దళిత శ్రేయస్సు ‘జగన్మిథ్య’

ABN , First Publish Date - 2021-09-09T06:13:17+05:30 IST

దళితుల సంక్షేమమే లక్ష్యంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తే నేటి వైసీపీ ప్రభుత్వం వారిని అన్నివిధాల మోసం చేస్తోంది. తెలుగుదేశం పాలనలో 2018–19 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం రూ.14,367 కోట్లు కేటాయించి...

దళిత శ్రేయస్సు ‘జగన్మిథ్య’

దళితుల సంక్షేమమే లక్ష్యంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తే నేటి వైసీపీ ప్రభుత్వం వారిని అన్నివిధాల మోసం చేస్తోంది. తెలుగుదేశం పాలనలో 2018–19 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం రూ.14,367 కోట్లు కేటాయించి 90 శాతం నిధులు ఖర్చు చేశారు. వైసీపీ ప్రభుత్వం దళితులకు రాజ్యాంగపరంగా రావాల్సిన నిధులను సైతం పక్కదారి పట్టిస్తూ వారిని తమపై ఆధారపడేలా చేసుకుంటోంది. దళితులకు హక్కుగా రావాల్సిన వాటిని కూడా ముఖ్యమంత్రి జగన్ దయాదాక్షిణ్యలతో ఇస్తున్నట్లు వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇది ఆ పార్టీ సంకుచిత సంస్కృతికి అద్దం పడుతోంది.


ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో గత 21 నెలల్లో దళితులపై జరిగినన్ని దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. దళితులపై 150 దాడులు జరిగాయని అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన  Country Report on Human Rights Practices in India పేర్కొంది. రాష్ట్రంలో దళితులపై రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు.. శిరోముండనాలు, హత్యలు, వేధింపులు, దాడులు నిత్యకృత్యాలైనాయి. కరోనా పిపిఈ కిట్లు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను రెక్కలు విరిచి నడిరోడ్డుపై అవమానించారు. మానసికంగా వేధించి చంపారు. లిక్కర్ రేట్లు ప్రశ్నించిన చిత్తూరు జిల్లా దళిత యువకుడు ఓం ప్రతాప్ అనుమానస్పదంగా మృతిచెందాడు. అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించినందుకు వరప్రసాద్‌కు గుండు గీయించారు. మాస్కు పెట్టుకోలేదని చీరాల థామస్ పేటకు చెందిన దళిత యువకుడు కిరణ్‌ను పోలీసులు కొట్టి చంపారు. మెజిస్ట్రేట్ రామకృష్ణపై, అతడి సోదరుడు రామచంద్రపై దాడి చేశారు. పులివెందులలో దళితమహిళను అత్యాచారం చేసి, హత్య చేశారు. అమరావతిలో దళిత రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టి 18 రోజులు జైలుపాలు చేశారు. దళిత మహిళా డాక్టర్ అనితారాణిని వీడియోలు తీసి బెదిరించారు. కచ్చులూరు బోటు ప్రమాదంపై ప్రశ్నించినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్‌పై అక్రమ కేసులు బనాయించారు. దళితుల అసైన్డు భూములు లాక్కోవడాన్ని ప్రశ్నించిన మహాసేన రాజేష్‌పై అక్రమ కేసులు పెట్టారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో వైసీపీకి చెందిన నూతన్ నాయుడు, అతని భార్య కలిసి దళిత యువకుడు పర్రి శ్రీకాంత్‌ను ఇనుప కడ్డీలతో కొట్టి శిరోముండనం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడే దళిత విద్యార్ధిని రమ్య హత్య జరిగినా దిశ చట్టాన్ని అమలు చేయలేకపోయారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చింది తమ సొంత సామాజికవర్గం మహిళల కోసమన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి రాష్ట్రంలో 425మంది మహిళలపై దాడులు జరిగినా, చట్టంలో పేర్కొన్నట్లు 21 రోజుల్లో ఒక్కరికి కూడా న్యాయం చేయలేకపోయారు. దళితులపై దమనకాండ సాగిస్తున్నా అధికారపార్టీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.


