రెండో విడతకు కసరత్తు

ABN , First Publish Date - 2022-09-09T06:14:13+05:30 IST

దళిత బంధు రెండో విడత పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరిన్ని దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఇటీవల కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

రెండో విడతకు కసరత్తు
దళితబంధు కింద పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన ట్రాక్టర్లు

- దళిత బంధుపై పెరుగుతున్న ఆశలు

- కేబినెట్‌ తీర్మానంతో ఎమ్మెల్యేల కసరత్తులు

- జిల్లాకు మరో ఆరు వేల యూనిట్లు

జగిత్యాల, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): దళిత బంధు రెండో విడత పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరిన్ని దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఇటీవల కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. తొలి విడత పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి వంద యూనిట్లు అందించగా రెండో విడతలో 1500 యూనిట్ల చొప్పున అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా పరిదిలో కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాలతో పాటు చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని కొడిమ్యాల, మల్యాల, వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్‌, మేడిపల్లి ప్రాంతాలకు మొత్తం 6,000 యూనిట్లు మంజూరయ్యాయి. ఇందులో మొదటగా ఒక్కో నియోజకవర్గానికి 500 చొప్పున యూనిట్లకు గ్రౌండింగ్‌ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 2,000 దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. తొలి విడతలో దళితబంధు పథకం కింద ఎంపికయిన లబ్ధిదారులకు అధికారులు ఇప్పటికే యూనిట్లు మంజూరు చేయగా పలువురు ఉపాధి పొందుతున్నారు. తాజాగా రెండో విడత కింద యూనిట్లు మంజూరు కానుండడంతో ఆయా వర్గాల్లో ఆశలు పెరుగుతున్నాయి.

శాసనసభ్యుల ఆమోదంతోనే...

దళితబంధు పథకం కింద లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం శాసనసభ్యులకు అప్పగించింది. సాధ్యమైనంత తొందరలో లబ్ధిదారుల జాబితా అందించాలని అధికారులు కోరారు. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రతిపాదించిన వ్యక్తులకే యూనిట్లు మంజూరు కానున్నాయి. ఈ పథకం కింద లబ్ధిపొందడానికి ఆసక్తి చూపుతున్న యువకులు శాసనసభ్యుల ఆశీస్సులు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలతో పాటు చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల పరిధిలోని యువత శాసన సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేయడం శాసనసభ్యులకు కత్తిమీద సాములా మారింది. అర్హులైన కుటుంబాలు వేల సంఖ్యలో ఉండగా వందల సంఖ్యలోనే మంజూరు లభిస్తుండడంతో ఇరకాటంలో పడుతున్నారు. తమ అనుచరవర్గానికి, కనుసన్నలలో ఉండే కుటుంబాలకు లబ్ధిచేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రామంలో ఒకటి, రెండు కుటుంబాలకు లబ్ధిచేకూరిస్తే మిగిలిన కుటుంబాలకు దూరం కావాల్సి వస్తోందేమోనన్న అభిప్రాయంతో ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు జాబితాతయారీ, ఎంపిక బాధ్యతలను సంబంధిత కులసంఘాలకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారు. అర్హులైన ఒకరు, ఇద్దరు పేర్లను ప్రతిపాదించాలని సూచిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు తామే ఎంపిక బాధ్యతను భుజస్కందాలపై వేసుకొని ముందుకు వెళ్తున్నారు.

 అనుచరుల ప్రయత్నాలు

లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా ఎమ్మెల్యేల పరిధిలోనే ఉండటంతో ఆయా ప్రజాప్రతినిధుల అనుచరులు, నేతలు లబ్ధిపొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అర్హత లేకున్నా తెలిసిన వారికి ఇప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. కొన్నిచోట్ల దళిత యువకులతో ఒప్పందాలు చేసుకుని బినామీ పేర్లతో లబ్ధిపొందేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దళితబంధు ఇప్పిస్తామంటూ కొన్ని చోట్ల దళారులు దందాకు తెరలేపినట్లు వినిపిస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆయా వర్గాల ప్రజలు కోరుతున్నారు. 

 తొలివిడతలో 345 యూనిట్ల గ్రౌండింగ్‌.

జిల్లాలో తొలివిడత 345 యూనిట్ల అధికారులు గ్రౌండింగ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ పకడ్భందీగా దళితబంధు ప్రక్రియను నిర్వహించారు. జగిత్యాల నియోజకవర్గంలో 100 యూనిట్లు, కోరుట్ల నియోజకవర్గంలో  100 యూనిట్లు, ధర్మపురి నియోజకవర్గంలో 81 యూనిట్లు, చొప్పదండి నియోజకవర్గం పరిదిలోని కొడిమ్యాల, మల్యాల మండలాల్లో 34 యూనిట్లు, వేములవాడ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లి, కథలాపూర్‌ మండలాల్లో 30 యూనిట్లు అధికారులు గ్రౌండింగ్‌ చేశారు. లబ్ధిపొందిన వారు ఉపాధి పొందుతున్నారు.


పకడ్బందీగా అమలు చేస్తాం

- లక్ష్మీనారాయణ, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్‌ 

జిల్లాలో దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. ఇప్పటికే తొలివిడత 345 యూనిట్లను గ్రౌండింగ్‌ చేశాము. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండో విడత అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇప్పటికే శాసనసభ్యులను సాధ్యమైనంత తొందరలో జాబితా రూపొందించాలని కోరాము. 

Updated Date - 2022-09-09T06:14:13+05:30 IST