST

ప్రస్తుతమున్న వ్యవస్థ ప్రక్షాళన కావలసిందేనని అంటున్నారు ‘డాడీ’ రాజారెడ్డి... అనాథ పిల్లలను ఆదరించి, సేవ చేయడంలో ఉన్న మజాయే వేరని, అందుకే తన జీవితం అంకితమని చెబుతున్నారు.

‘జగన్ రూ.9లక్షలు ఇచ్చారు.. చంద్రబాబు ఓ బిడ్డను దత్తత తీసుకున్నారు..’

అబ్దుల్ కలాం గారు నన్ను డాడీ అని పిలిచినప్పుడు ఏదోలా అనిపించింది

ఈ వ్యవస్త ప్రక్షాళన కావాలి.. సదుద్దేశం ఉన్నవారు కలిసొస్తారు

డాడీ అన్న పిలుపులో ఆప్యాయత కనిపిస్తుంది

భవిష్యత్తులోనూ పిల్లలకు లోటు రాకూడదనే విద్యా సంస్థల వేర్పాటు

పెళ్లి చేసుకుంటే ప్రాధాన్యాలు మారిపోతాయేమో

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేతో డాడీ రాజారెడ్డి


ప్రస్తుతమున్న వ్యవస్థ ప్రక్షాళన కావలసిందేనని అంటున్నారు ‘డాడీ’ రాజారెడ్డి... అనాథ పిల్లలను ఆదరించి, సేవ చేయడంలో ఉన్న మజాయే వేరని, అందుకే తన జీవితం అంకితమని చెబుతున్నారు. అనాథ పిల్లలను చేరదీసి, వారిని సన్మార్గంలో పెట్టేందుకు కడప జిల్లాలో రాజా ఫౌండేషన్‌ను స్థాపించారు. డాడీ హోం పేరిట ఓ పెద్ద ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఇందులో వృద్ధులను కూడా చేర్చుకొని సేవలందిస్తున్నారు. మనసున్న వారంతా సహకరిస్తారన్న నమ్మకముందని చెబుతున్న రాజారెడ్డితో 8-3-2010న జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’...వివరాలు


ఆర్కే: సేవ చేయాలి అన్న ఆలోచన మీకెందుకు వచ్చింది?

రాజారెడ్డి: సమాజంలో కొన్ని బాధాకరమైన పరిస్థితులు నన్ను ప్రేరేపించాయి. ఒక రోజు నేను విశాఖపట్నం నుంచి విజయవాడకు ట్రైన్‌లో వెళ్తుంటే నాతో పాటే ఓ చక్కటి కుటుంబం కూడా ప్రయాణం చేస్తోంది. తల్లి తన ఒడిలో చిన్న బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తోంది. సామర్లకోట వద్ద రైలు ఆగింది. ప్లాట్‌ఫారం మీద ఓ బిడ్డకు చినిగిపోయిన దుస్తులతో ఎముకలు తప్ప ఏమీ కనపడటం లేదు. ఈ తల్లి వైపు చాలా దీనంగా చూస్తున్నాడు. తన బిడ్డ తినగా వదిలేసిన ఇడ్లీ ముక్కలు ఓ పొట్లంలో చుట్టేసి విసిరేసిందామె. దాని కోసం ఆ పిల్లాడు వెళ్తుండగా ఓ కుక్క వచ్చి దానిని తీసుకుపోయింది. అప్పుడనిపించింది.


ఆర్కే: టెన్త్‌ ఫెయిలయ్యారు. ఆ తర్వాత ఎంఎస్‌ సైకాలజీ, ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఎలా సాధ్యమైంది?

