Abn logo
May 7 2021 @ 04:05AM

డెయిరీలో సోదాలా?.. డేటా చోరీలా?

సంగంలో బయటివ్యక్తులతో తనిఖీలపై సంస్థ ఉద్యోగుల ఆక్షేపణ

వివాదంగా మారిన ఏసీబీ సోదాల తీరు

మార్కెట్‌, సేల్స్‌ వివరాలుండే సర్వర్లు ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారని నిరసన 

2వారాలుగా ఏమీ తేల్చలేకే ఇదంతా

ఏసీబీ అధికారులకు సిబ్బంది ప్రతిఘటన


చేబ్రోలు, మే 6 : సంగం డెయిరీలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఏసీబీ అధికారులే కాకుండా బయట వ్యక్తులు కూడా ఈ సోదాల్లో పాల్గొంటున్నారంటూ గురువారం సంస్థ ఉద్యోగులు ఆక్షేపించారు. దీంతో సోదాల వ్యవహారం కొత్త వివాదాన్ని సృష్టించింది. డెయిరీకి చెందిన మార్కెటింగ్‌ డేటాను చోరీ చేస్తున్నారని ఉద్యోగులు నిరసనకు దిగారు. ఉద్యోగుల కథనం ప్రకారం, రెండువారాలపాటు సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కార్యాలయంలో విస్తృత తనిఖీలు జరిపిన ఏసీబీ అధికారులు.. మంగళవారం నుంచి సంగం డెయిరీలో సోదాలు ప్రారంభించారు. డెయిరీ మార్కెటింగ్‌, సేల్స్‌, రూట్‌మ్యాప్‌ వంటి కీలక సమాచార డేటా ఉండే సర్వర్లను ఆపరేట్‌ చేసేందుకు సన్నద్ధులయ్యారు. ఈ సమయంలో ఉద్యోగులు ప్రతిఘటించారు. కేసుకు సంబంధంలేని మార్కెటింగ్‌ డేటా ఉండే సర్వర్లు ఎందుకు తనిఖీ చేస్తున్నారంటూ ఏసీబీ అధికారులను ప్రశ్నించారు. తనిఖీల పేరుతో సంబంధంలేని బయట వ్యక్తులను తీసుకువస్తున్నారని గట్టిగా ఆక్షేపించారు. న్యాయస్థానం ఏసీబీ పోలీసులు మాత్రమే కేసులకు సంబంధించిన సమాచార  సేకరణ కోసం సోదాలను నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చిందని, సంబంధంలేని వ్యక్తుల ప్రమేయాన్ని తాము అనుమతించబోమని సంగం సీనియర్‌ ఉద్యోగులు తేల్చిచెప్పారు. 


ప్రైవేట్‌ వ్యక్తులు సర్వర్లు నిర్వహించడం ద్వారా విలువైన సంస్థ డేటా చోర్యం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. బయట వ్యక్తుల ప్రమేయం, సంబంధంలేని డేటా సేకరణ వంటి చర్యలు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని, తాము ఈ వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు ఏసీబీ అధికారులకు సంగం ఉద్యోగులు తెలిపారు. అయినప్పటికీ ఏ విభాగంలోనైనా తనిఖీలు చేసుకునే అధికారం తమకు ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారని, ఉత్తర్వుల చూపమంటే చూపడం లేదని సంగం ఉద్యోగులు చెబుతున్నారు. ముమ్మాటికీ తమ సంస్థ వ్యక్తిగత డేటాను, కీలక సమాచారాన్ని బయటకు  చేరవేసే దురుద్దేశంతోనే ఇదంతా జరుగుతోందని ఉద్యోగులు, సిబ్బంది నిరసనలకు దిగారు. ఏసీబీ అధికారులు గత రెండు వారాలుగా సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ ఎటువంటి అనుమానస్పద విషయాలు లభ్యం కాకపోవడంతో ఏదో ఒక అంశం పేరుతో రోజుల తరబడి సోదాలు కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సంస్థను ప్రజలలో చులకన చేయడం, దురుద్దేశాలు ఆపాదించేలా చేయడానికి జరుగుతున్న కుట్రగా అనుమానిస్తున్నారు. ఏసీబీ తీరును న్యాయస్థానం దృష్టికి తీసుకువెళతామని సంగం పాలక వర్గ సభ్యులు, సీనియర్‌ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. 

Advertisement