ఆశల ‘బంధు’

ABN , First Publish Date - 2022-01-23T06:03:44+05:30 IST

ఆశల ‘బంధు’

ఆశల ‘బంధు’

ఫిబ్రవరి 5లోగా ‘దళితబంధు’ జాబితా రెడీ!

 ఎంపిక ప్రక్రియపై ప్రభుత్వ ఆదేశాలు జారీ

 కలెక్టర్లకు సూచనలు చేసిన మంత్రి కొప్పుల

 నియోజకవర్గానికి వంద కుటుంబాల  చొప్పున లబ్ధి 

 హర్షం వ్యక్తం చేస్తున్న దళిత కుటుంబాలు 

 (ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

‘దళితబంధు’పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా  ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఏడాది ఆగస్టు 16న కరీంనగర్‌ జిల్లా హుజూ రాబాద్‌ నియోజవర్గంలో  పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే..  ఉప ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తాత్కాలికంగా దీనికి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత యధావిధిగా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మూడు నెలల అనంతరం మళ్లీ ఇప్పుడు కదిలిక వచ్చింది. ఫిబ్రవరి 5లోగా  లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశించటంతో దళితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 

దళితుల అభ్యున్నతి కోసం దళిత్‌ ఎంపవర్‌మెం ట్‌ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  వ్యవసాయం, సాగునీటి రంగాలతో పాటు స్వయం ఉపా ధి, వ్యాపారం కోసం దీని  నిధులు వినియోగించుకోనున్నారు. దళారుల బెడద లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే దళితబంధు సొమ్ము మొత్తాన్ని జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఈ పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వమే ఆయా రంగాల్లో  శిక్షణ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో దళిత కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మూడెకరాల భూ పంపిణీకి బ్రేకులు పడుతున్న నేపథ్యంలో దళితబంధు పథకంతో తమకు కొంత మేరకైనా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.

అటకెక్కిన ‘మూడెకరాలు’ 

నిరుపేద దళితుల సంక్షేమానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ జయంతి పురస్కరించుకుని 2016 ఏప్రిల్‌ 14న దళితులకు మూడెకరాల భూ పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2016-17లో ఈ పథకం ప్రారంభమైంది. దీంతో అప్పటి ఉమ్మడి భూపాలపల్లి జిల్లాలోని 20 మండలాల నుంచి 350 మందికి వెయ్యి ఎకరాలకు పైగా భూమిని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా రు. అయితే.. అదే ఏడాది కొత్త జిల్లాలు ఏర్పాటు కావటంతో అధికారుల పని విభజన, వర్క్‌ టు ఆర్డ ర్‌ తదితర కాణాల వల్ల 2016-17లో 56.13 ఎకరాల భూమిని మాత్రమే దళితులకు పంపిణీ చేశారు.  2018-19లో ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం నల్లగుంటలో 147.8 ఎకరాల భూమిని 46 మంది రైతులకు పంపిణీ చేశారు. 2019-2020లో రెండు జిల్లాల్లో 530 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ఆచరణలో సాధ్యం కాలేదు. 2020-21లో 500 ఎకరాలు, 2021-22లో 800 ఎకరాల భూమిని సేకరించి భూ పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని అధికారులు చేరుకోలేకపోతున్నారు. ఇలా మొత్తంగా ఐదు విడతల్లో 500 ఎకరాల భూమిని కూడా దళితులకు పంపిణీ చేయలేకపోయారు. దీంతో మూడెకరాల భూ పంపిణీ పథకం  అటకెక్కింది.  

మార్చిలోగా లబ్ధి...

దళితబంధు పఽథకానికి హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కోడ్‌ అడ్డుగా వచ్చింది. దీంతో తాత్కాలికంగా దీన్ని నిలిపి వేశారు. అయితే ఎన్నిక తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిం ది.  ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు కావ స్తున్నా ఇప్పటి వరకు లబ్ధిదారులకు దళితబంఽధు డబ్బులు చేతికి అందటం లేదు. శిక్షణ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. ఉప ఎన్నిక ఫలితం అధికార పార్టీకి అనుకూలంగా రాకపోవటంతో దళితబంధు పథకానికి బ్రేకు లు పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో హుజూరాబాద్‌లో పురుడు పోసుకున్న ఈ పథకం తమకు ఎప్పుడు వర్తిస్తుందా..? అని  దళిత కుటుంబాలు ఆశ గా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం దళితబంధు పథకం అమలుపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కలెక్టర్లతో సమీక్షించా రు. ఫిబ్రవరి 5లోగా నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఎంపిక చేసి, మార్చి 7లోగా లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో దళిత కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది.  

లబ్ధిదారుల ఎంపిక సవాలే...

వెనుబడిన భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 2,31,133 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 7,23,299 జనాభాలో ఎస్సీలు 1,48,025 మంది ఉన్నారు. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలతో పాటు మంథని, భద్రాచలం నియోజకవర్గాలు కూడా సగానికి పైగా కలిసి ఈ రెండు జిల్లాల్లో ఉన్నాయి. దీం తో సుమారుగా 300 దళిత కుటంబాలకు ఈ పథకం వర్తించే అవకాశం ఉంది. ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఏదో ఒక ఉపాధి లభించనుంది. అయితే.. ప్రతి నియోజకవర్గం నుంచి  వంద మంది లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంది. రెండు జిల్లాల్లో సుమారు 30 వేలకు పైగా దళిత కుటుంబాలు ఉండగా.. 300 మందికి కూడా ప్రయోజనం చేకూరే పరిస్థితి లేదు. దీం తో పాటు రెండు జిల్లాలు కూ డా పూర్తిగా వె నుకబడిన వే కావటంతో 90శా   తం ని రుపేదలే ఉన్నారు. దీంతో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు సవాల్‌గా మారనుంది. ఏ ప్రతిపాదికన లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ మిగతా  వారి నుంచి ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉంది. అధికార పార్టీ నే తలు, ప్రజాప్రతినిధులు తమ వారికే పథకాన్ని ఇప్పించుకునేందుకు ప్రయత్నించే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి.  దీంతో అధికారులకు లబ్ధిదారుల ఎంపికపై అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.  ప్రతి దళిత కుటుంబానికీ లబ్ధి చేకూరేలా ప్రభుత్వం దృష్టిపెట్టాలని దళతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-01-23T06:03:44+05:30 IST