రాజారెడ్డి: చిన్నప్పడు రౌడీలా ఉండేవాడిని. నాయకత్వ లక్షణాలుండేవి. సర్కిల్‌ ఉండేది. ఊర్లో చాలామందికి చదువుకోవాలని ఉన్నా వీలు కాని పరిస్థితి. ఇంట్లో పనిచేసే జీతగాళ్ల పిల్లలకు చదువుండేది కాదు. నాకుండేది. చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూడడం వల్ల ఈ వ్యవస్థను మార్చగలమా? అనే ఆలోచన వచ్చింది. అందులోంచి సాధించాను. ఓటమి కూడా గెలుపునకు ఓ మెట్టులా... టెన్త్‌ ఫెయిలైనా ఈ స్థాయికి రావడానికి ఓ పౌరుషాన్ని నాలో నింపిందనుకోవచ్చు.


ఆర్కే: చిత్తూరులో ఎందుకు ప్రారంభించారు?

రాజారెడ్డి: పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి పిల్లలు అధికంగా ఉంటారు. అలాంటి బిడ్డలను ఆదుకోవాలంటే వారుండే చోటికి మనం వెళ్లాలనే ఉద్దేశంతో తిరుపతిలో 2000లో ప్రేమ నివాస్‌ను మొదటిసారిగా సేవా కార్యక్రమాలు ప్రారంభించాను. ఇప్పుడు దానినే డాడీ హోంగా మార్చాం. పిల్లలను అక్కడే ఉంచడం వల్ల పెద్దగా మార్పు రావడం లేదు. దీంతో మైలవరానికి మార్చాం. పిల్లలకు ఏది ఇష్టమో దానిని మన ఇష్టంగా మార్చుకోవాలి. అది చైల్డ్‌ సైకాలజీలో సాధారణ ఫిలాసఫీ... అలా చేయగలిగినప్పుడే పిల్లలకు మనపై నమ్మకం కలుగుతుంది.


ఆర్కే: ఇంత పెద్ద కార్యక్రమాలు చేపట్టాలంటే ఖర్చు. ఆదాయం ఉండదు. మరెలా సాధ్యమవుతోంది?

రాజారెడ్డి: ఒకవిధంగా ఇది చాలా కష్టతరమైన పనే. పిల్లలకు కూడు, గూడు, విద్య, వైద్యం కావాలి. అవి అందించగలుగుతున్నాం. కానీ, ఎక్కడో ఏకాకితనం. దీంతో వృద్ధుల ఆశ్రమం ప్రారంభించాం. వీధి పిల్లల్లో కొందరికి హెచ్‌ఐవీ ఉన్నట్టు గుర్తించాం. నెల రోజులు నిద్ర రాలేదు. రెసిడెన్షియల్‌ పిల్లల్లో 29 మందికి హెచ్‌ఐవీ ఉంది. ఇంకా బయట నుంచి చాలా మంది వస్తుంటారు. మంచి మనసున్న వారెందరో డాడీ హోంకు వచ్చి సహాయపడుతున్నారు. నెలకు కనీసం రూ. 3.50 లక్షల ఖర్చు వస్తుంది.


అవును నిధులొస్తున్నాయి...


ఆర్కే: విదేశాల నుంచి నిధులు భారీ ఎత్తున వస్తున్నాయనే ఆరోపణ...

రాజారెడ్డి: అవును నిధులొస్తున్నాయి. ఏడాదికి 30 నుంచి 40 లక్షలు వస్తున్నాయి. అది నా కృషి ఫలితమే. ఇంత పెద్ద కార్యం ఒకే వ్యక్తి చేసేది కాదు. అందుకే ఓ గ్రూప్‌ను తయారు చేసుకొన్నాను. మిషనరీ ఆర్గనైజేషన్స్‌ కూడా సహకరిస్తున్నాయి. డాడీ హోం నిర్మాణానికి 6 కోట్లు ఖర్చయ్యింది. అందరికీ వసతి కావాలనే ఉద్దేశంతోపాటు మనకు అందరూ ఉన్నారనే భావన పిల్లల్లో కల్పించేందుకు పెద్ద భవనం నిర్మించాను. అది లగ్జరీ కాదు.


