Abn logo
Oct 4 2021 @ 00:16AM

‘‘దళిత రచయిత కార్యకర్త కూడా కాగలగాలి!’’

శరణ కుమార లింబాళె విశ్వవిఖ్యాత మరాఠీ రచయిత. దళితుల, అట్టడుగు వర్గాల ప్రజల జీవిత సంఘర్షణ కథా వస్తువుగా రచనలు చేశారు. ఆయన రచనాయాత్ర 1982లో ప్రచురితమైన ‘ఉత్పాత’ కవిత సంకల నంతో మొదలయింది. లింబాళె ఆత్మకథ ‘అక్కరమాశి’ (అక్రమ సంతానం) 1984లో వెలువడింది. ఆ పుస్తకం ఎన్నో భారతీయ భాషల్లోకి అనువాదమై రచయితకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చింది. లింబాళె రచనలు- బారామాశి, హరిజన, దళిత బ్రాహ్మణ కథాసంకలనాలు; ఉపల్యా, బహుజన, సనాతన, రామరాజ్య, హిందూ నవలలు ఆయనకు గొప్ప కీర్తి సంపాదించిపెట్టాయి. ఆయన మరాఠీ సాహిత్యానికి హేతుబద్ధత సంతరించి పెట్టిన ఘనుడు. లింబాళె తన తీవ్రమైన, వివాదాస్పదమైన అభిప్రాయాలతో మరాఠీ సాహిత్య ప్రపంచంలో గొప్ప సంచలనాన్నే సృష్టించారు. ఆయన రచనలు దేశ విదేశీ భాషల్లోకి అనువదింపబడి ఆయన్ను అంతర్జాతీయ రచయితగా నిలబెట్టాయి. ‘సనాతన’ నవల 2018లో ప్రచురితమైంది. ఈ నవలకు ఇటీవల జాతీయ స్థాయి ‘సరస్వతీ సమ్మాన్‌’ బహుమతి లభించింది. ఈ సందర్భంగా ఆయనను ప్రసిద్ధ కన్నడ అనువాదకులు చంద్రకాంత పోకళె ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూకు నేను చేసిన తెలుగు అనువాదం ఇది. 

ఘట్టమరాజు

మీరు రాసిన ‘సనాతన’ నవలకు అఖిల భారతీయ ‘సరస్వతీ సమ్మాన్‌’ లభించటంపై ఎలా స్పందిస్తారు? 

‘సనాతన’ నవల 2018లో అచ్చ యింది. సరిగ్గా 200సంవత్సరాల క్రితం మహారాష్ట్ర లోని భీమా కోరేగావ్‌ పోరాటం జరిగిన కాలమది. ‘సనాతనం’ అన్న పేరు వింటేనే కొందరికి చెమటలు పడ్తాయి. మహా రాష్ట్రలోని కొందరు బుద్ధి జీవులకు కంపరం పుట్టించే సందర్భమది. మరాఠీ సాహిత్య ప్రపంచానికి ‘సనాతన’ నవల కథా వస్తువు సరి కొత్తది. ఈ నవలలో చరిత్ర, ఫాంటసీల సుందర సమ్మేళనం వుంది. ఓ మరాఠీ దళిత రచయి తకు ‘సరస్వతీ సమ్మాన్‌’ లాంటిజాతీయ పురస్కారం లభించడంతో మరాఠీ సాహిత్య ప్రపంచంలో కలకలమే చెలరేగింది. ఓ మరాఠీ దళిత రచయిత భారతీయ భాషల్లోని ప్రఖ్యాత రచయితలతో పోటిపడి నెగ్గుకు రావడం, ప్రతిభావంత జాతీయ రచయితల స్థాయికి చేరుకోవడం... నా కెంతో గర్వంగా వుందంటాను. 


మీరు కొన్ని దేశాలు తిరిగారు. దళిత దృక్పథంలో ప్రపంచాన్ని పరిశీలి స్తున్నారు. ఇతర దేశ సాహిత్యాలకు మన దేశీయ భాషల సాహిత్యానికి ఏమైనా వ్యత్యాసం కనిపించిందా? 

