‘దళిత, గిరిజన దండోరా’ను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-08-02T06:22:55+05:30 IST

ఇంద్రవెల్లిలో ఈ నెల 9న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడి ్డ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దళిత గిరిజన దండోరా బహిరంగ సభను విజయవంతం చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

‘దళిత, గిరిజన దండోరా’ను విజయవంతం చేయాలి
నాగోబా ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న సీతక్క

ఇంద్రవెల్లి, ఆగస్టు 1: ఇంద్రవెల్లిలో ఈ నెల 9న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడి ్డ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దళిత గిరిజన దండోరా బహిరంగ సభను విజయవంతం చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన కోసం ఆదివారం ఇంద్రవెల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సంపూర్ణంగా నెరవేర్చలేదని విమర్శించారు. ఇంద్ర వెల్లిలో నిర్వహించే సభకు దళితులు, ఆదివాసీలు తరలి రావాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్‌ రావ్‌తో కలిసి కేస్లాపూర్‌ నాగోబా దేవతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేస్లాపూర్‌ సర్పంచ్‌, మేస్రం రేణుక నాగ్‌నాథ్‌, ఆలయ పీఠాధిపతి మేస్రం వెంకట్రావ్‌ ఆధ్వర్యంలో శాలువతో సత్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. బహిరంగ సభస్థలాన్ని పరిశీలించారు. తదనంతరం కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందులో ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత, పార్టీ జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సురేఖ, ఆసిఫాబాద్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి చవాన్‌ భారత్‌, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్కబాపురావ్‌, గణేష్‌ పాల్గొన్నారు.

ఇంద్రవెల్లి నుంచే తిరుగుబాటు బావుట ఎగర వేస్తాం..

బోథ్‌: రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలతో కలిసి తిరుగుబాటు బావుట ఎగరవేస్తామని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. ఆదివారం బోథ్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమానికి హాజరైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉద్యమాల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్‌ నుంచే క్విట్‌ ఇండియా ఉద్యమం తరహాలో క్విట్‌ తెలంగాణ అన్న నినాదంతో ముందుకు పోతామన్నారు. కేసీఆర్‌ పాలన నుంచి పీడిత ప్రజలకు విముక్తి కలిగిస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పోడు భూములకు పట్టాలిస్తే ఈ ప్రభుత్వం ఏ ఒక్క ఆదివాసీకి కూడా అటవీ హక్కు పత్రాలు ఇవ్వలేదని విమర్శించారు.

ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలి..

బోథ్‌రూరల్‌: ఇంద్రవెల్లి సభను లక్షమంది పార్టీ కార్యకర్తలతో విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం బోథ్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బోథ్‌ నియోజక వర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష మందితో సభను ఏర్పాటు చేస్తున్నామని అందుకు కార్యకర్తలంతా తీవ్రంగా కృషి చేయాలన్నారు. సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రానున్నారన్నారు.  కార్యక్రమంలో మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పార్టీ అధ్యక్షులతో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క, తలమడుగు, బజార్‌హత్నూర్‌ జడ్పీటీసీలు, గండ్రత్‌ సుజాత, సిద్దిపేట నియోజక వర్గ ఇన్‌చార్జి భవానిరెడ్డి, బోథ్‌ ఎంపీటీసీలు కుర్మమహేందర్‌, రజీయాబేగం తదితరులున్నారు.

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే..

నేరడిగొండ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో  నిర్వహించనున్న దళిత దండోరాయాత్ర ఏర్పాట్ల పరిశీలను వెళ్తుండగా ఆదివారం ఇచ్చోడ మండల కేంద్రంలో బోథ్‌ నియోజక వర్గ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జాదవ్‌ వసంత్‌రావ్‌, మహిముద్‌ ఖాన్‌, నారాయణ రెడ్డి, భీంరెడ్డి, చౌహన్‌ కిషన్‌లు ఎమ్మెల్యే సీతక్కను శాలువాతో సన్మానించారు.

దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి..

గుడిహత్నూర్‌: దళితబంధును హుజురాబాద్‌లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. దండోర బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు ఇంద్రవెల్లికి వెళ్తున్న ఆమెకు గుడిహత్నూర్‌లో  కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ గుడిహత్నూర్‌ మండల అధ్యక్షుడు అంకతి రవీందర్‌, ఎంపీటీసీ అంకతి సవిత, నాయకులు బేర దేవన్న, బాలాజిపటేల్‌, మల్యాల కరుణాకర్‌, మహేందర్‌, జుబేర్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-08-02T06:22:55+05:30 IST