16 నుంచి దళిత బంధు

ABN , First Publish Date - 2021-08-02T07:05:13+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘దళిత బంధు’ పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ నెల 16న ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది.

16 నుంచి దళిత బంధు

హుజూరాబాద్‌లో ప్రారంభం

యూనిట్‌ పెట్టుకోవడానికి 10 లక్షల సాయం

సమూహంగా పెద్ద యూనిట్‌ పెట్టుకున్నా ఓకే

దళిత బంధుకు చట్టబద్ధత.. ప్రత్యేక చట్టం

జిల్లాకో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ ప్రైజ్‌ ఏర్పాటు

దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకే

సిద్ధంగా ఉండాలని అధికార్లకు కేబినెట్‌ ఆదేశం

గిరిజనుల కన్నా దయనీయ స్థితిలో దళితులు

రెక్కల కష్టం తప్ప ఇతర ఆస్తుల్లేని దైన్యం: కేసీఆర్‌


హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘దళిత బంధు’ పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ నెల 16న ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. అందుకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ఆదేశించింది. ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం.. దళిత బంధు పథకం అమలు, విధివిధానాల రూపకల్పనపై విస్తృతంగా చర్చించింది. తొలుత దళిత బంధు పథకం పూర్వాపరాలను సీఎం కేసీఆర్‌ విశదీకరించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఫలితాలు ప్రజల అనుభవంలోఉన్నాయని చెప్పారు.


గ్రామాల్లో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తోందని, పల్లె ప్రగతి వల్ల మౌలిక వసతుల కల్పన జరిగి, గ్రామీణ జీవితం ఆహ్లాదంగా మారిందని అన్నారు. ఇందుకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందనీయులని కితాబిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో విచ్ఛిన్నమైన వృత్తిపనుల వారి జీవితాలను నిలబెట్టే ప్రయత్నం చేశామని సీఎం తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే ప్రణాళికలు అమలు చేస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వృత్తి పనులు చేసుకునేవారి ఆదాయాలు మెరుగుపడేందుకు తోడ్పడ్డాయన్నారు. రైతుబీమా అమలవుతున్నట్లుగానే నేత, గీత కార్మికులకు బీమా సదుపాయం కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 


గిరిజనుల కన్నా దయనీయ స్థితిలో దళితులు

రెక్కల కష్టం తప్ప.. మరే ఆస్తి లేని దీన స్థితిలో దళిత ప్రజలు ఉన్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ఇరవై శాతం జనాభా ఉన్న దళితుల చేతుల్లో ఉన్న సాగుభూమి  కేవలం పదమూడు లక్షల ఎకరాలేనని, వారి పేదరికానికి ఇంతకు మించిన గీటురాయి లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్థితుల్లో దళితులు ఉన్నారని తెలిపారు. అరకొర సహాయాలతో దళితుల అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే దళితబంధులో ఒక యూనిట్‌ పెట్టుకోవడానికి రూ.10 లక్షల పెద్ద మొత్తం ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. బ్యాంకులతో అనుసంధానం పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆదాయంలో, ఆర్థిక స్థితిలో మెరుగుదల రాదని అన్నారు. లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెద్ద పెట్టుబడితో  పెద్ద యూనిట్‌ పెట్టుకునే అవకాశాన్ని దళితబందు పథకం ద్వారా కల్పించాలనే సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. లబ్ధిదారుడు ఎంచుకున్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వ శాఖ శిక్షణ అవగాహన కల్పించాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది. శిక్షణ, పర్యవేక్షణ కోసం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వివిధ శాఖల అధికారులతో, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.


అమలులో జిల్లా కలెక్టర్‌, జిల్లా మంత్రి కీలక పాత్ర పోషిస్తారని ముఖ్యమంతి తెలిపారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో  ‘‘సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ ప్రైజ్‌’’ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. యూనిట్‌ పెట్టగానే ప్రభుత్వ బాధ్యత తీరిపోదని, యూనిట్‌ సరిగ్గా నడుస్తుందా? లేదా? అన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షించడం కూడా ముఖ్యమని మంత్రివర్గం తీర్మానించింది. పథకం అమలుకు పటిష్టమైన యంత్రాంగం అవసరమని, వివిధ శాఖల్లో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారాన్ని సమర్పించాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించింది. దళిత బంధు లబ్ధిదారులకు  అందజేసే ప్రత్యేక కార్డు నమూనాలను కేబినెట్‌ పరిశీలించింది. కాగా, దళిత వాడల్లో యుద్థ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, మిగతా గ్రామంతో సమానంగా అన్ని హంగులూ ఏర్పడాలని, ఇందుకు నిధుల కొరత లేదని సీఎం స్పష్టం చేశారు.