నేను రచనలు చేయడం మొదలు పెట్టిన తొలి రోజుల్లో మహారాష్ట్రలోని ‘మహార్‌’ జాతి జనుల కష్టకార్పణ్యాల్ని చిత్రించాను. ఆనాటి నా రచనలు ఒక జాతి లేదా మరాఠీలోని ఓ దళిత శాఖకు మాత్రమే పరిమితమై వున్నాయి. 


ఉదాహరణానికి తెల్లవారు ఆస్ట్రేలియా దేశానికి పోయి, అక్కడి స్థానీయుల భూముల్ని ఆక్రమించుకోగా వాళ్లు ఇతర దేశాలకు పారిపోయారు. ఆస్ట్రేలియా దేశ మూలవాసులకు, మన దేశ ప్రజల స్థితికి సమానత్వ ముందనిపించింది. ఇది అమెరికాకూ వర్తిస్తుంది. సమస్యలు భిన్నంగా వుండొచ్చు. పరిస్థితులు ఒకటే. అక్కడి మూల నివాసుల, మన దేశ ఆదిమతెగల వ్యథలూ ఒకటే. అమెరికా దేశంలోని నల్లజాతి జనులు చేసిన ఆందోళన, అక్కడి రాజకీయ క్షేత్రంపై తీవ్రమైన ప్రభావం కలిగించింది. మేం కూడా ఆ నల్లజాతి జనుల ఉద్యమం వల్ల ప్రభావితులం అయ్యాం. మాకూ, వాళ్లకూ సంబంధాలున్నాయి. 


మీ కాలంలో సోషల్‌ నెట్‌వర్క్‌ లేదు. ప్రజలను చేరటానికి అప్పట్లో ఏం చేసేవారు? 

అదో విచిత్రమైన కాలం. ఆ రోజుల్లో మా రాతకోతల్ని అస్పృశ్య సాహిత్య మనే పిలిచేవారు. మా సాహిత్యాన్ని ముద్రించేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. ‘‘ఇదేం సాహిత్యం?’’ అని పాఠకులు ఈసడించుకునేవారు. మా సాహిత్యాన్ని మేమే కష్టపడి అచ్చు వేసుకునేవాళ్లం. కొంతమంది భార్యల మంగళసూత్రాల్ని అమ్మి తమ రచనలు ప్రచురించుకున్నారు. మరికొంతమంది అప్పోసప్పో చేసి పుస్తకాలు అచ్చేసుకున్నారు. మరాఠీ సాహిత్య సమ్మేళనాలు మమ్మల్ని దగ్గరకు రానీయలేదు. ఇదో చెత్త సాహిత్యమన్నారు. మేం అప్పు డప్పుడే సాహిత్య క్షేత్రంలోకి కాలు మోపుతున్నాం అని కరుణించలేదు. సుమారు ఇరవై ఏళ్ల పాటు మా సాహిత్యం అస్పృశ్య సాహిత్యంగానే వుండిపోయింది. మేం కూడా అంటరానివాళ్లలాగానే వుండిపోయాం. ఇప్పుడు మాకు మర్యాదలూ, గుర్తింపులూ వస్తున్నాయి. సాహిత్య వేత్తలు మమ్మల్ని కూడా రచయితలుగా గుర్తిస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో మా రచనలకు కూడా స్థానం లభిస్తూంది. ఒకవేళ దళితులైన మేం రచనలే చేయకుండా ఉండివుంటే మా గోడు ఎవరికీ తెలిసేది కాదు. మా జీవితాల్లో ఎలాంటి మార్పూ వచ్చేది కాదు. మా రచనల వల్ల సమాజానికి మా కష్టనష్టాలు, పాట్లు తెలుస్తున్నాయి. దళిత సాహిత్యం వల్ల సాహిత్య భాష, వస్తువు మారాయి. సాహిత్య స్వరూపం కూడా మారింది. 


1970-80 మధ్య కాలంలో మీరు సృష్టించిన దళిత సాహిత్యానికీ, నేడు వెలువడుతున్న సాహిత్యానికీ ఏమైనా తేడా కనపడుతున్నదంటారా? 

