ప్రేమించి పెళ్లాడిన దళిత యువకుడికి దారుణ అవమానం.. ఆరుగురు అరెస్ట్...

ABN , First Publish Date - 2021-04-14T23:45:41+05:30 IST

భారతరత్న, దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి నాడే బీహార్‌లోని గయాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. ..

ప్రేమించి పెళ్లాడిన దళిత యువకుడికి దారుణ అవమానం.. ఆరుగురు అరెస్ట్...

గయా: భారతరత్న, దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి నాడే బీహార్‌లో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ దళిత యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు పంచాయితీ పెట్టిన గ్రామ పెద్దలు అతడిని దారుణంగా అవమానించారు. నేలపై ఉమ్మి వేసి ఆ ఉమ్మిని అతడితో బలవంతంగా నాకించారు.  మూత్రం సేవించాలంటూ అతడి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. గయాలోని వజీర్‌గంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. దీని తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమించినందుకు ‘‘శిక్షగా’’ పంచాయితీలో ఉన్న పలువురు వ్యక్తులు నేలపై ఉమ్మి వేయగా.. ఆ యువకుడు మోకాళ్లపై కూర్చుని ఉమ్మి నాకుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం మూత్రం తాగాలంటూ పంచాయితీ పెద్దలు అతడిని బలవంతం చేశారు.


17 ఏళ్ల బాధిత యువకుడు ఇటీవల తాను ప్రేమించిన యువతితో కలిసి పారిపోయి వివాహం చేసుకున్నాడు. అతడు తన తప్పును అంగీకరించినప్పటికీ యువతి తల్లిదండ్రులు ఆ జంటను పట్టుకుని పంచాయితీ పెట్టించారు. అతడికి శిక్ష విధించాల్సిందేనని పెద్దలు తీర్మానించడంతో.. పంచాయితీ సభ్యులు, సర్పించి ముందే ఆ దళిత యువకుడిని అమానుషంగా కొట్టి హింసించారు. కాగా ఈ ఘటనపై వీడియో వైరల్ కావడంతో గయా పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామనీ... ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని గయా ఎస్‌ఎస్పీ ఆదిత్య కుమార్ వెల్లడించారు. 

Updated Date - 2021-04-14T23:45:41+05:30 IST