57 ఏళ్లకు పెన్షన్‌ ప్రక్రియను ప్రారంభించాలి..

వృద్ధాప్య ఫెన్షన్లకు అర్హతను 57 ఏళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. కుటుంబంలో ఒక్కరికే ఫించను పద్ధతిని కొనసాగిస్తూ.. భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్‌ బదిలీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కాగా.. ధోబీ ఘాట్‌లకు, హెయిర్‌ కటింగ్‌ సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని నిర్దేశించారు.


ఎస్‌ఎల్‌బీసీ పనుల ప్రారంభానికి ఆమోదం

నల్లగొండ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించేందుకు శ్రీశలం ఎడమగట్లు నుంచి ప్రారంభించిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులను పునఃప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం నీటిపారుదల శాఖ సమర్పించిన ప్రతిపాదనల్ని ఆమోదించింది. సొరంగమార్గం తవ్వకంలో నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన విద్యుత్తును నిరంతరంగా అందించాలని విద్యుత్తుశాఖను ఆదేశించింది. దీంతోపాటు ఉదయసముద్రం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం (బ్రాహ్మణ వెల్లెంల)ను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపింది.


దళిత బంధుకు భద్రత కల్పిస్తూ ప్రత్యేక చట్టం! 

‘తెలంగాణ దళిత బంధు’ పథకానికి రాష్ట్ర కేబినెట్‌ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. దళిత జాతి కష్టాలు తీర్చడానికి ప్రవేశపెడుతున్న ఈ పథకం అమలుకు సంబంధించి మంత్రివర్గ సభ్యులు సూచనలు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కోరారు. కాగా, దళితబంధు పథకానికి చట్టభద్రత కల్పిస్తూ ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేబినెట్‌ అభిప్రాయపడింది. గతంలో ఎస్సీ ప్రగతి నిధి చట్టం తెచ్చి, ఒక వార్షిక బడ్జెట్‌లో దళితులకు కేటాయించిన నిధులలో మిగిలిన నిధులను తరువాతి వార్షిక బడ్జెట్‌కు బదలాయించే విధానం తీసుకొచ్చామని పేర్కొంది.  ఆ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దళిత బంధు కూడా దేశానికి దారి చూపే పథకం అవుతుందనీ మంత్రివర్గం అభిప్రాయపడింది. 


‘దళిత బంధు’ వెనుక.. రాజకీయ కోణం లేదు: కేసీఆర్‌ 

దళిత బంధు పథకం వెనుక రాజకీయ కోణం లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. సామాజిక స్పృహతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కేబినెట్‌ భేటీలో ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకం అమలుకు ఎంచుకున్న సమయంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. ‘‘దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కోసమే తెరపైకి తెచ్చారని, రాజకీయాల కోసమే అమలు చేస్తున్నారనే చిల్లరగాళ్లు ఐదు శాతమే ఉన్నారు. మిగిలిన 95 శాతం మంది ఈ పథకాన్ని స్వాగతిస్తున్నారు’’ అని సీఎం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి దళిత బంధు పథకం అమలుపై సానుకూలత వ్యక్తమవుతోందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లటంలో మంత్రులందరూ మమేకం కావాలని ఆదేశించారు. ఎన్నో ఏళ్లుగా అణగారిపోయిన దళితుల్లో ఒక నమ్మకం కలిగించటానికి, వారికి భద్రత కల్పించటానికి ఈ పథకాన్ని తీసుకు వచ్చామని చెప్పారు. సమాజంలో ఒక వర్గం అత్యంత దయనీయంగా ఉండకూడదనే సదాశయంతో అమలు చేస్తున్న ‘దళిత బంధు’పై వస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని నిర్దేశించారు.


ఇక రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, కొన్ని సరిహద్దు జిల్లాలతోపాటు, హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కేసుల నమోదు ఎక్కువగా ఉందన్నారు. వాటిని కూడా అదుపులోకి తీసుకురావాల్సి ఉందని, ఈ దిశగా ప్రజలను చైతన్యపరచాలని చెప్పారు. కాగా, నెల్లికల్‌ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేబినెట్‌ సమావేశం ముగిసే వరకు అధికారులు ఉండటంతో సీఎం కేసీఆర్‌ ఎజెండాకే పరిమితమయ్యారని సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, వాటి భర్తీపై ఈసారి చర్చ జరగలేదని తెలిసింది. అలాగే సీఎం కేసీఆర్‌ మంత్రులతో ప్రత్యేకంగా రాజకీయపరమైన అంశాలను చర్చించలేదని సమాచారం.

Updated Date - 2021-08-02T07:05:13+05:30 IST