రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-10-23T06:09:46+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం దళితబంధును హుజూరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలి
హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు

 - కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు

హుజూరాబాద్‌, అక్టోబరు 22: తెలంగాణ ప్రభుత్వం దళితబంధును హుజూరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితబంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడంతో పాటు బీసీలకు, మైనార్టీలకు కూడా లబ్ధి చేకూర్చాలన్నారు. తెలంగాణ ఇస్తే సోనియాగాంధీ కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకుంటానని అప్పుడు ప్రగల్బాలు పలికి, ముఖ్యమంత్రి పదవి గొప్ప కాదని, తెలంగాణ ఇస్తే చాలు అని అన్న కేసీఆర్‌ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తున్నారన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలు పెంచి సామాన్యుడిపై పెను భారం మోపుతున్నదన్నారు. ఈటల రాజేందర్‌కు మంచి పేరు ఉంది కానీ బీజేపీలోకి ఎందుకు వెళ్లాడో తెలియడం లేదన్నారు. ఈటల రాజేందర్‌ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావడానికి కారణమైన వ్యక్తి ఈటల అన్నారు. ఈటలకు అన్యాయం జరిగిందని, బీజేపీలో చేరకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే బాగుండని, నిత్యావసర ధరలు పెంచిన బీజేపీ చేరాల్సింది కాదన్నారు. బీజేపీ వాళ్లు ఓట్ల కోసం వస్తే నిత్యావసర ధరలు పెంచినందుకు వారిని నిలదీసీ అడగాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకు పెట్టాల్సిన పేర్లను వైన్స్‌ షాపులకు పెడుతున్నారన్నారు. నిత్యావసర ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ విదేశాలు తిరుగడం ఏమిటని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు మల్లు రవి, పొన్నం ప్రభాకర్‌, జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, నాయకులు కొల్లూరి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T06:09:46+05:30 IST