అంబేడ్కర్ విదేశీ విద్యోన్నతి పథకం కింద గతంలో, విదేశాల్లో విద్యనభ్యసించే 440 మందికి రూ.10లక్షల చొప్పున రూ.44 కోట్ల ఆర్థికసాయం అందించాం. భూమి కొనుగోలు కార్యక్రమం కింద రూ.135 కోట్లతో 3000 ఎకరాలు కొనుగోలు చేసి. 1606 మంది మహిళలను యజమానులుగా మార్చాం. మరి జగన్ సర్కార్ ఏమి చేసింది? ఇళ్ల పట్టాల పేరుతో 5000 ఎకరాల అసైన్డ్ భూముల్ని లాక్కున్నారు. తెలుగుదేశం హయాంలో లిడ్ క్యాప్‌కు 2500 ఎకరాల భూమిని కేటాయించి, ప్రత్యేక బడ్జెట్‌తో చర్మకారులను ఆదుకుంటే జగన్‌రెడ్డి.. ఆ భూముల్ని కూడా లాక్కుని, బడ్జెట్ కేటాయించకుండా నిర్వీర్యం చేశారు. ఎస్సీలకు రుణ సదుపాయం, వ్యవసాయ భూముల కొనుగోలు, బోర్‌వెల్స్‌, ట్యూబ్‌వెల్స్‌, సబ్‌మెర్సిబుల్‌ పంపుసెట్లు, పైపులైన్లు, పాడి పశువులు, చిన్న నీటిపారుదల పథకాల విద్యుదీకరణ, నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టి ఎస్సీలను ప్రోత్సహించాం. దళితుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి అమరావతిలో రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, 10వేల పుస్తకాలతో లైబ్రరీ, పార్కుతో కూడిన అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. జగన్‌రెడ్డి సర్కార్ ఆ స్మృతి వనాన్ని నాశనం చేసింది!


తెలుగుదేశం పాలనలో బెస్ట్ అవైలబుల్స్ స్కూల్స్ ద్వారా ఐదేళ్లలో లక్షమంది మంది ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన, కార్పొరేట్ విద్యను అందిస్తే అలాంటి మహోన్నతమైన పథకాన్ని జగన్ రెడ్డి రద్దు చేసి.. ఎస్సీలకు కార్పొరేట్ విద్యను దూరం చేశారు. పరిశ్రమల స్థాపనకు భారీ రాయితీలతో పాటు కాంట్రాక్టు పనులలో 5 కోట్ల వరకు దళిత పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చాం. ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలకు ఒక్కో విద్యార్ధికి రూ.1.25 లక్షల వరకు వారు కోరుకున్న కేంద్రంలో శిక్షణ ఇప్పించాం. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ శిక్షణ కార్యక్రమాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. భూమి కొనుగోలు పథకాన్ని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను రద్దు చేశారు. కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు చేశారు. అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం, ఎస్సీ–ఎస్టీ కార్పొరేషన్స్ ద్వారా బ్యాంకు లింక్ లోన్లు, ఏపీ స్టడీ సర్కిల్స్, అంబేడ్కర్ స్టడీ సర్కిల్ సెంటర్స్ రద్దు, బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు చేశారు. స్టడీ లీవుల పూర్వస్థితిని మార్చివేశారు. రూ.9వేల కోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు బదలాయింపు చేశారు. సెంటు పట్టా కోసం 10,000 ఎకరాల ఎస్సీ–ఎస్టీ అసైన్డ్ భూముల్ని లాగేసుకున్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా కన్వీనర్ కోటా మినహాయించి ఏ ఇతర కోర్సులకు ఉపకార వేతనాలు ఉండవని జి.ఓ 77 ఇచ్చి విద్యార్థులను మోసం చేశారు. ఎస్సీ–ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్స్‌లో కారుణ్య నియామకాలను భర్తీ చేయడం లేదు.


దళితుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ సొంత వారిపైనే కేసులు పెట్టేలా దళితులను ఉసిగొలుపుతున్న జగన్ సర్కార్ దళిత సమాజానికి చాలా ప్రమాదకరంగా మారింది. పోలీసు వ్యవస్థను సైతం పూర్తిగా తన హస్తగతం చేసుకుని దళిత కులాలకు చెందిన వారిపై విరుచుకుపడి దాడులు చేస్తున్న వారికే రక్షణ కల్పిస్తున్నారు. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదు. దళితుల ఓట్లతో అధికారం చేపట్టి వారిని మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని సాగపంపకపోతే దళితులకు భవిష్యత్తు ఉండదు. మేధావులు, సామాజిక ఉద్యమకారులు ఆలోచించి జగన్ ప్రభుత్వంపై పోరాటం చేయాలి.

దేవతోటి నాగరాజు

Updated Date - 2021-09-09T06:13:17+05:30 IST