రోజుకో రికార్డు!

ABN , First Publish Date - 2021-04-17T05:11:14+05:30 IST

కొత్తగా కరోనా కేసుల నమోదులో వికారాబాద్‌ జిల్లా రోజుకో రికార్డు సృష్టిస్తోంది.

రోజుకో రికార్డు!

  • రికార్డు స్థాయిలో కరోనా కేసుల నమోదు
  • ఒకేరోజు వికారాబాద్‌ జిల్లాలో 397, రంగారెడ్డి జిల్లాలో 1240 పాజిటివ్‌లు


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): కొత్తగా కరోనా కేసుల నమోదులో వికారాబాద్‌ జిల్లా రోజుకో రికార్డు సృష్టిస్తోంది. ఒకరోజు నమోదైన కరోనా కేసులను అధిగమిస్తూ మరోరోజు రికార్డుస్థాయిల్లో నమోదవుతున్నాయి. జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడం ప్రారంభమైనప్పటి నుంచి అత్యఽధికంగా శుక్రవారం 397 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంత వరకు జిల్లాలో 6,422 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం జిల్లాలో 3,340 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 397మందికి పాజిటివ్‌ వచ్చింది. 


జాగ్రత్తలు పాటించకపోవడంతోనే..

కరోనా కేసులు రోజురోజుకూ ఎక్కువ సంఖ్యలో నమోదవడానికి కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడంమే ప్రధాన కారణమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. మాస్కులు ధరించకపోవడం, చేతులను శుభ్రపరుచుకోకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం వల్లనే కరోనా వ్యాప్తి జరుగుతోందం టున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలు కొనసాగిస్తున్న వారితోనే కరోనా వ్యాప్తి అధికంగా జరుగుతోందంటున్నారు. పాజిటివ్‌ కేసుల కాంటాక్టులను గుర్తించి వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తుండడంతో పరీక్షల సంఖ్యతోపాటు కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. గాలిలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన ఈ సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వెంటనే వారిని హోం ఐసోలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకుని చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా కూడా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వల్ల ఎవరికి కరోనా ఉందో, లేదో తెలియడం లేదు. మరో నాలుగువారాల వరకు కేసుల ఉధృతి ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. 


వికారాబాద్‌ జిల్లాలో 210 పడకలు సిద్ధం

కరోనా రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా వికారాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు 210 పడకలు సిద్ధం చేశారు. తాండూరులో 30 పడకలు ఏర్పాటు చేయగా.. ఇక్కడ 11 మంది కొవిడ్‌ చికిత్స పొందుతున్నారు. అనంతగిరిలో 40 పడకలు, వికారాబాద్‌లోని మహవీర్‌ జనరల్‌ ఆసుపత్రిలో 140 పడకలు సిద్ధం చేశారు. ఈ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో వారికి చికిత్స అందించేందుకు జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు ఇప్పటివరకు 20 ప్రైవేట్‌ ఆసుపత్రులను గుర్తించారు. ఇంకా కొన్ని ఆసుపత్రులను ఎంపిక చేసేందుకు ఆమె కసరత్తు చేస్తున్నారు.


రంగారెడ్డి జిల్లాలో ఒక్క రోజే 1,240 కేసులు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): రంగారెడ్డి జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వారంరోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.  పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ముందుకొస్తుండటంతో పరీక్ష కేంద్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. పెద్ద ఎత్తున మహమ్మారి బారిన పడిన జనం ఆసుపత్రులకు వెళుతున్నారు. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. రోగుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆక్సిజన్‌ బెడ్ల కొరత ఏర్పడుతుంది. జిల్లాలో శుక్రవారం 6,954 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,240 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. జీహెచ్‌ఎంసీలో 482 కేసులు నమోదు కాగా, నాన్‌జీహెచ్‌ఎంసీలో 758 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో 76,682మంది కరోనా బారిన పడినట్లు అధికారికంగా లెక్కలు చెబుతున్నాయి. అలాగే 218 మంది మృతి చెందారు. పెరుగుతున్న కేసుల సంఖ్యతో పాటు మృతుల వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. 

Updated Date - 2021-04-17T05:11:14+05:30 IST