ఆర్కే: పిల్లల మీద ఇంత ప్రేమ ఉన్న మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు?

రాజారెడ్డి: రోమన్‌ కేథలిక్‌ మిషన్‌లో నేను సభ్యుడిని. అందులో ఉండాలనుకుంటే వివాహం చేసుకోకూడదు. అయితే, వ్యక్తిగతంగా పెళ్లి చేసుకుంటే ఇంత సేవ చేయలేననే ఉద్దేశంతోనే ఇలా ఉండిపోయాను. పెళ్లయితే ప్రయారిటీలు మారిపోతాయోమోనని..


ఆర్కే: నిధుల సేకరణలో మీకెంత మంది ఏయే దశల్లో సహకారం అందించారు?

రాజారెడ్డి: అనుకోని అతిథులు చాలా మంది వచ్చారు. వైఎస్‌ జగన్‌ ఓ సారి వచ్చారు. రూ. 9 లక్షలు విరాళమిచ్చారు. ఓసారి మీకోసం కార్యక్రమం కింద వచ్చిన చంద్రబాబు ఒక రాత్రి ఇక్కడే ఉన్నారు. ఓ బిడ్డను దత్తత తీసుకున్నారు. ఇక్కడకు వచ్చిన వారంతా ఏదో ఒక సాయం చేస్తున్నారు. ‘బతుకునిద్దాం’ అనే పేరుతో ఓ పథకం పెట్టాం. దీని కింద పిల్లలను దత్తత తీసుకుని, వారి ఆలనాపాలనా చూసుకుంటున్నారు. ఇక్కడున్న 140 మందిలో 60 మందిని ఇలా దత్తత తీసుకున్నారు. బయటకు వెళ్లినా వారి చదువులకు సాయపడుతున్నాం.


ఆర్కే: మీ దగ్గర నుంచి ఉన్నత స్థాయికి వెళ్లినవారుంటే అది ఇతర పిల్లలకు ప్రేరణ అవుతుంది కదా?

రాజారెడ్డి: దాని గురించి ఆలోచించే టెక్నో స్కూల్‌ ప్రారంభించాం. ఇప్పుడు బీఈడీ కాలేజీ వచ్చింది. ఒకేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌నూ అందుకే ప్రారంభించాను. వారికి ఓ స్థాయిని కల్పిద్దామనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాను. పిల్లలను సడన్‌గా విడిచిపెట్టేయడం లేదు. బయటకు వెళ్లి చదువుకుంటున్నా.. డాడీ హోం మీ వెంటే ఉంటుందని చెప్పడం ద్వారా వారిలో ధైర్యం పెంపొందిస్తున్నాం. ఉన్నత విద్య కోసం చాలా వరకు సహకరిస్తున్నాం.


ఆర్కే: ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, బీఈడీ కాలేజ్‌. భవిష్యత్తులో విరాళాల కోసం ఆధారపడకూడదనా? లేక మీరు ఆర్థికంగా బలోపేతం కావడానికా?

రాజారెడ్డి: నాకేదైనా అయితే నా పిల్లల పరిస్థితి ఏమిటి? అవన్నీ ట్రస్ట్‌ కిందనే ఉన్నాయి. ఇవన్నీ డాడీ హోంకు సహాయపడేలా ఉండాలి. ముఖ్యంగా హెచ్‌ఐవీ ఉన్నవారి కోసం ఓ హోం కట్టాల్సి ఉంది. దానికి నిధులు కావాలి.


ఆర్కే: పూజ ఇంటర్నేషనల్‌ స్కూల్లో విదేశీ మహిళలు ఉపాధ్యాయులుగా ఉన్నారు. వారెలా వచ్చారు?

