దళిత దాక్షాయణి

ABN , First Publish Date - 2021-06-17T08:17:05+05:30 IST

‘‘అధ్యక్షా... ఈ తీర్మానం మీద నా అభిప్రాయం చెప్పేముందు నన్ను మన విప్లవాత్మక పిత అయిన మహాత్మాగాంధీకి సవినయంగా నివాళులర్పించనివ్వండి. ఆ మహానుభావుడి మార్మిక దార్శనికత, ఆయన రాజకీయ ఆదర్శవాదం, ఆయన సామాజిక ఆర్తి మనకు మన లక్ష్యాలని సాధించేందుకు అవసరమైన

దళిత దాక్షాయణి

‘‘అధ్యక్షా... ఈ తీర్మానం మీద నా అభిప్రాయం చెప్పేముందు నన్ను మన విప్లవాత్మక పిత అయిన మహాత్మాగాంధీకి సవినయంగా నివాళులర్పించనివ్వండి. ఆ మహానుభావుడి మార్మిక దార్శనికత, ఆయన రాజకీయ ఆదర్శవాదం, ఆయన సామాజిక ఆర్తి మనకు మన లక్ష్యాలని సాధించేందుకు అవసరమైన సాధనాల్ని అందించాయి’’... అన్నదామె. సభ అంతా కరతాళ ధ్వనులతో మోగిపోయింది. ఆమె కళ్లజోడు తీసి చెమ్మగిల్లిన కళ్లు తుడుచుకుంది. అది 1946 డిసెంబర్‌ 19... అప్పటికి దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. 


కొత్త ఢిల్లీ మధ్యలో... విలక్షణమైన వలయాకార వాస్తుశైలితో, ఎర్రని రాతి స్తంభాలతో కాంతులీనుతున్న భవనంలో జరుగుతున్న సభ అది. (మధ్యప్రదేశ్‌లోని 11వ శతాబ్దికి చెందిన చతుశ్శత్‌ యోగినీ మందిరం స్ఫూర్తితో బ్రిటిష్‌ వాస్తుశిల్పులు ల్యూటెన్స్‌, బేకర్‌ ఆ భవనానికి రూపకల్పన చేశారు.) ఆ రోజు అక్కడ జరుగుతున్నది నూతనంగా ఎన్నికైన రాజ్యాంగ రచనాసభ సమావేశం. 


ప్రజారంగంలో తలపండిన నాయకమన్యులు, చట్టసభల వ్యవహారాల్లో కోవిదులైన విజ్ఞులు, శాసన నిర్మాణ పరిభాషలో ఉద్దండులైన న్యాయవేత్తలతో అలరారుతున్న ఆ సభలో ప్రసంగించేందుకు లేచి నిలబడింది ఒక యువ సభ్యురాలు. 


ఆమె వయసు కేవలం 34 సంవత్సరాలు. చక్కని ఇంగ్లిష్‌ ఉచ్ఛరణతో ఆమె మాట్లాడిన మొదటి మాటకే సభ అంతా చప్పట్లతో మార్మోగింది. ‘ఎవరీమె? ఎవరీమె?’... సభలో గుసగుసలు... ప్రశ్నలు. 

ఆమె పేరు దాక్షాయణి వేలాయుధన్‌. కేరళలోని కొచ్చిన్‌ నుంచి వచ్చింది. హరిజనురాలు. 

‘అబ్బో... బాగా మాట్లాడుతోందే... చిన్న పిల్లే... హరిజనురాలని బొత్తిగా అనిపించట్లేదు సుమా’... 


సభలో ఎవరేమి అనుకున్నా తనకి పట్టనట్టు, అసలు లెక్కేమీ లేనట్టు ఆమె నిర్భయంగా చెప్పదలుచుకున్నది చెబుతూ వెళుతోంది. భావ స్పష్టత, సూటిదనం, భాషా పటిమ, స్వరంలోని నిజాయతీ సభనంతా కట్టిపడేస్తున్నాయి. ఆమె ప్రసంగం ముగిసేసరికి సభ అంతా హర్షధ్వానాలతో దద్దరిల్లింది. ఆమె నలువైపులా చూసి నమస్కరించింది. అప్రయత్నంగా ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. తన చుట్టూ హర్షాతిరేకాలతో స్పందిస్తున్న సభికుల దృశ్యం కళ్లముందు అలుక్కుపోతున్నట్టుగా ఉంది. 


ఒక్క లిప్త... ఆమె కళ్ల ముందు సముద్రం ప్రత్యక్షమైంది. ఆకాశపు నీలాన్ని తనలో ఒంపుకున్న సముద్రం, ఎల్లలు తెలియని సముద్రం, అంతూదరీ లేని సముద్రం, తన చిన్నప్పుడు చూసిన, ఆడుకున్న సముద్రం... కుల భేదం లేని, తెలీని సముద్రం. ఎక్కడ మొదలైన ప్రయాణం ఎక్కడి వరకు వచ్చింది తను... 