చాలా తేడా కనబడుతుంది. ప్రస్తుతం మరాఠీ దళిత సాహిత్యం బాగా వికసించింది. నేటి దళిత రచయితల దృష్టి విశాలమయింది. మేం రచనలు చేసేటప్పుడు అది దళిత సాహిత్య ప్రారంభ కాలం. మా గోడు సమాజానికి వినిపించాలన్నదే మా ఆశయమై వుండింది. మా వ్యథను పదిమందికీ చెప్పా లన్నదే మా ఉద్దేశమై వుండింది. ఇరవయ్యేళ్లదాకా ప్రపంచం మా బాధలు విని, మా సమస్యలకు పరిష్కారమార్గం చూపిస్తే చాలన్నదే మా ధ్యేయంగా వుండింది. మా కష్టాలు కొంతవరకైనా తీరితే చాలని మేం ఆశించాం. ఇది దళిత సాహిత్య ఆరంభ కాలంనాటి మా లక్ష్యం. దీన్ని దళిత సాహిత్యం మొదటి దశ అని పిలవొచ్చు. రెండోదశలో మేం మానవ హక్కుల గురించి మాట్లాడాం. మా హక్కుల గురించి రచనలు చేశాం, పోరాడాం. పౌర హక్కులు మాకు లభించాలని ఉద్యమించాం. దళిత రచయితలు కూడా తమ రచనల ద్వారా ‘మేరా భారత్‌ మహాన్‌’ అని చాటొచ్చని ఘోషించాం. మన దేశం ముఖం మీద ఇంకా మాయని జాతి పెద్దపెద్ద మచ్చలు కనబడుతున్నాయి. ఈ కళంకాన్ని పూర్తిగా తుడిచి వేసినప్పుడే మన దేశం నిజంగా ‘మేరా భారత్‌ మహన్‌’ అవుతుంది. అందరూ కలిసి కృషి చేస్తేనే కాని ఈ మచ్చ తొలిగిపోదు. దేశం లోని ప్రజలందరు సమానులైనప్పుడే ఈ దేశం బాగుపడుతుంది.


ఈ ఇంటర్‌నెట్‌ యుగంలో దళిత సాహిత్యంలో ఎలాంటి మార్పులు రావాలని ఆశిస్తారు? 

ఇంటర్నెట్‌ మాకు చాలా సౌకర్యాలు ప్రసాదించింది. తరతరాలుగా వెనుకబడి వున్న మాకు ఇదొక గొప్పవరమే. మా అభిప్రాయాల్ని వెల్లడించడానికి మేమి ప్పుడు ఏ సాహిత్య సమ్మేళన మహాసభల్నీ, బడాబడా అధికారుల్నీ ఆశ్రయించ నక్కర్లేదు. పుస్తకాలు రాసి కష్టపడాల్సిన పని లేదు. ఇంటర్నెట్‌ ద్వారా మా అభిప్రాయాల్నీ, ఆలోచనల్నీ రెప్పపాటులో ప్రపంచంలోని ఏ మూలకైనా చేర వేయవచ్చు. ఇప్పుడు క్షణాల్లో మా రచనలు ఏడు సముద్రాలు దాటి పాఠకులకు అందుతాయి. దూరదేశాల్లో వున్న మా పాఠకులు మా రచనల్ని వెంటనే చదివి, మా బాధల గాథల్ని అర్థం చేసుకోగలుగుతారు. మేం పత్రికా సంపాదకుల్ని ‘‘మా రచనలు ప్రచురించండి మహాప్రభో!’’ అర్థించాల్సిన పని లేదు. స్పందన - ప్రతి స్పందనలు వెనువెంటనే జరిగిపోతాయి. ఇంట్లో ఓ మూల కూర్చొని వెబినార్ల ద్వారా మా అభిప్రాయాల్ని ముఖాముఖి పాఠకులతో, పండితులతో పంచుకోవచ్చు. ఎన్నో ఏండ్లుపూండ్లుగా లేని ఈ హక్కు ప్రసాదించింది ఈ ఇంటర్నెట్టే! జగత్తులోని ఏ దేశ, ప్రాంత సాహిత్యం గురించైనా తెలుసుకునే సదవకాశం లభించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తూ వుంది; ఆంగ్లేయులు మాకు విముక్తి తలుపులు తెరిచారు. బయటి సాహిత్య సంస్కృతులు తెలుసుకోవడం వల్లనే మా జీవితాలు మారాయి, మారుతున్నాయి కూడా. 


