డాలర్లు మార్చి ఇవ్వాలని మోసం

ABN , First Publish Date - 2021-03-03T07:19:04+05:30 IST

డాలర్లను ఇండియన్‌ కరెన్సీ

డాలర్లు మార్చి ఇవ్వాలని మోసం

ముగ్గురిని అరెస్ట్‌ చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 

హైదరాబాద్‌ సిటీ, మార్చి 2(ఆంఽధ్రజ్యోతి): డాలర్లను ఇండియన్‌ కరెన్సీలోకి మార్చి ఇవ్వాలం టూ దృష్టి మరల్చి మో సాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లోని ముగ్గురు సభ్యులను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 2.83లక్షల నగదు, 200 యూఎస్‌ డాలర్లు (డాలర్లతో కలిపి మొత్తం విలువ రూ. 3లక్షలు) స్వాఽధీనం చేసుకున్నారు. జార్ఖండ్‌ రాష్ట్రం బాలూగ్రామ్‌కు చెందిన అనిల్‌ ఉల్‌ షేక్‌ (42), సాహె బ్‌ గంజ్‌ జిల్లాకు చెందిన  షాజహాన్‌ షేక్‌ (29), అదే ప్రాంత నివాసి వహాబ్‌ షేక్‌ (34), మరో మైనర్‌తో కలిసి గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. గతంలో లేబర్‌ పని చేసి, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మోసాలు చేయడం ప్రారంభించారు. యూఎస్‌ డాలర్లను ఇండియన్‌ కరెన్సీలుగా మార్చి ఇవ్వాలని, నమ్మించి మోసాలకు పాల్పడుతుంటారు. ఈ ముఠా సభ్యులు రద్దీ ప్రాంతాలకు వెళ్లి, అమాయకులను గుర్తించి వారికి యూఎస్‌ డాలర్లు చూపుతారు. తమ వద్ద సుమారు 7 వేల నుంచి 8 వేల యూ ఎస్‌ డాలర్లు ఉన్నాయని, వాటి విలువ రూ. 5 లక్షలకు పైగానే ఉంటుందని చెబుతారు. నగరంలో తమను ఎవరూ గుర్తుపట్టరని, డబ్బులు అవసరం ఉన్నందున రూ. 4లక్షలు ఇచ్చినా డాలర్లు ఇచ్చేస్తామని నమ్మిస్తారు. తొలుత అసలు డాలర్లను చూపిస్తారు. నమ్మిన బాధితుడు పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చి తెచ్చిన తర్వాత డాలర్ల మధ్యలో చిత్తు కాగితాలు, ఇతర కాగితాలు పెట్టి బండిల్స్‌గా తయారు చేసి మోసం చేస్తారు. నగరంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్టు గుర్తించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గ్యాంగ్‌లోని ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌ పరారీలో ఉన్నాడు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను, స్వాధీనం చేసిన డబ్బును రెయిన్‌ బజార్‌ పోలీసులకు అప్పగించారు.  

Updated Date - 2021-03-03T07:19:04+05:30 IST