రాజారెడ్డి: అది గ్లోబల్‌ స్టాండర్డ్స్‌ ఉన్న స్కూల్‌. ఇంటర్నేషనల్‌ అన్నప్పుడు ఆ వాతావరణం ఉండాలి కదా... (ఆర్కే: విదేశీ మహిళలున్నంత మాత్రాన అంతర్జాతీయం అయిపోతుందా?) అలాగని కాదు. పిల్లలకు విదేశీ భాషల్లో పరిజ్ఞానం పెంచేందుకు వారి అవసరం ఉంటుంది. అందుకే కొందరు ట్రైనీలు ఇక్కడకు సేవ చేసే ఉద్దేశంతో వచ్చారు. విద్య ద్వారా పిల్లల్లో సామాజిక సేవ అలవర్చే ప్రయత్నం చేస్తున్నాం. పిల్లలను మా చేతిలో పెట్టండి మంచి నాయకుడిని తీసుకెళ్లండనే కాన్సెప్ట్‌తో స్కూల్‌ నడుపుతున్నాం. (ఆర్కే: మీరు వసూలు చేస్తున్న ఫీజులకు మంచి నాయకుడెలా వస్తాడు. సంపాదించే నాయకులే వస్తారు.) రైతు బిడ్డలకు 50శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నాం.


ఆర్కే: ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అది సాధ్యమా?

రాజారెడ్డి: ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. (ఆర్కే: ఈ వ్యవస్థ అందించగలదని నమ్ముతున్నారా?) గాంధీ అలా అనుకుంటే స్వాతంత్య్రం సాధించేవారా (ఆర్కే: ఆయన మహాత్మా గాంధీ) గాంధీయే తర్వాత మహాత్ముడయ్యారు. (ఆర్కే: ఇప్పుడున్న వారిలో కాబోయే మహాత్ములున్నారా?) ఏమో ఉండవచ్చు. (ఆర్కే: సేవా రంగంలో ఉన్న మీరు ఇంత లౌక్యంగా మాట్లాడితే ఎలా?) అట్లా ఏం కాదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు అని చెప్పే కంటే అందుకు మన వంతు ప్రయత్నం చేయాలి. ఈ వ్యవస్థ ప్రక్షాళన కావాలి.


ఆర్కే: రాజకీయాలంటే ఆసక్తి ఉందా? భవిష్యత్తులో అందులో చేరే ప్రమాదముందా?

రాజారెడ్డి: చదువుతాను గానీ అలాంటి ఆలోచన ఏమీ లేదు. ఇలాగే ఉంటూ సేవ చేస్తాను.


ఆర్కే: ఓల్డేజ్‌ హోంలో ఉన్న వారు మిమ్మల్ని ఏ విధంగా పిలుస్తారు?

రాజారెడ్డి: వారు కూడా డాడీ అనే పిలుస్తారు. ఆ పిలుపులో ఎంతో ఆప్యాయత కనిపిస్తుంది. నాకు డబ్బు ముఖ్యం కాదు. ఆ పరిధి దాటిపోయాను. అనాథలు, అభాగ్యులు లేని సమాజాన్ని చూడాలన్నదే నా తాపత్రయం.


ఆర్కే: ‘డాడీ’ అన్నది మీ ఇంటి పేరుగా మారిపోయింది? ఆ పిలుపు కొత్తగా ఉంది కదా?

రాజారెడ్డి: అబ్దుల్‌ కలాం గారు.. నన్ను డాడీ అని పిలిచినప్పుడు నాకు ఏదోలా అనిపించింది. నేనేం మాట్లాడలేకపోయాను. ఒకరకంగా ఆ పిలుపు నాలో చాలా మంచి అనుభూతి కలిగించింది. అయితే అలా పిలిపించుకునే కంటే ఆ బాధ్యత నిర్వర్తించడంలో ఉండే అనుభూతి వేరు. దానికి దూరమైపోతాననే ఐదేళ్ల నుంచి విదేశాలకు వెళ్లడం లేదు.

Updated Date - 2020-05-08T22:33:42+05:30 IST