మీ ఆత్మకథ ‘అక్రమ సంతానం’ అనేక భాషల్లోకి అనువాదం కావటం ద్వారా మీ పేరు దేశమంతటా వ్యాపించింది (తెలుగు అనువాదం: రంగనాథ రామచంద్ర రావు).  దీని గురించి మీరేమంటారు? 

నేను నా మాతృభాష మరాఠీలో మాత్రమే రాసివుంటే, నన్నీ సమాజం ఏనాడో తొక్కివేసి వుండేది. నా ఆత్మకథ ఎన్నెన్నో భాషల్లోకి అనువాదం కావటం వల్ల నా పేరు దూరదూర ప్రాంతాలకు, దేశాలకు వ్యాపించగలిగింది. ప్రపంచంలోని దళితులందర్లోనూ జాగృతి కలిగింది. 


మరాఠీ దళిత ఆత్మకథల యుగం ముగిసిందంటారా? 

లేదు. లేనేలేదు. దళిత ఆత్మకథల కాలం ముగియ లేదు. ‘ఆత్మకథ’ అంటే దళిత సాహిత్యం ఆత్మ కిందే లెక్క. దళిత ఆత్మకథలకు పాఠకుల్లో అభిరుచి ఏర్పడటం వల్లా, విద్యా లోకంలో గౌరవం కలగటం వల్లా, ఎంతో మంది ఆత్మకథలు రాసుకోవటం మొదలెట్టారు. ముఖ్యంగా స్త్రీవాద రచయిత్రులు ఈ రంగంలో ఎక్కువగా రాస్తున్నారు. ఇది దళిత ఆత్మకథల విజయమే.


మీ ‘సనాతన’ నవలలో భీమా-కోరేగావ్‌ చారిత్రక నేపథ్యంలో దళితుల- ఆదివాసీల, ముస్లిములు-బ్రాహ్మణుల-క్రైస్తవుల సాంస్కృతిక సంఘర్షణ చిత్రించారు. ఈ నవల రాయడంలో మీ ఉద్దేశ్య మేమిటి? 

‘సనాతన’ నవల రాసేటప్పుడు మహార్‌ జాతి-భీమా కోరేగావ్‌ పోరాటం మాత్రమే నా కళ్ల ముందు నిలిచాయి రాస్తూ రాస్తూ ఆదివాసీ తెగలు, ముస్లిం, బ్రాహ్మణ జాతులు కూడా కథా వస్తువులో చేరుకున్నాయి. దళితులు- ఆదివాసీలు వొకటి కావాలని నా అభిలాష. ఆ రెండు జాతులవారూ భాష, సంస్కృతి రీత్యా వేరే వేరే అయినా, ఈ రెంటినీ కలిపి చిత్రిస్తే బాగుంటుందని నా కనిపించింది. ఓడిపోయినవాళ్లంతా జతకూడి పీడించేవాళ్లకు వ్యతిరేకంగా పోరాడాలని నా కోరిక సమాజంలో అన్నివిధాలా నిరాదరణ పాలైన వాళ్లందరూ ఒకటై సమాజ ప్రధాన స్రవంతిలో చేరాలని నా అభిమతం.


దళిత సాహిత్యంలో ‘రూపం’ కంటే ఆశయం-లక్ష్యం-సందేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. శిల్పం రీత్యా ఇది సరైనదేనంటారా? 

కళాత్మక సాహిత్యంలో రూపానికి ప్రముఖ స్థానం ఇస్తారు. కాని దళిత సాహిత్యం జీవితవాద ప్రాముఖ్యం కలది. పాఠకుల మనస్సుల్లో రచన ఆశయం ద్వారా మార్పు సంభవిస్తుంది. సహృదయులు ప్రపంచపు పోకడల్ని, సమాజంలో బతికే విధానాన్ని సాహిత్యం చదవడం ద్వారా పెంపొందించు కుంటారు. రచయిత లక్ష్యంలో, ఆశయంలో జీవితం ప్రతిబింబిస్తుంది. అందు వల్ల రచయిత ఆశయం గొప్పది, అనుసరణీయమైనదీ అని నా అభిప్రాయం. దళిత సాహిత్య స్వరూపం భిన్నమైనది. విప్లవ సాహిత్యం ఎప్పుడూ కళా త్మకంగా వుండలేదు. వుండదు. దళిత సాహిత్యం సంప్రదాయ సాహిత్యాన్ని చిన్నా భిన్నం చేసి కొత్త రూపాల్ని సృష్టిస్తుంది. 


