సాగరానికి బిరబిరా

ABN , First Publish Date - 2021-07-30T07:40:53+05:30 IST

జూరాల నిండింది.. శ్రీశైలం గేట్లు తెరుచుకున్నాయి.. వరద ఇంకా ఇంకా పెరుగుతోంది. నాగార్జున సాగర్‌ వైపు కృష్ణమ్మ వేగంగా కదిలివస్తోంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాలకు ప్రధాన

సాగరానికి బిరబిరా

2, 3 రోజుల్లో డ్యాం గేట్లు ఎత్తే చాన్స్‌..

శ్రీశైలానికి 5.37 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం

పది గేట్లు ఎత్తిసాగర్‌కు 4.38 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల..

జూరాల 47 గేట్ల ద్వారా దిగువకు నీరు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

జూరాల నిండింది.. శ్రీశైలం గేట్లు తెరుచుకున్నాయి.. వరద ఇంకా ఇంకా పెరుగుతోంది. నాగార్జున సాగర్‌ వైపు కృష్ణమ్మ వేగంగా కదిలివస్తోంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాలకు ప్రధాన సాగునీటి వనరైన ఈ ప్రాజెక్టు మరో మూడు రోజుల్లో నిండనుంది. ఈ నేపథ్యంలో 2, 3 రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 590 అడుగులు (312.04 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 549.50 అడుగుల (208.67 టీఎంసీలు) మేర నీరుంది. నిండాలంటే మరో 104 టీఎంసీలు అవసరం. ఒకవైపు కృష్ణా, మరోవైపు తుంగభద్ర, ఇంకోవైపు సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి గంటగంటకు పెరుగుతోంది.


గురువారం రాత్రి 7 గంటలకు ఉన్న సమాచారం ప్రకారం 5.37 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరింది. బుధవారం రాత్రి రెండు గేట్లు ఎత్తగా.. గురువారం ఉదయానికి పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తారు. విద్యుదుత్పాదనతో కలిపి మొత్తంగా 4.38 లక్షల క్యూసెక్కులను సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి మరో నాలుగు రోజులు భారీ వరద కొనసాగుతుందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగుల (215.80 టీఎంసీలు)కు గాను 884.30 అడుగులకు (211.47 టీఎంసీలు) చేరింది. కాగా, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులకు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర రిజర్వాయర్‌కు 69,410 క్యూసెక్కుల వరద వస్తుండగా గేట్లు ఎత్తడం, విద్యుత్‌ ఉత్పాదన, కాలువల ద్వారా 86,771 క్యూసెక్కులను కిందకు పంపుతున్నారు.


దీంతో జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతోంది. గురువారం 47 గేట్లను ఎత్తి 4.71 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు. పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. 27,890 క్యూసెక్కుల వరద వస్తుండటంతో ఒక గేటును 1.5 మీటరు మేర ఎత్తి 14,089 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 13,200 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ 80మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. తెలంగాణ వైపు ఉన్న శ్రీశైలం రెండో విద్యుదుత్పత్తి కేంద్రంలో 31,783 క్యూసెక్కులతో 16.84 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.  


మూడు రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. తెలంగాణపై ప్రస్తుతం అల్పపీడన ప్రభావం ఏమీ లేదన్నారు. బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం... రాగల 48 గంటల్లో పశ్చిమ దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, బిహార్‌ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-07-30T07:40:53+05:30 IST