ఆమె పేరే ధిక్కారం... 

అసలు తమ బిడ్డకి దాక్షాయణి అని పేరు పెట్టడమే కుంజన్‌ దంపతులు చేసిన అసాధారణమైన సాహసం. ఆ రోజుల్లో పులయల్లో, పరయల్లో దాక్షాయణి అని పేరు గలవాళ్లు ఎక్కడా లేరు. అటువంటి పేర్లు పైకులాల్లోనే కనిపిస్తాయి. అళకి, పూమాల, చక్కి, కాళి వంటివి కాకుండా ఒక దళిత తల్లితండ్రులు తమ కూతురికి దాక్షాయణి అనే పేరు పెట్టడం కచ్చితంగా ధిక్కార ప్రకటనే! 


దాక్షాయణి తల్లితండ్రులు ఆమెను ధైర్యంగా మూలపూకడ్‌లోని సెయింట్‌ మేరీస్‌ పాఠశాలలో చేర్పించారు. తల్లి ఆమెకి పైవస్త్రం వేసి స్కూల్‌కి పంపించింది. ఆ రకంగా ఆమె మలబార్‌ తీరంలోని పులయ సామాజిక వర్గంలో మొట్టమొదటి సారిగా పైవస్త్రం ధరించి పాఠశాలకు హాజరైన బాలికగా చరిత్ర సృష్టించింది. సహజంగానే పులయ బాలిక చదువుకోడానికి వచ్చినందుకు, అందునా పైవస్త్రం ధరించినందుకు అగ్రకులాల నుంచి తీవ్రమైన నిరసన ఎదురైంది. కానీ దాక్షాయణి ఆ నిరసనలకీ, బెదిరింపులకీ, దూషణలకీ బెదరలేదు. చిన్న వయసు నుంచీ ఆమె ఒకటే నేర్చుకుంది... దేనికీ భయపడకూడదని, దేనికీ తలవంచకూడదని! 


ఆ తరువాత దేశంలోనే డిగ్రీ కోర్సులో చేరిన తొలి దళిత మహిళగా దాక్షాయణి చరిత్ర సృష్టించింది. పట్టుబట్టి సైన్స్‌ గ్రూప్‌ను ఎంచుకుంది. ఆ రోజుల్లో ఒక మహిళకి అది అసాధారణమైన విషయం. కాలేజీలోనే సైన్స్‌ డిగ్రీ చదువుతున్న ఏకైక మహిళ. 

ఒక పులయ యువతి కాలేజీలో చేరిందనే విషయం కొచ్చి పట్టణంలో దావానంలా వ్యాపించింది. మేధావుల్లోనూ, అధికార గణంలోనూ, పాత్రికేయులు, ఉద్యమకారుల్లోనూ... అంతా సంచలనమే! 


బీఎస్సీ తరగతిలోకి ప్రవేశించడానికి దాక్షాయణి అష్టకష్టాలు పడింది. కెమిస్ర్టీ ల్యాబ్‌లో అగ్రకుల లెక్చరర్‌ ఆమెకు పాఠాలు చెప్పడానికి ఇష్టపడలేదు. ల్యాబ్‌లో పరికరాలను తాకనివ్వలేదు. అంటరానివారిగా అగ్రకుల అభిజాత్యాన్నే కాదు, మహిళగా పురుషాహంకారాన్నీ తట్టుకుని నిలబడాలి. ఆమెకు సవాళ్లు కొత్తేమీ కాదు. ఒక అడుగు వెనక్కి వేసైనా పదడుగులు ముందుకు పురోగమించాలనే మనస్తత్వం ఆమెది. డిగ్రీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ల్యాబ్‌ బయట నిలబడి పాఠాలు వినడానికి, దూరం నుంచే ఇతర విద్యార్థులు చేసే ప్రయోగాలు చూసి సరిపెట్టుకోవడానికి ఆమె ఒప్పుకుంది. తనకు ఎదురైన వివక్షకీ, అవమానానికీ దాక్షాయణి తన ప్రదర్శనతో ముఖం పగిలేలా జవాబిచ్చింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ మంచి మార్కులతో హయ్యర్‌ సెకండ్‌ క్లాస్‌లో పాసయింది. 1935లో... దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక దళిత మహిళ గ్రాడ్యుయేట్‌ కాగలిగింది. ఆ తరువాత ఉపాధ్యాయురాలిగానూ అదే వివక్ష ఎదుర్కొంది. గాంధీపథంలో నడిచి చట్టసభల్లోనూ దళిత గొంతుక వినిపించింది. వారి అభ్యున్నతికి పాటుపడింది. భారత రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొన్న ఏకైక దళిత మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె జీవితాన్ని కళ్లకు కడుతుంది.


‘దాక్షాయణి వేలాయుధన్‌’

రచయిత : విజయవిహారం రమణమూర్తి, 

వెల: రూ.200

ప్రతులకు ఫోన్‌ : 9848030089

Updated Date - 2021-06-17T08:17:05+05:30 IST