దళిత సాహిత్యానికి ప్రత్యేకమైన విమర్శ వుండాలా? 

దళిత సాహిత్య విమర్శ తప్పనిసరిగా వేరే విధంగానే వుంటుంది. వ్యవస్థ స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకుంటే కాని దళిత జీవితాన్ని, దళిత సాహిత్యాన్ని తెలుసుకోలేం. దళిత సాహిత్యం కేవలం సాహిత్యం కాదు. దళిత రచయిత కార్యకర్త కూడా అయివుంటాడు. సమాజస్వరూపాన్ని మార్చడం, తీర్చిదిద్దడమే లక్ష్యంగా దళిత సాహిత్యం పుట్టుకొస్తుంది. దళిత సాహిత్యాన్ని సమాజ శాస్త్ర దృక్పథంతో అధ్యయనం చేయాలి, అనుశీలనం చేయాలి, విమర్శించాలి. కళావాద లేదా శిల్పవాద సిద్ధాంతాల ఆధారంగా దళిత సాహిత్యాన్ని పరిశీలించ రాదు. సంప్రదాయ సాహిత్య సిద్ధాంతాల్ని అన్వయించి దళిత సాహిత్యాన్ని విమర్శించరాదు. అలా చేస్తే దళిత సాహిత్యానికి అన్యాయం చేసినట్లవుతుంది. జాతి, కులం, అభిరుచుల కారణంగా దళిత సాహిత్యానికి న్యాయం చేయ కూడదు. Taste is the product of caste. దళిత సాహిత్యాన్ని మానవ హక్కుల నేపథ్యంలో పరిశీలించాలి. 


నిర్లిప్తత, ఆక్రోశం దళిత సాహిత్యం ప్రముఖ లక్షణాలని కొందరు భావిస్తారు. వీటిలో ఏది ముఖ్యమంటారు?

దళిత సాహిత్యం నిర్లిప్తంగా వుండదు, తటస్థంగా అసలే వుండజాలదు. దళిత రచయితలు తమయందు ఓ నిర్దిష్టమైన గురి వుంచుకొని రచనలు చేస్తుం టారు. దళిత రచయిత కార్యకర్తగా కూడా వుండటం వల్ల అతనిలో సాహిత్య నిబద్ధత వుండి తీరుతుంది. దళితుల మీద దౌర్జన్య కాండలు జరుగుతుండటం వల్ల అతను తటస్థుడుగా వుండేందుకు వీలే లేదు. అతను దళితుల, పీడితుల పక్షం వహించి రచనలు చేస్తాడు. దళిత సాహిత్యంలో వాళ్ల ఆక్రోశం బయలు పడుతుంది. వ్యక్తమవుతుంది. రాబోయే రోజుల్లో దళిత సాహిత్యం కారణంగా భారతీయ సాహిత్య స్వరూపమే మారగలదని నా ఆశ, ఆకాంక్ష.


‘దళిత సాహిత్యం’ అనే ముద్ర లేదా లేబిల్‌ అవసరమంటారా? 

దళిత సాహిత్య రూపురేఖలు, రచనా విధానాలు సంప్రదాయ సాహిత్యం కంటె వేరేగా వుంటాయి. దళితులు వూరికి దూరంగా వుంటారు. సవర్ణులు నివసించే ప్రదేశంలో దళితులకు చోటు లభించదు. అతను దేవాలయాల్లోకి రాకూడదు. అందరితో సమానంగా తిరిగే హక్కులేదతనికి. మన సంఘంలో ఎంతవరకు ఈ అంటరానితనమనే రోగం నిర్మూలన కాదో, దళితుడు ఎందాకా అందరితో సమానంగా తలెత్తుకు తిరగలేడో, అందాకా దళిత సాహిత్యం విడిగానే వుంటుంది.