దళితబంధు అమలు కార్యాచరణ ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-24T00:56:36+05:30 IST

దళితబంధు పథకానికి పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాచరణను అమలు చేయడం ప్రారంభించింది.

దళితబంధు అమలు కార్యాచరణ ప్రారంభం

కరీంనగర్‌: దళితబంధు పథకానికి పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాచరణను అమలు చేయడం ప్రారంభించింది. ఇప్పటికే 500 కోట్ల రూపాయలను విడుదల చేసిన ప్రభుత్వం సోమవారం మరో 500 కోట్ల రూపాయలను విడుదల చేసింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 20,292 దళిత కుటుంబాలు ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. వీరందరికి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి 2029 కోట్ల 20 లక్షల రూపాయల అవసరమవుతాయి. ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేసిన డబ్బుతో 10 వేల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించవచ్చు. ఈ నిధులను వెచ్చించేలోగానే మిగతా సొమ్ము కూడా విడుదలవుంతుందని అధికారులు చెబుతున్నారు. హుజూరాబాద్‌ మండలంలో 5,023 దళిత కుటుంబాలు, కమలాపూర్‌ మండలంలో 4,346 కుటుంబాలు, జమ్మికుంట మండలంలో 4,996 కుటుంబాలు, వీణవంక మండలంలో 3,678 కుటుంబాలు, ఇల్లందకుంట మండలంలో 2,586 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వీరందరికి నెల రోజుల్లోనే పూర్తిస్థాయిలో ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - 2021-08-24T00:56:36+05:30 IST