కోవిడ్-19: భారత్‌పై దలైలామా ప్రశంసలు

ABN , First Publish Date - 2020-03-30T22:00:25+05:30 IST

ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న కోవిడ్-19 మహమ్మారి అంతానికి ధైర్యం, సంకల్పంతో పాటు ..

కోవిడ్-19: భారత్‌పై దలైలామా ప్రశంసలు

న్యూఢిల్లీ: ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న కోవిడ్-19 మహమ్మారి అంతానికి ధైర్యం, సంకల్పంతో పాటు మానవ బుద్ధకుశలత, సైన్స్‌లను అస్త్రాలుగా ఉపయోగించాలని టిబెట్ మత గురువు దలైలామా పిలుపునిచ్చారు. ఈ సంక్షోభంపై కలిసికట్టుగా పోరాడేందుకు సార్క్ దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భారత్  పోషించిన కృషిపై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని అనేమంది చేసిన విన్నపం మేరకు ఆయన కరోనా మహమ్మారిపై ప్రత్యేక సందేశం ఇచ్చారు. ‘‘కరోనా వైరస్ కారణంగా ఇవాళ మనం అనూహ్యంగా కష్టసమయాన్ని ఎదుర్కొంటున్నాం. దీనికి తోడు ముందు ముందు మానవాళికి తీవ్ర పర్యావరణ మార్పు సహా అనేక సమస్యలు ఎదురవుతాయి.అది ఎంత కష్టమైనా కావచ్చు... సంకల్పం, ధైర్యంతో పాటు సైన్స్, మానవ బుద్ధికుశలతను అన్వయించి మన ముందున్న సమస్యను అధిగమించాలి..’’ అని పేర్కొన్నారు. మన ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చినప్పుడు కొంత భయం, ఆతృతలాంటివి సాధారమేనని ఆయన పేర్కొన్నారు.


కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు అందరూ తమశక్తిమేర పోరాడుతున్నారనీ.. సమిష్టిగా పోరాడేందుకు సార్క్ దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. భారతీయ పురాతన సంప్రదాయం ఈ సృష్టి, మన్నిక, ప్రపంచ వినాశనం గురించి సవివరంగా చెబుతుందని దలైలామా తన ప్రత్యేక సందేశంలో పేర్కొన్నారు. ‘అలాంటి వినాశనానికి గల కారణాల్లో సాయుధ పోరాటం, వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవాళ మనం ఎదుర్కొంటున్నది కూడా ఈ  కారణాల్లో ఒకటే. అయితే మనకు ఎదురయ్యే కష్టం ఎలాంటిదైనా.. దీని నుంచి కోలుకునేందుకు మానవాళి తమ సామర్థ్యం మేర పోరాడుతోంది..’’ అని అని వ్యాఖ్యానించారు. కాగా లాక్‌డౌన్ చేయాల్సిన పరిస్థిని తాను అర్థం చేసుకోగలననీ.. అయితే దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది తమ జీవనోపాధిని కోల్పోయారని దలైలామా పేర్కొన్నారు. తమ ఆరోగ్యానికి ప్రమాదం అని తెలిసి కూడా అనేకమంది వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది ముందుండి పోరాడుతున్నారనీ.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ మహమ్మారి బారి నుండి త్వరగా కోలుకుని ప్రపంచమంతా మళ్లీ శాంతి సౌభాగ్యాలతో సంతోషంగా ఉండాలని దలైలామా ఆకాక్షించారు. 

Updated Date - 2020-03-30T22:00:25+05:30 IST